ETV Bharat / spiritual

'కుమారధార తీర్థం'- ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తే సకల పాపాలు హరించడం ఖాయం!

కుమారధార తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ముక్కోటి ఉత్సవం- దీని విశేషాలు మీ కోసం!

Kumaradhara Theertha Mukkoti 2026
Kumaradhara Theertha Mukkoti (TTD)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 5:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kumaradhara Theertha Mukkoti 2026 : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన పవిత్ర తిరుమల గిరుల్లో ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. అయితే అనేక తీర్థాలు అదృశ్యంగా శేషాచల కొండల్లో ప్రవహిస్తూ ఉండగా వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని తీర్థాలు మాత్రం దర్శనీయ తీర్థాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ పుణ్యతీర్థాలకు ప్రతి ఏడాది తీర్థ ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. ఈ క్రమంలో తిరుమల గిరుల్లో వెలసి ఉన్న కుమారధార తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ముక్కోటి ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కుమారధార తీర్థం ముక్కోటి ఎప్పుడు?
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అనగా మార్చి 3, మంగళవారం తిరుమలలోని కుమారధార తీర్థానికి ముక్కోటి ఉత్సవం జరుగనుంది.

కుమారధార తీర్థం ఎక్కడుంది?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల ఆనంద నిలయానికి వాయవ్య దిశలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కుమారధార తీర్థం వెలసి ఉంది.

కుమారధార తీర్థం ముక్కోటి విశిష్టత
తిరుమల శేషాచలం అడవుల్లోని అత్యంత పవిత్రమైన తీర్థాలలో కుమారధార తీర్థం ఒకటి. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు జరిగే కుమారధార తీర్థ ముక్కోటి అత్యంత విశేషమైనది. ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు హరించి, యవ్వనం ప్రాప్తిస్తుందని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం కుమారస్వామి ఈ ప్రదేశంలోనే అష్టాక్షరి మంత్రాన్ని జపించాడని, అందుకే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు పద్మ, మార్కండేయ, వరహా, వామన పురాణాల్లో కుమారధార తీర్థానికి సంబంధించి భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి.

బాలునిగా మారిన వృద్ధుడు
పూర్వం కళ్లు కనబడని, చెవులు వినిపించని ఒక వయోవృద్ధుడు ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరిస్తుండగా సాక్షాత్తు శ్రీనివాసుడు అతని ముందు ప్రత్యక్షమై అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు తాను తపస్సు చేసి దైవ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాని సమాధానం చెబుతాడు. అప్పుడు శ్రీనివాసుడు అతనితో అక్కడకు సమీపంలో ఉన్న కుమారధార తీర్థంలో స్నానం చేయమని చెప్పి అదృశ్యమవుతాడు. స్వామి ఆదేశం మేరకు ఆ వృద్ధుడు అక్కడి తీర్థంలో స్నానం చేయగానే వెంటనే పరిపూర్ణ ఆరోగ్యవంతుడైన బాలునిగా మారిపోతాడు. వృద్ధుడు కుమారుడిగా మారిన తీర్థం కాబట్టి ఈ తీర్థానికి కుమారధార తీర్థమని పేరు వచ్చింది. ఈ సంఘటన జరిగింది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఆనాటి నుంచి ఇక్కడ ఫాల్గుణ పౌర్ణమి రోజు కుమారధార తీర్థంలో ముక్కోటి ఉత్సవాన్ని జరపడం సంప్రదాయంగా మారింది.

సుబ్రహ్మణ్యస్వామి తరించిన పుణ్య తీర్థం
వామన, పద్మ పురాణాల్లో వివరించిన ప్రకారం తారకాసుర సంహారం అనంతరం కుమారస్వామి శేషాచలం కొండల్లో అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించినట్లుగా తెలుస్తోంది. అనంతరం కుమారస్వామి ఫాల్గుణ పౌర్ణమి రోజునే ఈ తీర్థంలో స్నానం చేసి శాపవిమోచనం పొందినట్లుగా పురాణాలలో వివరించి ఉంది. కుమారస్వామి స్నానం చేసిన తీర్థం కాబట్టి ఈ తీర్థానికి కుమారధార తీర్థమని పేరు వచ్చింది. అలాగే స్వామి స్నానం ఆచరించిన ఫాల్గుణ పౌర్ణమి రోజున ముక్కోటి ఉత్సవాన్ని జరపడం సంప్రదాయంగా మారింది.

శాస్త్రోక్తంగా ఇలా
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు శ్రీవారి ఆలయ అర్చకులు ఉద‌యం 7.30 గంట‌ల‌కు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు త‌దిత‌ర‌ పూజా సామగ్రిని కుమారధార తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ‌తారు. అక్క‌డున్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు. అయితే ఈ ఏడాది ఇదే రోజు చంద్రగ్రహణం ఉన్నందున భక్తులను ఉదయం 9 గంటల వరకే అనుమతిస్తారని టీటీడీ అధికారులు తెలియజేస్తున్నారు.

మోక్ష కారణం
కుమారధార తీర్థ ముక్కోటి రోజు ఈ తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వాసం. మార్చి 3, మంగళవారం జరుగనున్న కుమారధార తీర్థ ముక్కోటి మనం కూడా తరలి వెళ్దాం. పుణ్య స్నానాలు చేసి తరిద్దాం.

ఓం నమో వేంకటేశాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.