ETV Bharat / spiritual

అభిషేకం చేస్తే నీలిరంగులో మారే పాలు- రాహు దోషాలను తొలగించే నవగ్రహ క్షేత్రం- నాగనాథ స్వామి విశేషాలివే!

తమిళనాడులోని తిరునగేశ్వరం నాగనాథ స్వామి ఆలయం- నవగ్రహ క్షేత్రాల్లో రాహు గ్రహానికి అంకితమైన అత్యంత పవిత్రమైన క్షేత్రం

Thirunageswaram Naganatha Swamy Temple
Thirunageswaram Naganatha Swamy Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 30, 2026 at 2:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

Thirunageswaram Naganatha Swamy Temple : తమిళనాడులో నవగ్రహాలకు ప్రత్యేకంగా ఆలయాలు ఉన్న విషయం తెలిసిందే! నవగ్రహాల క్షేత్రాల దర్శనం వల్ల కొన్ని వేల జన్మల నుంచి పీడిస్తున్న గ్రహదోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎందరో పురాణ పురుషులు ఈ నవగ్రహాల క్షేత్రాలను సందర్శించి గ్రహదోషాలు నుంచి విముక్తి పొందిన కథలు ఆధ్యాత్మిక గ్రంథాలలో కోకొల్లలుగా ఉన్నాయి.

శాస్త్రీయ విజ్ఞానానికి అందని రహస్యాలు
హిందూ సంప్రదాయం దేవీదేవతలతో పాటు నాగపాములకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. మన పురాణాల్లో కూడా నాగ లోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి అభూతకల్పనలే అని కొట్టిపడేసే హేతువాదులు కూడా ఉన్నారు. అయితే శాస్త్రీయ విజ్ఞానానికి అందని వింతలు, శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి.

సైన్స్ కు అందని అద్భుతాలు మన ఆలయాలు
ఎందరో శాస్త్రజ్ఞులు, ఎన్నో పరిశోధనలు చేసి కొన్ని ఆలయాలు సైన్స్ కు అందని అద్భుతాలు అని తేల్చి చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహువు ఆలయం. రాహువుకు చెందిన ఈ ఆలయం నాగనాథస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం కుంభకోణం నగర౦ నుంచి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది.

తిరునగేశ్వరం నాగనాథ స్వామి ఆలయ విశేషాలు
తిరునగేశ్వరం నాగనాథస్వామి ఆలయంలో పరమేశ్వరుడు నాగనాథస్వామిగా తన సతి గిరి గుజాంబికతో కలిసి వెలసి ఉన్నాడు. ఈ క్షేత్రంలో ప్రధాన దైవమైన నాగనాథస్వామికి ఇరువైపులా సరస్వతి, లక్ష్మీదేవి వెలసి ఉండడం విశేషం.

భార్యలతో వెలసిన రాహువు
తిరునగేశ్వరం నాగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక మందిరంలో వెలసిన రాహు భగవానుని దర్శించుకోవచ్చు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాహువు ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లితో కలిసి దర్శనమిస్తాడు. రాహువు ఒక శాపం నుంచి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. సాధారణంగా ఇతర నవగ్రహ దేవాలయాలలో రాహువు సర్ప ముఖంతో దర్శనమిస్తే, నాగనాధ్ స్వామి ఆలయంలో మాత్రం రాహువు మానవ ముఖాన్ని కలిగి ఉండటం విశేషం. జ్యోతిష్య శాస్త్రం రాకారం నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.

ఆకట్టుకునే చోళుల నిర్మాణ శైలి!
ఈ ఆలయంలో రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది. ఆలయ ప్రాంగణంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. చూడటానికి కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది.

నీలిరంగులో మారే పాలు
ఈ ఆలయంలో ప్రధానంగా పూజలందుకుంటున్నది రాహువు. నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో రాహువు విగ్రహం మీద పాలు పోస్తే, అవి నీలి రంగులోకి మారి, కిందకు జారి పడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయి. రాహు దోషం ఉన్నవారు, నాగ దోషం ఉన్నవారు ఈ ఆలయంలో రాహుకాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుంచి దిగగానే, గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోకి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య విశేషం.

నాగమణినే కారణమా?
ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి నాగమణినే కారణమని పురాణాల కథనం. విష్ణు పురాణం, గరుడ పురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన ఉంది.

ఎలా చేరుకోవాలి?
ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి 10:30 లోపు కానీ, ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6:30 మధ్యలో కానీ వెళ్లాలి. కుంభకోణం వరకు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి రైలు సౌకర్యాలున్నాయి. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరం ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

మనం కూడా తిరునగేశ్వరం ఆలయాన్ని సందర్శించి సకల గ్రహ దోషాలు నుంచి విముక్తి పొందుదాం.

ఓం రాహవే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

జగన్నాథుని రథయాత్రకు ముందు జరిగే మహా వేడుక- 15 రోజులు ఎందుకు దర్శనం ఉండదు?

కులమతాలకు అతీతంగా భక్తి సందేశం చాటిన మహనీయుడు కబీర్‌దాస్- ఆయన జీవితంలోని ఆశ్చర్యకర విశేషాలివే!