అమ్మవారికి పసుపు మాల- దాని వెనుక అసలు కారణమేంటో తెలుసా?
పసుపు కొమ్ముల మాల వెనుక ఉన్న అద్భుతమైన పౌరాణిక నేపథ్యం- శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కొమ్ముల మాల సమర్పించడం వల్ల కలిగే లాభాలు

Published : February 27, 2026 at 5:57 AM IST
Yellow Horn Mala Significance : అమ్మవారు అనగానే ఆదిపరాశక్తి దుర్గాదేవి గుర్తుకు వస్తుంది. సౌభాగ్య సిద్ధి కోసం, దృష్టి దోష నివారణ కోసం అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేయడం అనేది ఒక ఆచారం. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ అంతరార్థం దాగి ఉంది. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేయడం వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం, అంతరార్థం ఉంది. దేవీ భాగవతం, ఇతర శాక్తేయ గ్రంథాల ప్రకారం పసుపు కొమ్ముల మాల వేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ అంతరార్థం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అమ్మవారికి పసుపు కొమ్ముల మాల ఎందుకు వేస్తారు?
పసుపు అనేది సౌభాగ్యానికి, మంగళానికి చిహ్నం. అమ్మవారు స్వయంగా పసుపు వర్ణంలో ప్రకాశిస్తుంటారు. అందుకే ఆ తల్లిని మంగళ రూపిణి అంటారు. పసుపు కొమ్ములు భూమి నుంచి ఉద్భవించిన స్వచ్ఛమైన ప్రకృతి ప్రసాదాలు. అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా భావిస్తాం కాబట్టి, ఆమెకు ఇష్టమైన పసుపు కొమ్ములతో మాల వేసి ఆరాధిస్తాం. శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కొమ్ముల మాల సమర్పించడం మంచిది.
పసుపు కొమ్ముల మాల వేయడంలో అంతరార్థం ఏమిటి?
జన్మరాహిత్యం: పసుపు కొమ్మును భూమిలో పాతిపెడితే మళ్లీ మొలకెత్తుతుంది. కానీ దానిని ఉడికించి ఎండబెడితే అది మళ్లీ మొలకెత్తదు. మనలోని అరిషడ్వర్గాలను, కోరికలు దహించి వేసి, పునర్జన్మ లేకుండా తనలో ఐక్యం చేసుకోమని అమ్మవారిని వేడుకోవడమే ఈ పసుపు కొమ్ముల మాల వేయడంలో అంతరార్థం.
ప్రతికూల శక్తులు తొలగించడం
పసుపు ఒక అద్భుతమైన క్రిమిసంహారిణి. పసుపు మాల వేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం.
పసుపు కొమ్ముల మాల ఎలా వేయాలి?
అమ్మవారికి వేసే పసుపు కొమ్ముల మాలలో ఉండాల్సిన పసుపు కొమ్ముల సంఖ్య మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా 108 కొమ్ములతో మాల తయారు చేస్తారు. అష్టోత్తర శత నామావళికి ప్రతీకగా 108 కొమ్ములతో మాల వేయడం అత్యంత శ్రేష్ఠమని శాస్త్రం చెబుతోంది. వీలు కాని వారు అందులో సగమైనా 54 కొమ్ములతో కూడా మాల తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. కనీసం 21 లేదా 11 కొమ్ములతో మాల తయారు చేసుకోవడం శ్రేయస్కరం. పసుపు కొమ్ముల మాల వేసేటప్పుడు పసుపు దారంతోనే మాల కట్టడం చాలా ముఖ్యం. వీలైతే ఆ మాల కట్టేటప్పుడు లలితా సహస్రనామాలు పఠించడం మంచిది.
పసుపు కొమ్ముల మాల ఫలితం ఏమిటి?
వివాహం ఆలస్యం అవుతున్న వారు అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేస్తే త్వరగా కల్యాణ యోగం కలుగుతుంది. ముత్తైదువులు సౌభాగ్యం కోసం, భర్త శ్రేయస్సు కోసం అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేస్తారు.
దృష్టి దోష నివారణ
ఇంట్లో లేదా వ్యాపారంలో నరఘోష, దృష్టి దోషాలు అధికంగా ఉన్నవారు అమ్మవారికి ఈ పసుపు కొమ్ముల మాల సమర్పిస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి.
పసుపు కొమ్ముల మాల వెనుక ఉన్న పౌరాణిక గాథ
పురాణాల ప్రకారం, అమ్మవారు శుంభ-నిశుంభులనే రాక్షసులను సంహరించే క్రమంలో, వారి సైన్యాధిపతి రక్తబీజుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది. రక్తబీజుడి రక్తం నేల మీద పడితే మళ్లీ వందలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. యుద్ధం వల్ల కలిగే ఉగ్రతను, తాపాన్ని తగ్గించుకోవడానికి, యుద్ధంలో కలిగే గాయాల నుంచి ఉపశమనానికి అమ్మవారు ప్రకృతి ప్రసాదమైన పసుపును ఆశ్రయించిందని దేవీభాగవతంలో వివరించి ఉంది. పసుపులోని క్రిమిసంహారక గుణం, శాంతిని ఇచ్చే స్వభావం వల్ల అమ్మవారు ఉగ్రరూపాన్ని వీడి ప్రశాంతంగా మారుతుంది. అందుకే ఆమె చల్లని చూపు కోసం పసుపు కొమ్ముల మాల వేస్తాం.
ప్రకృతి సంబంధం
గాయత్రీ హృదయంలో చెప్పినట్లుగా, అమ్మవారు 'విరాడ్రూపిణి'. అంటే ఈ సృష్టి లోని ప్రతి అణువు ఆమె స్వరూపమే! పసుపులో పృథ్వీ తత్త్వం ఉంటుంది. గాయత్రీ హృదయం ప్రకారం, అమ్మవారి పాదాలు పృథ్వీ లోకానికి ప్రతీకలు. భూమి తనలోని సారాన్నంతటినీ ఒక కొమ్ము రూపంలో దాచి పెడితే అది పసుపు కొమ్ము అవుతుంది. భూమి సంపూర్ణ శక్తిని అమ్మవారికి మాలగా సమర్పించడంలోని రహస్యం ఇదే!
ఎందుకు అమ్మవారికే వేస్తారు?
హిందూ సంప్రదాయంలో స్త్రీకి 'పసుపు' సౌభాగ్య చిహ్నం. పార్వతీ దేవి తన ఒంటి నలుగు మిశ్రమం నుంచే కదా వినాయకుడిని సృష్టించింది. అంటే పసుపులో సృజనాత్మక శక్తి ఉంది. ఆ శక్తి అమ్మవారికే సొంతం కాబట్టి పసుపు మాల ఆమెకు ప్రీతిపాత్రం. లలితా సహస్రనామం ప్రకారం అమ్మవారిని 'హరిద్రా కుంకుమ ప్రియ' అని పిలుస్తారు. అంటే పసుపు, కుంకుమలంటే అమ్మవారికి అమితమైన ఇష్టం.
పసుపు కొమ్ము మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
పసుపు కొమ్ము మాల వేయడం అంటే మనలోని "అజ్ఞానాన్ని" వదిలించుకోవడం. పసుపు కొమ్ములను దారంతో బంధించి అమ్మవారి పాదాల చెంత ఉంచడం వల్ల మన మనస్సు పసుపు లాగే పవిత్రంగా, మంగళకరంగా మారుతుందని భక్తుల విశ్వాసం. అమ్మవారికి పసుపు మాల వేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ కలుగుతాయి.
ఓం శ్రీ మాత్రే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

