ETV Bharat / spiritual

నేటికీ దర్శనమిస్తున్న రామానుజాచార్యులు- యోగ ముద్రలో ఉన్న ఆయన భౌతికకాయం ఎక్కడుందో తెలుసా?

900 ఏళ్ల తర్వాత కూడా సజీవంగా దర్శనమిస్తున్న రామానుజాచార్యుల దివ్య దేహం- అది ఎక్కడుందో తెలుసా?

Sri Ramanujacharya
Sri Ramanujacharya (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 4:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

Body Of Sri Ramanujacharya : హిందూ ధర్మ శాస్త్రం గురువుకు పెద్ద పీట వేసింది. భగవంతుని చేరుకోవడానికి సులువైన మార్గం గురువును ఆశ్రయించడమే అని సనాతన ధర్మం చెబుతోంది. వ్యాస భగవానుని నుంచి ఆదిశంకరుల వరకు ఎందరో గురువులు భరతభూమిపై ధర్మసంస్థాపన కోసం ఎనలేని కృషి చేసారు. వారిలో విశిష్టాద్వైత ప్రబోధకుడు రామానుజాచార్యులు కూడా ఒకరు. పూజ్య గురువులు రామానుజాచార్యులు నేటికీ సజీవంగా ఉన్నారని భావించే ప్రదేశం ఎక్కడుంది? ఆ వివరాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

భగవద్ భక్తుడు రామానుజాచార్యుడు
వేదానికి సరైన అర్థం చెప్పి, విశిష్టాద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు రామానుజాచార్యుడు. రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో జన్మించారు. దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.

మహాజ్ఞాని
ఒకానొక సమయంలో కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులకు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలు ఉంచగా తెల్లవారి చూసేసరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. స్వామి ధరించిన శంఖు చక్రాలతో శివకేశవుల అభేద భావం ప్రస్ఫుటమైంది. అంతేకాదు తిరుమల వేంకటేశ్వరుని నిత్య కైంకర్యాలు, సేవలను కూడా రామానుజాచార్యులు నిర్ణయించారు.

శివైక్యం
ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలు ప్రతిపాదించిన రామానుజులు క్రీస్తు శకం 11 - 12 శతాబ్దాల మధ్య శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. మరణానికి ముందు రామానుజులు తన శిష్యులను పిలిచి తాను త్వరలో శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరుకోనున్నట్లు తెలిపారు. దానితో శిష్యులు దుఃఖంతో తమను విడిచి వెళ్లవద్దంటూ రామానుజులను ప్రార్థించారు. వారి దుఃఖాన్ని చూసిన రామానుజులు మరో మూడు రోజులు భూమిపై ఉండేందుకు అంగీకరించారు.

శ్రీరంగంలో కైవల్యం
మరణానికి ముందు మూడు రోజుల పాటు రామానుజులు శ్రీరంగం క్షేత్రంలో దివ్య ప్రబంధం పారాయణ చేస్తూ చివరి రోజు తన గురువైన యమునాచార్యులు పాదపద్మములకు నమస్కరించాడు. అనంతరం పద్మాసనంలో ధ్యాన ముద్రలో ధ్యానంలో మునిగి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు.

సుగంధ లేపనాలతో భద్రంగా
రామానుజులు కైవల్యం చెందగానే ఆయన శిష్యులు నంబి తదితరులు శోకసముద్రంలో మునిగిపోయారు. కొంత తేరుకున్న తర్వాత గురువును తమతోనే శాశ్వతంగా ఉంచుకోవాలని భావించారు. గురువుగారి పార్థివ దేహానికి పచ్చకర్పూరం, ఎర్ర సింధురాన్ని లేపనాలుగా పూశారు.

శ్రీరంగంలో సజీవంగా
శ్రీరంగంలో శ్రీ రంగనాథుని ఆలయం ప్రసిద్ధి చెందినది. భగవద్ రామానుజులు పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని అక్కడే శరీరాన్ని విడిచిపెట్టారు. ఈనాటికి అక్కడ ఉన్న యతిరాజ మందిరంలో శ్రీరామానుజుల శరీరాన్ని దర్శించుకోవచ్చు. ఇది విగ్రహం కాదు. శ్రీ రామానుజుల సజీవరూపం.

ఏడాదికి రెండుసార్లు ఉత్సవం
క్రీస్తు శకం 11 - 12 శతాబ్దాల మధ్య రామానుజాచార్యులు శరీరాన్ని విడిచి పెట్టినప్పటికీ, ఆనాటి నుంచి కొన్ని ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. ఏటా రెండుసార్లు రామానుజుల కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

నిగూఢ రహస్యం
శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యులు దివ్య దేహానికి సంబంధించిన అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. శ్రీరంగం పర్యటనకు వెళ్లినప్పుడు మనం కూడా గురు రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పకుండా సందర్శించి కైవల్యాన్ని పొందుదాం. శ్రీ గురుభ్యోనమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.