ETV Bharat / spiritual

ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశిష్టత- ఒక్కసారి దర్శిస్తే కుజ, నాగసర్ప దోషాలు తొలగడం ఖాయం!

కర్ణాటకలోని ప్రాచీన శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశిష్టత- ఏడు తలల సర్పరూపంలో దర్శనమిచ్చే స్వామి వారికి, పుట్ట మట్టి ప్రసాదం విశేషాలు!

Prasanna Subrahmanya Swamy Temple
సుబ్రహ్మణ్య స్వామి (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 4:00 AM IST

4 Min Read
Choose ETV Bharat

Prasanna Subrahmanya Swamy Temple: దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా జరుగుతుంది. స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజ గ్రహానికి అధిపతి అని తెలుస్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకరీత్యా కుజ దోషం కానీ నాగసర్ప దోషం కానీ ఉన్నట్లయితే వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగడంతో ఇబ్బందులు, వంశాభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. సాధారణంగా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కుజగ్రహానికి దోష నివారణ పూజలు జరిపించుకోవడంతో పాటు ప్రాచీన సుబ్రహ్మణ్యుని క్షేత్రాలు దర్శించడం కూడా శ్రేష్ఠమని పండితులు చెబుతారు. దక్షిణాదిన అనేక సుబ్రహ్మణ్యుని ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఓ ప్రాచీన ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సుబ్రహ్మణ్య స్వామి పవిత్ర క్షేత్రాలు - ఆరుపడైవీడు
షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యుడు ఆరు ప్రాంతాల్లో స్వయంభువుగా వెలసి పూజలందుకుంటున్నాడు. ఈ ఆరు క్షేత్రాలను షణ్ముఖుని స్వంత ఇళ్లుగా పేర్కొంటారు. అవే తిరుచెందూర్, స్వామిమలై, తిరుప్పుఱకుండ్రం, పళని, తిరుత్తణి, పజముదిర్చోలై! అయితే ఇవి మాత్రమే కాకుండా కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం, తమిళనాడులోని కోయంబత్తూరుకు సమీపంలో ప్రసిద్ధ మరుదమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వంటి మరికొన్ని ఆలయాలు కూడా అత్యంత మహిమాన్వితమైనవి. కుమారస్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఆరుపదవీడు తర్వాత ఇవి కూడా ప్రాచీనమైన క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ కోవలోకి చెందినదే కర్ణాటకలోని పురాతనమైన శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో చూద్దాం.

శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎక్కడుంది?
కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిల్లా, అరకలగూడ తాలూకాలోని కావేరి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామనాథపుర. ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా పురాతనమైనది, ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా వ్యవహరించే ఈ క్షేత్రం స్థల పురాణాన్ని గురించి తెలుసుకుందాం.

ఆలయ చరిత్ర - స్థల పురాణం
పూర్వం శ్రీ విభూధేశ తీర్థ అనే గొప్ప స్వామివారు ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు ప్రసన్నులయ్యారు. స్వామివారు ప్రత్యక్షమై తీర్థ స్వామికి సంతోషం కలిగించినందున, ఈ ఆలయానికి 'ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి' అనే పేరు వచ్చింది.

నరసప్ప నాయక వృత్తాంతం
ఆ కాలంలో నరసప్ప నాయక అనే గొప్ప సుబ్రహ్మణ్యుని భక్తుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. ఈయన సంతానం లేక బాధ పడేవాడు. ఆయన ఈ స్వామివారిని వేడుకోగా సంతాన భాగ్యం కలిగింది. అప్పటి నుంచి ఈ ఆలయ ప్రాశస్త్యం మరింత పెరిగిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఆలయ విశేషాలు
అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి పూజలందుకుంటున్నాడు.

నల్ల శాలిగ్రామ శిల
గర్భాలయంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రధాన విగ్రహం నల్లటి శాలిగ్రామ శిలతో తయారైంది.

ఏడు తలల సర్ప రూపం
శ్రీ సుబ్రహ్మణ్యుడు ఏడు తలల సర్ప రూపంలో ఉన్న విగ్రహ రూపంలో వెలసి ఉన్నాడు. ఇది కుక్కె సుబ్రహ్మణ్య ఆలయం వలే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

పుట్ట మట్టి ప్రసాదం
ఈ ఆలయంలో పుట్ట నుంచి తీసిన మృత్తిక అంటే మట్టిని భక్తులకు ప్రధాన ప్రసాదంగా ఇస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సర్ప దోషాలు, చర్మ వ్యాధులు, సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కావేరి నదీ స్నానం
కావేరి నది ఒడ్డున వెలసి ఉన్న ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని దర్శించే ముందు కావేరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామిని దర్శించి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి.

పూజోత్సవాలు
ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక మాఘమాసంలో వచ్చే శుద్ధ చవితి రోజు ఈ ఆలయం ప్రాంగణంలో నాగ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. సంతానం లేని దంపతులు ఇక్కడ జరిగే నాగ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. అలాగే ఆషాఢమాసంలో వచ్చే ఆడికృత్తిక రోజు, శ్రావణ మాసంలో వచ్చే గరుడ పంచమి రోజు, కార్తిక మాసంలో వచ్చే నాగుల చవితి, మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి ఇక్కడ ప్రధాన పండుగలు. ఈ పండుగల సమయంలో ఇక్కడ జరిగే కావడి ఉత్సవాలు, ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొనడం వల్ల కుజ దోషాలు, నాగ సర్ప దోషాలు తొలగుతాయని విశ్వాసం. ఇక డిసెంబర్​లో జరిగే రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది.

ఎలా చేరుకోవాలి?
కర్ణాటకలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి హాసన్ జిల్లాలోని రామనాథపురానికి నిరంతరం బస్సు సౌకర్యం కలదు.

దర్శనఫలం
శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి, పూజిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని, గ్రహ దోషాలు తొలగుతాయని నమ్మకం. మనం కూడా శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మన మనోభీష్టాలు నెరవేర్చుకుందాం.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉన్న 5 విగ్రహాలు ఏంటో తెలుసా? పంచబేరాల విశిష్టత ఇదే!

ఆ గుడిలో చేసే 'పాయసం' కోసం శ్రీకృష్ణుడే రోజూ వస్తాడట! - ఎందుకో తెలుసా?