ETV Bharat / spiritual

తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉన్న 5 విగ్రహాలు ఏంటో తెలుసా? పంచబేరాల విశిష్టత ఇదే!

తిరుమల శ్రీవారి ఆలయంలో మూలవిరాట్టుతో పాటు పంచబేరాలు కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలు పూజలు- వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఐదు మూర్తులకు ప్రత్యేకమైన సేవలు, పూజా విధానాలు

Five Forms of Lord Venkateswara
ప్రతీకాత్మక చిత్రం (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 2:55 AM IST

3 Min Read
Choose ETV Bharat

Five Forms of Lord Venkateswara : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఏడుకొండలవానిగా పూజలందుకుంటున్న ఆనందనిలయంలో పూజలందుకునే 5 విగ్రహాలలో దేనిని దర్శించినా మూలమూర్తిని దర్శించినట్లే అని వేంకటాచల మహాత్యంలో వివరించి ఉంది.

పంచబేరాలు
శ్రీవారి గర్భగుడిలో మూల విగ్రహంతో పాటుగా కౌతుక బేరం, ఉత్సవబేరం, స్నపన బేరం, బలిబేరం అనే విగ్రహాలు పూజలందుకొంటాయి. అంటే మొత్తంగా ఐదు విగ్రహాలుంటాయి. అవి వరుసగా ధ్రువబేరం, కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవబేరం, బలిబేరం.

వైఖాసన ఆగమం ప్రకారం పూజలు
ఈ ఐదు విగ్రహాలు శ్రీ వైష్ణవ వైఖాసన ఆగమం ప్రకారం సందర్భోచితంగా పూజలందుకొంటాయి. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవాలయాలు ఇదే వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తాయి. అయితే తిరుమల క్షేత్రం వైఖానస ఆగమాన్నే ప్రధానంగా పాటిస్తుంది. ఇప్పుడు ఏ మూర్తిని ఎందుకు ప్రార్ధిస్తారో చూద్దాం.

ధ్రువబేరం
గ్రామ శ్రేయస్సు కొరకు ద్రువబేరానికి పూజలు నిర్వహిస్తారు. ద్రువబేరమంటే మరేమి కాదు మూలవిగ్రహమే. దీన్నే స్థిరమైన, చలించని విగ్రహంగా భావిస్తారు కనుకనే "ధ్రువ" అనే పేరు వచ్చింది. వైఖానసనాగము ప్రకారము గర్భగుడిలోని దేవుడు రెండు రకాలు. ఒకటి కంటికి కనిపించే బేరము, అంటే సాకార రూపమన్నమాట. రెండోది కంటికి కనబడని దేవుడు. ఈ దేవుడినే నిరాకారరూపుడని అంటారు. కనుక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని స్వరూపం సాకారమన్నమాట.

కౌతుక బేరం
సాధారణంగా మూలబేరాన్ని శిల, మట్టి, దారువు అంటే చెక్కలతో నిర్మించాలి. వీటికే నిత్యపూజలు వైఖాసన లేదా పాంచరాత్ర ఆగమాల ప్రకారం పూజలు జరపాలి. ద్రువబేరానికి అభిషేకముండదు, ఎందుకంటే మూల విగ్రహం అత్యంత పవిత్రమైనదిగా, స్పర్శకు అతీతమైనదిగా భావించబడుతుంది. పాలు నేయి తేనె పెరుగు వంటి వాటితో తిరుమంజన సేవ, అభిషేకాలు కౌతుకబేరానికి చేస్తారు. కౌతుకబేరమంటే దినసరిపూజకు ఏర్పాటుచేసిన బంగారు, వెండి లేదా పంచలోహాలతో చేసిన విగ్రహం. మూలవిగ్రహంలో వుండే శక్తిని కౌతుకబేరములోకి ఆవాహన చేసి పూజలు నిర్వహించి, సాయంత్రం పూజ ద్వారా తిరిగి ఆ శక్తిని మూలవిగ్రహంలోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియనే ఉద్వాసనమంటారు.

ఉత్సవబేరం
మూడోదైన విగ్రహం ఉత్సవ విగ్రహం. పుర ఊరేగింపునకు ద్రువబేరాన్ని తీసుకువెళ్ళటానికి వీలుకాదు కనుక ఉత్సవబేరాన్ని ఊరేగిస్తారు. తిరుమలలో ఈ ఉత్సవమూర్తినే "మలయప్పస్వామి" అని పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాలలో వాహనసేవలకు ఈ మూర్తినే ఊరేగిస్తారు.

స్నపన బేరం
స్నపనబేరాన్ని అమ్మవారి విగ్రహాలతో పాటుగా కోనేరుకు తీసుకువెళ్లి చక్రవారి స్నానం చేయిస్తారు. సాధారణంగా తిరుమంజన సేవలన్నీ ఈ స్నపనబేరానికే జరుగుతాయి.

బలిబేరం
ప్రతి దేవాలయంలో ప్రధాన మూర్తితో పాటు పరివార దేవతలుంటారు. వీరిని ఉపదేవాలయాలలో ఉంచి పూజిస్తారు. గరుడ, నంది, వినాయక, శ్రీదేవి భూదేవి, భైరవ, పరశురామ, బలరామ, యక్షగంధర్వ దేవతలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. చివరిది ఐదవదైన బలిబేరాన్ని పరివార దేవతలకు బలి ఇవ్వటానికి ముందు అర్చిస్తారు. బలి ఇవ్వడమంటే జంతువధ చేయడం కాదు. మూల విగ్రహానికి నివేదన చేసిన అనంతరం ఈ దేవతలకు బలి అన్నమును సమర్పిస్తారు. కొన్ని ఆగమవిధానాలలో మూలవిగ్రహానికి అభిషేకము కూడా చేస్తారు. అలాగే తిరుమల శ్రీవారి మూలమూర్తికి కూడా ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. నిరాకార రూపుడైన భగవంతునికి ఆకారపూజా విధులేమి వుండవు, భక్తిప్రవృత్తులే ఇక్కడ ప్రధానం.

ఈ పంచబేరాల విధానం కేవలం తిరుమలకే పరిమితం కాక, వైఖానస ఆగమాన్ని అనుసరించే అనేక దక్షిణ భారత వైష్ణవాలయాలలో కూడా విస్తృతంగా అమలులో ఉందని ఆగమశాస్త్ర పండితులు పేర్కొంటారు. తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు మూలమూర్తితో పాటు ఇతర మూర్తులను కూడా దర్శించుకోవడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని స్కందపురాణంలో వివరించి ఉంది. ఏడుకొండలవాని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించే ఈ పంచబేరాల దర్శనంతో జన్మ సాఫల్యం సిద్ధిస్తుందని వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది. కలియుగ వెంకటనాథుని ఈ పంచబేరాల గురించి చదివినా, విన్నా సకల సంపదలు సిద్ధిస్తాయి.

ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా! గోవిందా!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయం విశిష్టత- అమ్మవారి ముఖాన్ని తాకే సూర్యకిరణాల వెనుక ఉన్న అద్భుతం ఇదే!

శ్రావణ శుక్రవారం ఈ లక్ష్మీ కుబేర ఆలయాన్ని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి!