83రోజుల పాటు శుభకార్యాలకు బ్రేక్- ఈసారి మాఘ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు లేవో తెలుసా?
మూఢంలో శుభకార్యాలు ఎందుకు నిషిద్ధం?

Published : November 26, 2025 at 2:47 AM IST
Shukra Moudyami 2025 Dates : తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో మాఘ, శ్రావణ, వైశాఖ మాసాలు శుభకార్యాలకు అనువైనవి. మిగిలిన మాసాల్లో కూడా ముహూర్తాలను అనుసరించి శుభకార్యాలు జరిగినప్పటికీ, ఎక్కువగా ఈ మాసాల్లోనే జరుగుతుంటాయి. కానీ రానున్న కొత్త సంవత్సరంలో పెళ్లిళ్లకు శ్రేష్టమైన మాఘ మాసంలో వివాహా ముహుర్తాలు లేవని పండితులు అంటున్నారు. శుక్ర మూఢమి కారణంగా ఈసారి మాఘంలో సన్నాయి మేళాలు లేనట్లే! ఈ సందర్భంగా అసలు శుక్ర మూఢమి అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మూఢమి అంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢాలు రెండు రకాలు. ఒకటి గురు మూఢమి, రెండోది శుక్ర మూఢమి. గురు శుక్ర గ్రహాలు అస్తంగత్వం చెందడం అంటే తేజస్సును కోల్పోవడం అనేది ముహూర్త శాస్త్రంలో చాలా కీలకమైనది. ఈ సమయంలో శుభకార్యాలు నిషేధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
మూఢమి ఎలా ఏర్పడుతుంది?
గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురు మౌడ్యమి అని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్ర మౌడ్యమి అని అంటారు. దీనినే వాడుక భాషలో మూఢమి అని వ్యవహరిస్తారు. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో భాగంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి సంభవిస్తుంది. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు.సూర్యుడు అతి పెద్ద గ్రహం. ఆయన తేజస్సు, శక్తి అనంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు శుక్ర గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే సూర్యునికి దగ్గరగా ఈ గ్రహాలు వచ్చినప్పుడు వాటి తేజస్సు కోల్పోవడం వలన మౌడ్యమి ఏర్పడి శుభకార్యాలు నిషేధిస్తారు.
నేటి నుంచి శుక్ర మూఢమి
నవంబర్, 26 బుధవారం నుంచి శుక్ర మూఢమి ఏర్పడనుంది. ఈ శుక్ర మూఢమి 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్టి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు ఈ శుక్ర మూఢమి కొనసాగనుంది. మొత్తం 83 రోజుల పాటు కొనసాగనున్న ఈ మూఢంలో వివాహాది శుభకార్యాలు పూర్తిగా నిషిద్ధం. పెళ్లిళ్ల మాసమైన మాఘ మాసంలో ఈసారి పెళ్లి బాజాలు లేనట్లే! అయితే మూఢంలో కొన్ని శుభకార్యాలు మాత్రం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మూఢంలో ఏవి చేయొచ్చు? ఏవి చేయకూడదో తెలుసుకుందాం.
మూఢంలో ఇవి నిషిద్ధం
మూఢంలో వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభాలు, శంఖుస్థాపనలు, యజ్ఞాలు, నూతన వధువు గృహప్రవేశం, యజ్ఞం, దీక్షోపనయనం, వాహనాలు కొనడం, వ్యాపార ప్రారంభాలు, మహాదానాలు, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, రాజ దర్శనం, రాజ్యాభిషేకం, బావులు చెరువులు తవ్వించడం వంటివి నిషిద్ధం.
మూఢంలో ఏమేమి చేయవచ్చు?
కొన్ని అనివార్య కార్యాలకు, నిత్య నైమిత్తిక కర్మలకు మూఢం వర్తించదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా నిత్య ప్రయాణాలు, నిత్య దైవారాధన, అభిషేకాలు, గ్రహశాంతి పూజలు, జప హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాశన, ఇంటి మరమ్మత్తులు, అద్దె ఇళ్లలో చేరడం, నూతన వస్త్ర ధారణ, చాతుర్మాస వ్రతాలు వంటివి మూఢంలో కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ నెల 26, బుధవారం నుంచి శుక్ర మూఢమి ఏర్పడనున్న సందర్భంగా శుభకార్యాలకు జరుపుకోదలచిన వారు తగిన ప్రణాళికలు ఏర్పరచుకోగలరు. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

