ETV Bharat / spiritual

ఒక్క ఘడియలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం - 1305 మెట్లు ఎక్కితే యోగ నరసింహుడి అనుగ్రహం!

108 దివ్యదేశాలలో ఒకటైన చోళంగిపురం (షోలింగర్) యోగ నరసింహ స్వామి - యోగ ఆంజనేయ స్వామి కొలువైన మహిమాన్విత క్షేత్రం ఒక్క ఘడియ పాటు భక్తితో ప్రార్థిస్తే ముక్తి లభిస్తుందని విశ్వాసం

Sholingur Yoga Narasimha Temple
Sholingur Yoga Narasimha Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 11, 2026 at 2:54 AM IST

3 Min Read
Choose ETV Bharat

Sholingur Yoga Narasimha Temple : మన దేశంలో ప్రసిద్ధి చెందిన 108 శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో, కొండపై వెలసిన నరసింహ పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది చోళంగిపురం. చంచలమైన మనస్సుకు ప్రశాంతతను చేకూర్చి, మన ధర్మబద్ధమైన కోరికలను తక్షణమే నెరవేర్చే "అనుగ్రహ మూర్తి యోగ నరసింహ స్వామిగా, కార్యసిద్ధి, శత్రుజయాలను ప్రసాదించే హనుమ యోగ ఆంజనేయ స్వామిగా కొలువై ఉన్న ఘటికాచల పుణ్య క్షేత్రం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఘటికాచలం పేరు ఇలా
ఈ క్షేత్రానికి చారిత్రకంగా, పురాణ పరంగా అత్యంత విశిష్టమైన పేర్లు ఉన్నాయి. ద్రవిడ భాషలో 'ఘటిక' అంటే ఘడియ అని అర్థం. అంటే సుమారు 24 నిమిషాల సమయం అని అర్థం. 'అచలం' అంటే కొండ. ఈ క్షేత్రంలోని కొండపైకి వెళ్లి, పెరుమాళ్‌ను ఉద్దేశించి ఒక్క ఘడియ కాలం 24 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తేనే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రానికి ఘటికాచలం అనే పేరు వచ్చింది.

షోలింగర్​గా మారిన చోళంగిపురం
చోళ రాజులు ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం నరసింహ స్వామిని తమ కుల దైవంగా భావించి, ఈ ప్రాంతంలో ఎన్నో గొప్ప పునరుద్ధరణ పనులు, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని మొదట "చోళ సింహపురం" అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు రూపాంతరం చెంది "షోలింగర్" చోళంగిపురంగా మారింది.

యోగ నరసింహుని ఆవిర్భావం
హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత, నరసింహస్వామి ఉగ్రరూపం తో, రౌద్ర జ్వాలలతో రగిలి పోతుండగా, ఆయన కోపాన్ని శాంతింపజేయడానికి ప్రహ్లాదుడు, దేవతలు, మునులు భక్తితో ప్రార్థించారు. మునుల తపస్సుకు మెచ్చి, శాంతించిన పెరుమాళ్ ఈ కొండపైకి వచ్చి, పద్మాసనంలో ధ్యాన ముద్రతో "యోగ నరసింహస్వామి"గా వెలిశారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

ఆలయ విశేషాలు
ఈ ఆలయంలో స్వామి వారు ప్రశాంత వదనంతో, శాంత స్వరూపుడిగా, కళ్లకు చలవను, మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే యోగ స్థితిలో దర్శనమిస్తారు. అందువల్ల, ఆయనను దర్శించుకునే భక్తుల మనస్సులోని కోపం, ఆందోళనలు తక్షణమే మాయమవుతాయని విశ్వాసం. ఇక్కడ వెలసిన యోగ నరసింహ స్వామి సరసన అమృతవల్లి అమ్మవారు కొలువై కరుణామృతాన్ని కురిపిస్తున్నారు.

రెండు కొండల విశిష్టత
చోళంగిపురం మరొక గొప్ప విశేషం ఇక్కడ దర్శనమిచ్చే రెండు కొండలు. రెండు కొండల్లో 1305 మెట్లు కలిగిన ఈ పెద్ద కొండ శిఖరంపై శ్రీ యోగ నరసింహ స్వామి కొలువై ఉన్నారు. 406 మెట్లు కలిగిన చిన్న కొండ శిఖరంపై "యోగ ఆంజనేయ స్వామి" కొలువై ఉన్నారు. ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి నాలుగు హస్తాలతో, శంఖు చక్రాలు ధరించి, యోగ ముద్రలో కూర్చుని ఉన్న అరుదైన, ఏకైక క్షేత్రం ఇదే! నరసింహ స్వామి యొక్క ప్రత్యక్ష దృష్టి పడేలా, స్వామి వారిని చూస్తున్నట్లుగా ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నట్లుగా దర్శనమిచ్చే ఈ క్షేత్ర నిర్మాణం అద్భుతం.

చారిత్రక ప్రాధాన్యత
ఈ ఆలయం తొలుత పల్లవ రాజులు, ఆ తర్వాతి కాలంలోని చోళ, విజయనగర రాజులు పునరుద్ధరించినట్లు ఆలయంలో చెక్కబడి ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది.

అరుదైన చారిత్రక ఘట్టం
పేయాళ్వార్, నమ్మాళ్వార్లచే మంగళా శాసనం కీర్తించిన 108 దివ్యదేశాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వైష్ణవ ఆచార్యులైన దొడ్డాచార్యుల వారికి, పెరుమాళ్ స్వయంగా కాంచీపురం వరదరాజ పెరుమాళ్ రూపంలో దర్శనమిచ్చిన చారిత్రక ఘట్టం కూడా ఈ క్షేత్రంలోనే జరిగింది

భక్తుల నమ్మకం
మనశ్శాంతి లేనివారు, తీరని అప్పుల బాధలతో సతమతమయ్యేవారు, అలాగే దుష్టశక్తులు, నరదృష్టి, మానసిక సమస్యలతో బాధపడేవారు చోళంగిపురం యోగ నరసింహుని, యోగ ఆంజనేయుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొండ మెట్లు ఎక్కి దర్శించుకుంటే చాలు, ఒక్క ఘడియలో వారి కష్టాలన్నీ మంచులా కరిగి పోతాయన్నది నేటికీ ఎందరో భక్తులకు అనుభవంలోకి వచ్చిన సత్యం.

ఎలా చేరుకోవాలి?
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో, చెన్నైకి సుమారు 120 కి.మీ దూరంలో, అరక్కోణంకు 30 కి.మీ దూరంలో వెలసి ఉన్న ఈ దివ్య క్షేత్రానికి వెల్లూరు జిల్లా కేంద్రం నుంచి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.


భార్యలు, పిల్లలతో కలిసి దర్శనమిచ్చే అరుదైన గణపతి- మూడు నేత్రాల వినాయకుని మహిమ ఇదే!

శోణ భద్ర గణపతి శిలను పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు- ఏ తిథిలో పూజిస్తే ఏ వరం లభిస్తుందో తెలుసా?