శబరిమల 'పదునెట్టాంబడి' రహస్యం- 18 మెట్లు ఎందుకు?- ఒక్కో మెట్టు వెనుక ఉన్న మహాశక్తులు ఇవే!
ఆ 18 మెట్లపై కాలు పెట్టిన ప్రతి భక్తుడి జీవితం ఎందుకు మారిపోతుంది?- పదునెట్టాంబడి విశిష్టత ఇదే- ఇరుముడితోనే ఎందుకు ఎక్కాలో తెలుసా?

Published : January 8, 2026 at 5:30 AM IST
Sabarimala 18 Steps Significance : శివకేశవుల ప్రియ పుత్రుడు అయ్యప్ప స్వామి. శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మండలం పాటు మాలాధారణలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు. ఎంతో కఠినమైన నియమ నిబంధనలతో కూడిన మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలకు బయలుదేరుతారు. శబరిమల యాత్ర మొత్తం ఒక ఎత్తైతే స్వామిని చేరుకోవడానికి పదునెట్టాంబడిగా పిలిచే పద్దెనిమిది మెట్లు ఒక ఎత్తు. భక్తులను అయ్యప్ప సన్నిధానానికి చేర్చే ఈ పద్దెనిమిది మెట్లకు ఎందుకంత ప్రత్యేకత? పదునెట్టాంబడి విశిష్టత ఏమిటి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పదునెట్టాంబడి వెనుక పౌరాణిక గాథ
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సన్నిధానం అంటారు. ఈ సన్నిధానానికి చేరుకునే 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. పురాణాల ప్రకారం ఈ మెట్లను పరశురాముడు నిర్మించారని అంటారు. అయితే పద్దెనిమిది మెట్లే ఎందుకు అనే సందేహానికి సమాధానం కావాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే!
పరమపద సోపానాలు
ముల్లోకాలను పీడిస్తున్న మహిషుని సంహారం కోసం శివకేశవుల పుత్రునిగా జన్మించిన వాడు మణికంఠుడు. అయ్యప్పను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రి పందళం రాజు. మహిషుని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి తాను శబరిగిరిపై కొలువు తీరనున్నట్లు తన తండ్రికి తెలిపాడు.
స్వామికి సోపానాలుగా అద్భుత శక్తులు
అయ్యప్ప స్వామి కొలువు తీరి ఉన్నతస్థానంలో ఆశీనుడు కావడానికి వీలుగా చతుర్వేదాలు, ఆరు శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు పద్దెనిమిది మెట్లుగా అమరాయని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు అయ్యప్ప ఆ సోపానాల మీద కాలు మోపి వాటిని అధిరోహించి పట్టబంధాసనంలో కూర్చుని యోగముద్రతో దర్శనమిచ్చి జ్యోతిరూపంలో అంతర్ధానమయినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.
మహాశక్తులు నిక్షిప్తం
అయ్యప్పస్వామి తన అస్త్ర శక్తిని ఈ మెట్లలో నిక్షిప్తం చేసాడని అంటారు. మండలం రోజులు దీక్ష పూర్తి చేసి ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి సన్నిధానానికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత
వీర మణికంఠుడు తన అస్త్ర శక్తిని నిక్షిప్తం చేసిన ఈ పద్దెనిమిది మెట్లకు ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. అవేమిటో చూద్దాం.
మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, భేతాళ, నాగరాజ, కర్ణ, వైశాఖ, పుళిందిని, రేణుకా పరమేశ్వరి, స్వప్న వారాహి, ప్రత్యంగిర, నాగయక్షిణి, మహిషాసురమర్ధిని, అన్నపూర్ణేశ్వరి అనే శక్తులు ఈ 18 మెట్లకు అధిదేవతలు.
18 మెట్లు - 18 పేర్లు
పదునెట్టాంబడిగా పిలిచే ఈ 18 మెట్లకు 18 పేర్లు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వశిత్వ, ఈశత్వ, ఇఛ్ఛ, బుద్ధి, సర్వకామ, సర్వ సంపత్కర, సర్వ ప్రియంకర, సర్వ మంగళకర, సర్వ దుఃఖ విమోచన, సర్వ మృత్యు ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్య దాయక అనేవి ఈ 18 మెట్ల పేర్లు.
పదునెట్టాంబడి విశిష్టత
సాధారణంగా అయ్యప్ప స్వామి దీక్ష 18 సంవత్సరాలు చేయాలని అంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో దుర్గుణాన్ని విడిచి పెట్టడమే అయ్యప్ప దీక్షలో ముఖ్య ఉద్దేశ్యమని శబరిమల స్థలపురాణం చెబుతోంది. నిరంతర సాధన, కఠోర దీక్షతో ఇది సాధ్యమని గురు స్వాములు చెబుతారు. అందుకు అనుగుణంగానే మాలధారణ నియమాలు ఉండడం విశేషం. అరిషడ్వార్గాలను విడిచి ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుకుని, తమో, రజో గుణాలను విడిచి పెట్టి జ్ఞానమార్గంలో పయనించాలని బోధించడమే పదునెట్టాంబడి అధిరోహించడంలోని అంతరార్ధం.
ఇరుముడితోనే ప్రవేశం
అయ్యప్ప సన్నిధానానికి చేరుకునే ఈ 18 మెట్లను ఇరుముడితో మాత్రమే అధిరోహించాలని నియమం. ఇరుముడి లేకుండా కేవలం స్వామి దర్శనానికి మాత్రమే వెళ్లాలనుకునేవారు ఉత్తరం వైపు ఉన్న మెట్ల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఆలయ అర్చకులు మాత్రమే ఇరుముడి లేకుండా 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుకునే అర్హత ఉంటుంది. ఇందుకు వారు ఒక సంవత్సర కాలం పాటు దీక్ష చేయాల్సి ఉంటుంది.
త్వరలో మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో జరిగే జ్యోతి దర్శనానికి వెళ్లడానికి ఎంతో మంది అయ్యప్ప భక్తులు దీక్ష వహించిన సన్నద్ధమవుతున్నారు. అయ్యప్ప భక్తులందరికీ శబరీషుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ. స్వామియే శరణమయ్యప్ప!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

