ETV Bharat / spiritual

రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుకున్న విశిష్టత ఏంటో మీకు తెలుసా?

అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి- శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ విశిష్టత ఇదే!

RAKHI PUNNAMI 2026 DATES
రాఖీ పౌర్ణమి (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 3:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Rakhi Purnima Significance : రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, అన్నా చెల్లెళ్ల పండుగ ఇలా పేర్లు వేరైనా పండుగ ఒకటే! సృష్టిలో తండ్రి తరువాత స్థానం అన్నదే! తల్లి తరువాత స్థానం చెల్లిదే! శాశ్వతమైన ఈ బంధాన్ని ప్రతి సంవత్సరం మరింత పటిష్టం చేయడమే రాఖీ పౌర్ణమి అంతరార్థం. ఆగస్టు 28, శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

రాఖీ పౌర్ణమి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ శుద్ధ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 28, శుక్రవారం రోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి తిథి సూర్యోదయంతో ఉంది. అందుకే ఈ రోజునే రాఖీ పౌర్ణమిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఉదయం 5:57 నిమిషాల నుండి ఉదయం 9:48 నిమిషాల వరకు ఉంది. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం.

పురాణ ప్రాశస్త్యం
తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ గురించిన ప్రస్తావన మన పురాణేతిహాసాల్లో కూడా ఉంది. వ్యాస మహర్షి రచించిన మహాభారతం ప్రకారం శిశుపాలుని శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణుని చూపుడు వేలుకు గాయమై రక్తం ధారగా కారుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే తాను ధరించిన పట్టు చీర కొంగును చింపి కృష్ణుని గాయానికి కట్టు కడుతుంది. ద్రౌపది అభిమానంతో చేసిన ఈ పనికి శ్రీకృష్ణుడు తాను ఎల్లవేళలా ద్రౌపదికి అండగా ఉంటానని మాట ఇస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం ద్రౌపది ఇచ్చిన చిన్న చీర ముక్క ప్రతిఫలంగా నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో ఆమెకు అనేక చీరలు ఇచ్చి ఆమె అభిమానాన్ని కాపాడుతాడు. ఆనాటి నుంచి అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా చేతికి నూలు వస్త్రం కానీ దారం కానీ రక్షగా కట్టడం సంప్రదాయంగా మారింది. అదే రాఖీ అని పురాణాలు చెబుతున్నాయి.

మరో కథనం
పూర్వం దేవదానవులకు పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అపజయం పొందిన ఇంద్రుడు తన శక్తులను కోల్పోయి, నిర్వీర్యుడై తన పరివారంతో సహా అమరావతిలో తలదాచుకున్నాడు. మరోవైపు రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలిసిన ఇంద్రుని ధర్మపత్ని ఇంద్రాణి తన భర్త నిస్సహాయతకు చింతించి తరుణోపాయం గురించి ఆలోచిస్తుంది. శ్రావణ పౌర్ణమి శుభదినం రోజున లక్ష్మీనారాయణులను, పార్వతి పరమేశ్వరులను పూజించి ఇంద్రునికి రక్ష కడుతుంది. అటు తరువాత సకల దేవతలు కూడా వారు పూజించిన రక్షలను తెచ్చి ఇంద్రునికి కట్టి సమరానికి పంపుతారు. ఇంద్రుడు ఆ యుద్ధంలో విజయం సాధించి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు.

బలిచక్రవర్తికి లక్ష్మీదేవి రక్ష
పూర్వం శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు పాతాళంలోనే ఉండి పోతాడు. అప్పు శ్రీలక్ష్మి దేవి పాతాళానికి వెళ్లి బలి చక్రవర్తికి రక్షాబంధనం కట్టి, తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకు వస్తుంది. అలాగే ఒకానొక సందర్భంలో సుభద్ర కూడా శ్రీకృష్ణునికి రక్షాబంధనం కట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

రాఖీ అంటే రక్ష!
తమ సోదరులకు ఎలాంటి ఆపదలు, అవాంతరాలు లేకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి ఆడపడుచు తన అన్నదమ్ములకు కట్టే 'రక్ష'ను రాఖీ అంటారు. తమ శ్రేయస్సును, అభ్యున్నతిని కోరుకునే అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభ సందర్భంగా అన్నదమ్ములు కానుకలిచ్చి సంతోష పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

రాఖీని ఇలా జరుపుకుందాం
రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి దేవుని వద్ద దీపం వెలిగించాలి. ఇంటిని పూలమాలలతో అలంకరించాలి. ఒక పళ్లెంలో అక్షింతలు, దీపం, రాఖీ, మిఠాయి సిద్ధం చేసుకోవాలి. అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి, హారతి ఇచ్చి, అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి. అన్నదమ్ములు తమ సోదరికి ప్రేమతో కానుకలు ఇవ్వాలి. అలాగే సొంత అన్నతమ్ములు లేనప్పుడు మనం ఎవరిని సోదరునిగా భావిస్తున్నామో వారికి కూడా రాఖీ కట్టవచ్చు. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. కానీ ఏడాదికోసారి వచ్చే రాఖీ పండుగ రోజైనా తోబుట్టువులు కలుసుకుని మనసారా మాట్లాడుకుని, రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడంలో ఉండే ఆనందం ఈ ఆన్ లైన్​లో రాదు కదా! సోదర సోదరీమణులు ఒకరినొకరు కలుసుకుని ఆప్యాయత, అనురాగాలు పంచుకోవడమే ఈ పండుగ పరమార్ధం!

అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు రక్షణగా ఉండాలి. ఆడపడుచులు ప్రేమానుబంధాలు పంచి ఇవ్వాలనే సదుద్దేశ్యంతో జరుపుకునే ఈ పండుగ వారికి మాత్రమే కాదు వారిని కన్న తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని పంచి పెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రానున్న రాఖీ పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. ఆప్యాయత అనురాగాలు పెంచుకుందాం.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శ్రావణ పౌర్ణమి నాడు ఏడుకొండలవాడిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!

పూజగదిలో ఈ దేవుళ్ల ఫొటోలు ఉండకూడదట! - ఎందుకో తెలుసా?