పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం- ఈ నియమాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు ఖాయం!
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ వ్రత విశిష్టత, విధానం గురించి తెలుసుకుందాం.

Published : May 1, 2026 at 4:52 AM IST
Pournami Satyanarayana Puja : సాధారణంగా కొత్తగా పెళ్లైన వధూవరులచేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించడం సంప్రదాయం. అలాగే నూతన గృహప్రవేశం సమయంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆచారం. అలా కాకుండా ఒక నియమం ప్రకారం ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అనేక కష్టనష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రవచనం. ఈ కథనంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతను తెలుసుకుందాం.
అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం
జీవితంలో ఎంత ప్రయత్నించినా ఎదుగుదల లేకపోవడం, ఆర్థిక సమస్యలు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, వివాహ ప్రయత్నాలు కలిసి రాకపోవడం, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్థి తగాదాలు, కోర్టు సమస్యలు ఇలా సమస్య ఏదైనా దానికి పరిష్కారం ఒక్కటే అని పురాణాలు చెబుతున్నాయి. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ప్రతి మాసంలో పౌర్ణమి తిథి వస్తుంది. 'శ్రీ సత్యనారాయణ స్వామి' వ్రతాన్ని పౌర్ణమి రోజున ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయనేది మహర్షుల మాట. మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఎన్ని మాసాలు ఆచరించాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి?
ప్రతి మాసంలో పౌర్ణమి తిథి వచ్చినప్పటికీ ఒక నియమానుసారం ఏడాది పాటు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలనుకునే వారు వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభించడం మంచిది. మే 1, శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఈ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం సకల శుభప్రదమని స్కంద పురాణంలో వివరించి ఉంది.
సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టత
శ్రీ మహావిష్ణువును సత్య స్వరూపుడిగా ఆరాధించే అత్యంత పవిత్రమైన పూజ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్య సిద్ధి కలుగుతాయని, సత్యం పలికే అలవాటు పెరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా నూతన గృహప్రవేశం, వివాహం, ఇతర శుభకార్యాల సమయంలో ఈ వ్రతం చేయడం హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనది. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఇతర మాసాల్లో పున్నమి రోజుల్లో చేసిన దానికన్నా కోటిరెట్ల అధిక ఫలం లభిస్తుందని మహర్షులు చెబుతారు.
సత్యమే దైవం
సత్యనారాయణ స్వామి వ్రతం సత్యం, ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. "సత్యమేవ జయతే" అన్న వేద వాక్యానికి అనుగుణంగా, సత్యాన్ని ఆశ్రయించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయనే సందేశాన్ని ఈ వ్రతం అందిస్తుంది.
అష్టైశ్వర్య సిద్ధి
ప్రతి పౌర్ణమికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
కష్టాలు తొలగిపోవడం
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఒక ఏడాది పాటు ప్రతి మాసంలో వచ్చే పున్నమి రోజు ఆచరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు, దరిద్రం తొలగిపోతాయని, భగవంతుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
వ్రత విధానం
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా ఒక పీటపై బియ్యం పోసి దానిపై శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రతిష్టించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి పసుపు గణపతిని పూజించాలి. అనంతరం అష్టోత్తర శతనామాలతో సత్యనారాయణుని పూజించాలి.
కథా శ్రవణం
సత్యనారాయణ స్వామి వ్రతంలో ముఖ్యమైన అంశం కథా శ్రవణం. ఈ వ్రతంలో మొత్తం 5 కథలు ఉంటాయి. ఈ కథలన్నీ సత్యాన్ని పాటించడం ఎంత గొప్పదో వివరిస్తాయి. భగవంతునికైనా సరే ఇచ్చిన మాట తప్పకూడదన్న సత్యాన్ని చెబుతూ, మాట తప్పితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వ్రతమాహత్యం తెలుపుతుంది. వ్రతంలో భాగంగా భక్తిశ్రద్ధలతో ఈ 5 కథలు వినాలి. సత్యం, రుజువర్తనం ద్వారా సకల శుభాలు, ఐశ్వర్యాలు ఎలా పొందవచ్చో ఈ కథలు మనకు తెలుపుతాయి.
ప్రసాద మహత్యం
సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంత మహత్యం ఉందో, ఈ వ్రతంలో స్వామికి నివేదించే ప్రసాదానికి కూడా అంతే మహిమ ఉంది. అసలు సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తం చేసుకుని ప్రసాదం స్వీకరించక పోవడం కానీ, ప్రసాదాన్ని చులకన చేయడం కానీ చేస్తే ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో వ్రత కథలో వివరించి ఉంటుంది. రవ్వ, పంచదారాలతో చేసే శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం రుచి శుచిలోనే కాదు మహిమలో కూడా ఉన్నతమైనది. అందుకే సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అడిగి మరీ తీసుకోవాలి శాస్త్రం చెబుతోంది.
సత్యనారాయణ స్వామి వ్రతం కేవలం ఒక పూజ మాత్రమే కాదు, సత్యాన్ని ఆచరిస్తూ, కష్టాలను తొలగించమని భగవంతుని శరణు వేడుకుంటూ, మానసిక ప్రశాంతతను పొందే అద్భుతమైన మార్గం. అందువలన పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని వదులుకోకూడదు.
ఈ పౌర్ణమి రోజు మనం కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిద్దాం. సకల శుభాలు పొందుదాం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

