ETV Bharat / spiritual

మూడేళ్లకొకసారి వచ్చే 'పరమ ఏకాదశి'- ఈ ఒక్క పూజ చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయ్!

మూడేళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసంలో జరుపుకునే పరమ ఏకాదశి- రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం, దానం, పూజలు ఆచరిస్తే అపారమైన పుణ్యఫలం- పూజా విధానం మీకోసం

Param Ekadashi Puja Vidhanam
Param Ekadashi Puja Vidhanam (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : June 11, 2026 at 3:58 AM IST

4 Min Read
Choose ETV Bharat

Param Ekadashi Puja Vidhanam : తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఒకే మాసంలో నాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అధిక మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే రెండు ఏకాదశులు చాల విశేషమైనవి. అరుదుగా వచ్చే ఈ ఏకాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన అధిక ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం జరుగుతోంది. ఇప్పటికే శుక్ల పక్షంలో పద్మిని ఏకాదశిని జరుపుకున్నాం. ఇక బహుళ పక్షంలో రానున్న పరమ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పరమ ఏకాదశి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఆచరించాల్సిన విధివిధానాలేమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పరమ ఏకాదశి ఎప్పుడు?
జూన్ 11, గురువారం రోజు అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజునే పరమ ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. పరమ ఏకాదశి తిథి జూన్ 10వ తేదీన అర్ధరాత్రి 12:58 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి 10:37 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా పరమ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం.

పరమ ఏకాదశి విశిష్టత
తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంలో ఈ సంఖ్య 26 కు చేరుతుంది. మన సనాతన ధర్మం 'అధికస్య అధికం ఫలం' అంటుంది. అంటే అధిక మాసంలో వచ్చే ఏకాదశి తిథులలో చేసే పూజలు మామూలు ఏకాదశి కన్నా కోటిరెట్లు ఫలం ఎక్కువ ఉంటుందని శాస్త్రంలో వివరించి ఉంది.

పురుషోత్తమ మాసం
మూడేళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని అంటారు. ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో 'పరమ ఏకాదశి' వస్తుంది. సాధారణ ఏకాదశులతో పోలిస్తే ఇది అత్యంత అరుదైనది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశి రోజు భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, సకల పాప విముక్తి లభిస్తాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.

పరమ ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం?
పురాణాల ప్రకారం సంపదల అధిపతి అయిన కుబేరుడు ఈ వ్రతాన్ని ఆచరించి మహాదేవుని, శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందినట్లు చెబుతారు. అలాగే సత్యానికి ప్రతీకగా నిలిచిన హరిశ్చంద్రుడు కూడా పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఆ వ్రత మహిమ వల్ల కోల్పోయిన రాజ్యాన్ని, కుటుంబాన్ని తిరిగి పొందినట్లు పురాణాలలో వివరించి ఉంది.

పరమ ఏకాదశి సంకల్ప దీక్ష
పరమ ఏకాదశి రోజున కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సూర్యోదయం తోనే నిద్రలేచి నిత్యకృత్యాలు తీర్చుకుని వీలయితే నదీస్నానం చేయడం మంచిది. వీలుకాని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో సమస్త పుణ్య నదులను ఆవాహన చేసుకుని సంకల్ప సిద్ధితో స్నానం ఆచరించడం వలన గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఏకాదశి ఉపవాసం ఉండటానికి అవసరమైన శక్తిని ప్రసాదించమని ప్రార్ధిస్తూ దీక్ష తీసుకోవాలి.

పూజా విధానం
పూజా మందిరంలో శ్రీలక్ష్మీ నారాయణుల విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్ఠించుకోవాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. లక్ష్మీనారాయణులను పంచామృతాలతో అభిషించాలి. అనంతరం తులసి దళాలతో, పసుపు రంగు పువ్వులతో లక్ష్మీనారాయణులను అర్చించాలి. ఈ రోజు శ్రీ విష్ణు సహస్రనామాన్ని తప్పనిసరిగా పారాయణ చేయాలి. కొబ్బరికాయ అరటిపండ్లు, క్షీరాన్నం వంటి ప్రసాదాలు నివేదించి, ప్రసాదాలను అందరికీ పంచిపెట్టాలి. మంగళ హారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి.

సంధ్యా కాల పూజ
సూర్యాస్తమయం సమయంలో తిరిగి శుచియై విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మొక్క వద్ద దీపం వెలిగించాలి. పూజామందిరంలో దీపారాధన చేసి, పసుపు రంగు వస్త్రంలో 11 గవ్వలను లేదా నాణేలు కట్టి, లక్ష్మీనారాయణుల ముందు ఉంచాలి. పూజానంతరం ఆ మూటను ఇంట్లో డబ్బు దాచుకునే చోట భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆలయంలో ఇలా
సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి స్వామికి తులసిమాలను సమర్పించాలి. ఈ రాత్రంతా శ్రీ మహావిష్ణువు భజనలు, కీర్తనలు ఆలపిస్తూ, భాగవత కథలు వింటూ జాగారం చేయాలి.

ఈ దానాలు శ్రేష్టం
పరమ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శుభప్రదమని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు బ్రాహ్మణునికి గోదానం చేయడం వల్ల విశేషమైన కీర్తి లభిస్తుందని పద్మ పురాణం చెబుతోంది.

ద్వాదశి పారణ
మరుసటి రోజైన ద్వాదశి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీహరిని పూజించి మహా నైవేద్యం సమర్పించాలి. ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. అత్యంత అరుదుగా వచ్చే ఈ పరమ ఏకాదశి పర్వదినాన్ని కేవలం ఉపవాస దినంగా కాకుండా, జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక సమస్యలు తొలగించుకునే ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలని పండితులు చెబుతున్నారు.

మనం కూడా రానున్న పరమ ఏకాదశి రోజు శాస్త్రంలో చెప్పిన విధంగా శ్రీలక్ష్మి నారాయణులను పూజించి సకల సౌభాగ్యాలు పొందుదాం.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

భార్యలు, పిల్లలతో కలిసి దర్శనమిచ్చే అరుదైన గణపతి- మూడు నేత్రాల వినాయకుని మహిమ ఇదే!

మోయలేని రుణభారం నుంచి విముక్తి కావాలా? కుజగ్రహ పూజలో దాగిన రహస్యం ఇదే!