ETV Bharat / spiritual

భూలోక కైలాసంగా ప్రసిద్ధికెక్కిన నీలకంఠ ధామం- ఇక్కడి అద్భుతాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

నర్మదా నది తీరాన పోయిచాలో వెలసిన నీలకంఠ ధామం- దీని విశిష్టత మీకు తెలుసా?

Lord Siva
పరమేశ్వరుడు (ప్రతీకాత్మక చిత్రం) (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 31, 2026 at 4:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Nilkanth Dham Significance : భక్తి, విద్య, శిక్షణ, సాధన ఇలా అన్ని ఒకేచోట నెలకొన్న పవిత్ర ధామం నీలకంఠ ధామం. మూడు అంతస్థులతో అలరారే ఈ పవిత్ర ధామంలో అడుగడుగునా అద్భుతాలే! ఆణువణువూ ఆసక్తికరమే! మోక్ష సాధకులు ఇల కైలాసంగా భావించే ఈ నీలకంఠ ధామం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నీలకంఠ ధామం ఎక్కడుంది?
గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని పోయిచాలో నర్మదా నది తీరాన వెలసిన స్వామి నారాయణ మందిరం నీలకంఠ ధామంగా విరాజిల్లుతోంది. సువిశాలమైన ఈ ప్రాంగణంలో నలభైకి పైగా ఆలయాలు, అందమైన ఉద్యానవనం, నిండుకుండను తలపించే కొలను, నిరంతరాయంగా మారుమ్రోగే భగవన్నామ స్మరణం, పవిత్ర హారతితో ఆధ్యాతిక వాతావరణాన్ని సంతరించుకునే సాయంత్రాలు, వెరసి ఈ నీలకంఠ ధామం భూలోక కైలాసంగా విరాజిల్లుతోంది. పేరుకే స్వామి నారాయణ స్వామి క్షేత్రమే అయినప్పటికీ, సూరత్​కు చెందిన గురుకుల్ రాజకోట్ సంస్థాన్ వారి సంకల్ప ఫలమిది.

సేవానిరతికి ప్రతీక గురుకుల్ రాజకోట్ సంస్థాన్
దాదాపు ఎనభై ఏళ్ల క్రితం సద్గురు శాస్త్రీజీ మహారాజ్ 'స్వామినారాయణ్ గురుకుల్ రాజకోట్ సంస్థాన్' పేరిట ఒక ట్రస్టును ప్రారంభించి తమ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 68 గురుకులాలు మానవ మాధవ సేవలో తరిస్తున్నాయి. ఇందులో గుజరాత్​లోని నీలకంఠ ధామం కూడా ఒకటి.

అబ్బురపరిచే నిర్మాణశైలి
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ నీలకంఠ ధామంలో అడుగడుగునా ఆశ్చర్యపరిచే అనేక అద్భుతాలు దర్శనమిస్తాయి. తామర పువ్వు ఆకారంలో ఏర్పాటు చేసిన కొలను, అందమైన ఉద్యానవనం కనువిందు చేస్తాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రధానంగా ఆరు ద్వారాలు ఉంటాయి. అందులో గజేంద్ర ద్వారం ప్రధాన ఆకర్షణ. కింద అంతస్థులో శేషశయనంపై ఉన్న విష్ణుమూర్తిని, దశావతారాలను దర్శించుకోవచ్చు. ఈ దర్శనం తర్వాత 108 గోముఖాల నుంచి వచ్చే పవిత్ర జలాన్ని శిరసుపై సంప్రోక్షణ చేసుకుంటూ భక్తులు ముందుకు సాగాల్సి ఉంటుంది.

అద్భుతమైన గర్భాలయం
గర్భాలయంలోకి వెళ్లే మార్గంలో కనిపించే సభాభవనం మండపం పైకప్పు మీద చిత్రించి ఉన్న అనేక దేవతామూర్తుల చిత్రాలు అలరిస్తాయి. గర్భాలయంలో స్వామినారాయణ్, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, కష్టభంజన్ హనుమంతుడు మనోహరంగా దర్శనమిస్తారు. అక్కడే కనిపించే సప్తర్షుల విగ్రహాలు జీవకళ ఉట్టిపడేలా ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే ఆదిశంకరులు, రామానుజుల విగ్రహాలు భక్తిభావాన్ని పెంపొందిస్తాయి.

ఆకట్టుకునే శివలింగం
కృత్రిమ కొలను మధ్యలో భారీ శివలింగం దర్శనమిస్తుంది. ఈ కొలనులోని గంగ శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటుంది. ఈ శివలింగాన్ని సమీపం నుంచి దర్శించుకోవాలంటే పడవలో వెళ్లాలి. ఆలయ ప్రాంగణంలో దాదాపు 1008 శివలింగాలు ఉన్నాయి. వీటన్నిటికీ 24 గంటలు అభిషేకాలు జరుగుతూనే ఉండటం విశేషం.

థీమ్ పార్క్
విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన థీమ్ పార్క్​లో అనేక దేవీ దేవతల విగ్రహాలు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, రామాయణ మహాభారత ఘట్టాలు అబ్బురపరుస్తాయి. కాళీయమర్ధనం, గోవర్ధనగిరి ఘట్టం, రాసలీల దృశ్యం కృష్ణతత్వాన్ని కళ్లెదుట నిలుపుతుంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన లేజర్ షోలు చిన్నారులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

ఇవే ప్రత్యేకతలు
పూర్తిగా భక్తులు అందించిన విరాళాలతోనే నిర్మించిన ఈ నీలకంఠ ధామం నిర్మాణానికి దాదాపు వందకోట్ల రూపాయలు ఖర్చయి ఉంటాయని అంచనా! ఈ మొత్తం నిర్మాణంలో ఎక్కడా లోహాన్ని ఉపయోగించలేదు. సాంప్రదాయ శైలిలో రాళ్లను ఇంటర్ లాకింగ్ విధానంలో అమర్చుతూ నిర్మించడం ప్రత్యేకత!

పూజోత్సవాలు
నిత్యం వేలాదిమంది దర్శించుకునే ఈ పవిత్ర ధామంలో దీపావళి, జన్మాష్టమి, శ్రావణ పౌర్ణమి, హోలీ వంటి పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం పూట స్వామివారికి ఇచ్చే హారతి చూసి తీరాల్సిందే! ఏడాది పొడవునా నిత్యాన్నదానం కొనసాగే ఈ ధామంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యాదానం చేయడం విశేషం. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన ముఖ్యమైన ధామం నీలకంఠ ధామం. ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయం విశిష్టత- అమ్మవారి ముఖాన్ని తాకే సూర్యకిరణాల వెనుక ఉన్న అద్భుతం ఇదే!

శ్రావణ శుక్రవారం ఈ లక్ష్మీ కుబేర ఆలయాన్ని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి!