జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం- 84 వేల మంది ఋషులు తపస్సు చేసిన దేవభూమి ఇదే!
84 వేల మంది ఋషులు తపస్సు చేసిన తపోభూమి- అష్టాదశ పురాణాలు వెలుగులోకి వచ్చిన పుణ్యక్షేత్రంగా నైమిశారణ్యం ప్రసిద్ధి- ఉత్తరప్రదేశ్‌లో గోమతి నది తీరాన వెలసిన దివ్యక్షేత్రం- జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర స్థలం

Published : June 11, 2026 at 2:54 AM IST
Naimisaranya Birthplace of Puranas : హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ఎదురు చూసే పుణ్యక్షేత్రం నైమిశారణ్యం. ఎనభై నాలుగు వేలమంది ఋషులు తపస్సు చేసిన తపోభూమిగా, ముక్కోటి దేవతలు కొలువుదీరిన దేవభూమిగా నైమిశారణ్యం ప్రసిద్ధి చెందింది. అందమైన ప్రకృతి సౌందర్యాలు మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండే ఆలయ సముదాయాలతో అలరారే పుణ్యక్షేత్రం నైమిశారణ్యం క్షేత్రం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పురాణాల పుట్టినిల్లు!
హిందూ సంప్రదాయం ప్రకారం ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా ఆ వ్రతానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలోనూ 'పూర్వం నైమిశారణ్యంలో సూత మహాముని శౌనకాది ఋషులకు' అంటూ కథ ప్రారంభం కావడం మనకు తెలిసిందే! ప్రత్యేకించి సత్యనారాయణ స్వామి వ్రత కథ, వినాయక చవితి వ్రత కథ వంటి వాటిల్లో ఈ ప్రస్తావన మనందరికీ సుపరిచితమే! అలాగే వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలు ఇక్కడే రచించారని ఈ క్షేత్ర స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు శ్రీ మద్ భాగవతం, పద్మ పురాణం, వాయు పురాణం, మార్కండేయ పురాణం వంటి అనేక పురాణాలు తొలిసారిగా ఋషులకు వివరించిన దివ్య ప్రదేశమే నైమిశారణ్యం. అందుకే ఈ క్షేత్రాన్ని పురాణాల పుట్టినిల్లుగా పిలుస్తారు.
నైమిశారణ్యం ఎక్కడుంది?
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో గోమతి నదీతీరంలో వెలసి ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వయంవ్యక్తమైన 8 తపోవనాల్లో నైమిశారణ్యం కూడా ఒకటి. భగవంతుడు తనంత తానే స్వయంగా ప్రకటితమైన ప్రదేశాలు దివ్యాలయాలుగా విరాజిల్లుతున్నాయి. అవే శ్రీరంగం, తిరుమల, ముక్తినాథ్, శ్రీముష్ణం, తోటాద్రి, పుష్కరం, బద్రీనాథ్, నైమిశారణ్యం. ప్రతి హిందువు తన జీవితకాలంలో ఈ 8 క్షేత్రాలు దర్శించాలని తపిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన నైమిశారణ్యం క్షేత్ర పురాణం గురించి తెలుసుకుందాం.
క్షేత్ర పురాణం
ద్వాపర యుగం అంతమై కలియుగ ఆరంభమైన సమయంలో తాము తపస్సు చేసుకోవడానికి ఓ పుణ్య ప్రదేశాన్ని చూపించమని మహర్షులు, ఋషులందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్ధించారంట! అప్పుడు బ్రహ్మ ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి, మహర్షులను దానివెంట వెళ్లమని, ఎక్కడైతే ఆ చక్రం ఆగి విరుగుతోందో ఆ ప్రదేశమే తపోభూమి అని, యజ్ఞార్హత కలిగిన ప్రదేశమని సూచించాడంట!
చక్రాన్ని అనుసరించిన మునులు
బ్రహ్మదేవుని ఆదేశం మేరకు మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్తే ఆ చక్రానికి ఉండే అంచు అంటే 'నేమి' ఈ అరణ్య ప్రాంతంలో పడిందట! అలా 'నేమి' పడిన అరణ్య ప్రాంతం కాబట్టి ఈ తపోవనానికి నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. ఆ విధంగా నైమిశారణ్యం భగవంతుని స్వయంవ్యక్త క్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది.
పురాణాలు బోధించిన పుణ్యభూమి
ఈ నైమిశారణ్యంలోనే వ్యాస మహర్షి చతుర్వేదాలను, అష్టాదశ పురాణాలను తన శిష్యులకు బోధించాడంట! అలాగే సూత మహాముని, శౌనకాది మునులకు అష్టాదశ పురాణాలు ఇక్కడే వినిపించాడట! వైశంపాయనుడు కూడా ఇక్కడే భాగవత పారాయణ చేసాడంట! అలాగే సూత ముని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని, వ్రతకథను తొలిసారిగా నైమిశారణ్యంలోనే వివరించాడంట! అలాగే శ్రీరాముడు నైమిశారణ్యంలోనే అశ్వమేధ యాగాన్ని చేసి, సీతాదేవి పేరిట ఓ గ్రామాన్ని దానం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ గ్రామాన్నే ఇప్పుడు సీతాపూర్ గా పిలుస్తున్నారు. నడిచే దైవంగా ఖ్యాతి చెందిన శ్రీ ఆది శంకరాచార్యుల వారు కూడా తమ దిగ్విజయ యాత్రలో భాగంగా నైమిశారణ్యాన్ని సందర్శించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
నైమిశారణ్యంలో దర్శించాల్సిన ఆలయాలు
అనేక ఆలయాలకు నెలవుగా ఉన్న నైమిశారణ్యంలో ప్రధానంగా దర్శించాల్సిన ఆలయాలేవో చూద్దాం.
చక్రతీర్థం
బ్రహ్మదేవుడు విసిరిన చక్రం పడిన పవిత్ర ప్రదేశమే చక్రతీర్ధం. ఈ పవిత్ర తీర్ధంలో స్నానమాచరిస్తే శారీరక మానసిక రుగ్మతలు నయమవుతాయని విశ్వాసం. ఈ చక్రతీర్థం చుట్టూ వినాయకుడు, సీతారామలక్ష్మణులు ఆలయాలతో పాటు ప్రధానంగా భూతేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని కూడా భక్తులు తప్పకుండా దర్శించుకోవాలి. పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా, నైమిశారణ్య రక్షకుడిగా వెలిశాడని అంటారు. సీతాదేవి పూజించిన ఈ స్వామికి అభిషేకం చేస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
లలితాదేవి ఆలయం
సతీదేవి హృదయ భాగం పడిన ఈ ప్రదేశం శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని లింగ ధారిణిగా, త్రిపుర సుందరిగా పూజిస్తారు.
బాలాజీ మందిర్
విజయవాడకు చెందిన వైఖానస సమాజం వారు ఉత్తరాదిన కూడా తిరుమల తరహా ఆలయం ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన ఆలయమే ఈ బాలాజీ మందిర్! శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసి ఉన్న ఈ ఆలయంలో తిరుమల తరహాలో అన్ని రకాల పూజోత్సవాలు జరుగుతాయి.
నైమిశ నారాయణ క్షేత్రం
నైమిశ నాథ్ దేవరాజ్ ఆలయంలో భారీ విష్ణుమూర్తి విగ్రహం దర్శనమిస్తుంది. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు నైమిశ నాథుడిగా, శ్రీ మహాలక్ష్మి పుండరీక వల్లిగా దర్శనమిస్తారు. అలాగే అహోబిల నరసింహ స్వామి ఆలయం, వ్యాసగద్ది పిలవబడే వ్యాసపీఠం, ఆనందమయ మాత ధామం వంటివి ఎన్నో ఇక్కడ దర్శనీయ స్థలాలు.
ఎలా చేరుకోవాలి?
లఖ్నవూ వరకు విమానంలో లేదా రైలులో చేరుకుని అక్కడ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమిశారణ్యానికి ప్రైవేటు వాహనాల్లో కానీ, ప్రభుత్వం నడిపే బస్సులో కానీ సులభంగా చేరుకోవచ్చు. నైమిశారణ్యం గురించి స్మరించినా, చదివినా, విన్నా దర్శించిన ఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఓం నమో నారాయణాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
భార్యలు, పిల్లలతో కలిసి దర్శనమిచ్చే అరుదైన గణపతి- మూడు నేత్రాల వినాయకుని మహిమ ఇదే!
శోణ భద్ర గణపతి శిలను పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు- ఏ తిథిలో పూజిస్తే ఏ వరం లభిస్తుందో తెలుసా?

