మట్టపల్లిలో శిలపైన వెలసిన నరసింహుడు! - తడి దుస్తులతో 32 ప్రదక్షణిలు చేస్తే కోరికలు తీరుతాయి!
-యముడే స్వయంగా ప్రదక్షిణలు చేసిన క్షేత్రం - వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహిమాన్వితమైన ఆలయం - ఎప్పుడైనా వెళ్లారా?

Published : May 31, 2026 at 4:02 PM IST
Mattapalli Laxmi Narasimha Swamy Temple: తెలంగాణలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులోనూ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన దేవాలయాలు కోకొల్లలు. ఆయన కొలువై ఉన్న ఆలయాలల్లో దేని ప్రాశస్త్యం దానిదే. ప్రతిదీ ప్రత్యేకమైనదే. వాటిలో మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వామి ఆలయం ఒకటి. యముడే స్వయంగా ప్రదక్షిణలు చేసిన క్షేత్రం ఇది. ఇక పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మహిమాన్వితమైన ఆలయంలో స్వామి స్వయంభువుగా వెలిశాడు. అంతేకాకుండా కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఈ నేపథ్యంలో మట్టపల్లి ఆలయ చరిత్ర, విశిష్టత, ఎలా చేరుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కృష్ణానది తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో నరసింహస్వామి ప్రహ్లాద యోగానంద నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు. యమధర్మరాజు స్వయంగా ప్రదక్షిణలు చేసిన యమమోహిత క్షేత్రంగానూ ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
స్థల పురాణం: పూర్వం రోజుల్లో కృష్ణానది తీరంలోని తంగెడ రాజ్యాన్ని అనుముల మాచిరెడ్డి అనే రాజు పరిపాలించేవాడు. అయితే ఒకానొక సమయంలో ఆ రాజుకు స్వామి కలలో కనిపించి నదీతీరంలో ఉన్న అడవిలోని ఓ గుహలో తన ఉనికిని తెలియజేశాడు. దీంతో ఆ మరుసటి రోజు రాజు అడవిలోని గుహలు మొత్తం వెతికినా స్వామి జాడ తెలియలేదు. పైగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఆ విచారంలోనే ఓ చెట్టునీడన సేదతీరుతున్న సమయంలో మళ్లీ స్వప్నం వచ్చింది. ఆ కలలో స్వామివారి మరోసారి కనిపించి సమీపంలో ఉన్న ఆరె చెట్టు మీద గరుడ పక్షి ఉంటుందని, అదే దారి చూపిస్తుందని చెప్పాడట. ఆ ప్రకారంగా వెళ్లిన రాజు గుహను వెతికి, శుభ్రం చేయగా... దక్షిణావృత శంఖంతో ఓ రాయిపైన స్వామి ఆకారం కనిపించిందట. ఇక స్వామి స్వయంభుగా వెలవడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించాడనేది పురాణకథ.

ఆరెపత్రితో పూజలు: స్వయంభుగా వెలిసినా ఇక్కడ స్వామి వారు రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా స్వామి వారికి నిత్యం ఆరెపత్రితో పూజలు చేస్తారు. ఇక స్వామి వారి గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. దేవాలయం లోపల అళ్వారుల విగ్రహాలు, అద్దాల మేడ ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు ఇక్కడ తలనీలాలు ఇచ్చేందుకు కల్యాణకట్ట కూడా ఉంది.
32 ప్రదక్షిణలు చేస్తే: ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు పవిత్ర కృష్ణా నదిలో స్నానం చేసి ధ్వజస్తంభం చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తే మంచిదని నమ్ముతారు. ప్రదక్షిణలు ఎలా చేయాలంటే.. సంపూర్ణమైన విశ్వాసం, భక్తితో ఏదైనా కోరిక కోరుకుని నదిలో మూడు సార్లు మునిగి తడి బట్టలతో ధ్వజస్తంభం మొదలు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 32 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకోవాలి. ఆ కోరిక తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేస్తే మంచిదని ప్రగాఢ నమ్మకం. ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన, ఉద్యోగయోగం కలుగుతుందనీ, గృహ సంబంధిత బాధలు పూర్తిగా తొలగిపోతాయనీ ఓ నమ్మకం. ముఖ్యంగా శుక్ర, శనివారాలు కృష్ణానదిలో స్నానమాచరించి, స్వామిని పూజించి, బసచేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

మాలధారణలతో భక్తులు: నిత్యపూజలతో పాటు ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలూ, అధ్యయనోత్సవాలూ, బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు. ఇక నిత్యకల్యాణంతో పాటు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతీ నక్షత్రం రోజున జరిపే ప్రత్యేక పూజలనూ, గరుడసేవనూ చూసి తరించాల్సిందే. ఏడాదికి రెండుసార్లు స్వామి మాలధారణ చేసి, మండల దీక్షను చేపట్టే భక్తులు... ఇక్కడ ఇరుముడిని సమర్పించడం విశేషం.
సమీపంలో శివాలయం: స్వామి వారి ఆలయానికి సమీపంలో శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిగా దర్శనం ఇస్తారు. నరసింహ స్వామి దర్శనం అనంతరం భక్తులు ఈ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కార్తిక మాసంలో నదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఎలా చేరుకోవచ్చు: సూర్యాపేట జిల్లాలో ఉండే ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు... హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న కోదాడ బస్టాండ్‌కు చేరుకుంటే అక్కడి నుంచి మట్టపల్లి క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. లేదంటే హుజుర్నగర్ చేరుకుంటే బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలూ ఉంటాయి. ఇక మట్టపల్లిలో బస చేసేందుకు సత్రాలు చాలానే ఉంటాయి. కానీ చాలా మంది స్వామి వారి ప్రాంగణంలోనే బస చేస్తారు.
దైవ దర్శనం తర్వాత శఠగోపం తలపై పెడతారు- ఎందుకో తెలుసా?
బిర్లా మందిర్‌కు 50 ఏళ్లు పూర్తి- హుస్సేన్ సాగర్ ఒడ్డున వెన్నెలలా మెరిసే ఆలయ విశేషాలివే!

