ETV Bharat / spiritual

శివుని ఆజ్ఞతో తనను తానే తిన్న రాక్షసుడు- ఎలా 'మకరతోరణం'గా మారాడో తెలుసా?

దేవాలయాల్లో దేవతా విగ్రహాల వెనుక మకరతోరణం- అలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?

Makara thoranam Significance
Makara thoranam Significance ((representative image) ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 4:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

Makarathoranam Significance : దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన మకర తోరణాన్ని ఎప్పుడైనా పరిశీలనగా గమనించారా! ఆ తోరణానికి మధ్యభాగంలో పెద్ద పెద్ద కళ్లతో ఒక రాక్షస ముఖం కనబడుతుంది. దానికి 'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షస ముఖాన్ని మకర తోరణం మధ్య భాగంలో అమర్చటానికి గల కారణం గురించి స్కంద మహాపురాణం ఒక కథ వుంది. ఆ కథా విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కీర్తిముఖుని కథ
పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు. వరగర్వంతో వచ్చిన బలపరాక్రమాలతో ఆ రాక్షసుడు సమస్త భువనాల్లోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు ఆ దుష్టుడు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని సంహరించమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. బ్రహ్మ నుంచి మరణం లేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో కీర్తిముఖుడు పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగాడు. చివరకు ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడుకున్నాడు.

పరమేశ్వరుని అనుగ్రహం
భక్త సులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించడం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడో కన్నుగా ధరించాడు. ఆనాటి నుంచి శివుడు త్రినేత్రుడుగా భాసిల్లుతున్నాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదని, తాను తినటానికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వమని మహాదేవుని కోరాడు. అప్పుడు శివుడు యుక్తిగా 'నిన్ను నువ్వే తిను'! అని చెప్పాడు. ఎంతటి వాడైనా శివుని ఆజ్ఞ పాటించి తీరాల్సిందే కదా!

మొసలిగా మారిన రాక్షసుడు
శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలు పెట్టి కంఠం వరకు తిన్నాడు. కానీ తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు కీర్తిముఖుడు శివుని ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు, 'ఈనాటి నుంచి అన్ని దేవతాలయాల్లో దేవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురహంకారాన్ని, ఆశను తింటూ ఉండు. ఇదే నీకు ఆహారం. క్రమంగా నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు' అని వరమిచ్చాడు.

మకరతోరణం ఇలా వచ్చింది!
ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణ మధ్యభాగాన్ని ఆశ్రయించి ఉండసాగాడు. తన రాక్షస మకర ముఖంతో మకర తోరణాన్ని అధిష్ఠించి, దైవ దర్శనానికి వచ్చే భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళించ సాగాడు. ఈ కారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే 'మకరతోరణం' అని పేరు వచ్చింది.

దైవసన్నిధిలో శాశ్వత స్థానం
కానీ ఏనాటికి అంతం కానీ మానవుల దురాశ కారణంగా కీర్తిముఖునికి కావాల్సినంత ఆహారం దొరుకుతూనే ఉంది. మకర తోరణంగా దైవం వెనుక అతని స్థానం శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే దేవాలయాలకు భక్తితో వెళ్లాలి కానీ ఆశ, దురాశలతో వెళ్ళకూడదు. ఇదే ఈ కథలో గ్రహించాల్సిన సత్యం. ఇకనుంచి ఆలయానికి వెళ్లినప్పుడు మకర తోరణానికి తప్పకుండా నమస్కరించుకుందాం.
ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.