గ్రహణం అశుభ కాలమా? ఆలయ శుద్ధి ఆచారాల వెనుక అసలు పరమార్థం ఏంటి?
గ్రహణాల వేళ దేవాలయాల తలుపులు ఎందుకు మూస్తారు?

Published : March 2, 2026 at 2:52 AM IST
Lunar Eclipse Temple Closed Reasons : మార్చి 3, మంగళవారం పాక్షిక కేతు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్ర గ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కొన్ని గంటలపాటు మూత పడనున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. అదే మాదిరి తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ఆలయాలు కూడా మూసివేయనున్నారు. ఈ సందర్భంగా అసలు గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసేయాలి? ఇందులో పరమార్థం ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసేస్తారు?
మన దేశంలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో ప్రముఖ దేవాలయాల తలుపులన్నీ మూసేస్తారు. హిందూ సంప్రదాయంలో, చంద్రగ్రహణం సమయంలో దేవాలయాలను మూసి వేయడం అనేది ఒక పురాతన ఆచారం. దీని వెనుక కొన్ని నమ్మకాలు, శాస్త్రీయ కారణాలు, అలాగే ఒక పురాణ కథనం ఉన్నాయి. గ్రహణాన్ని ఒక అశుభమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు ప్రబలంగా ఉంటాయని నమ్ముతారు.
పురాణ కథనం
స్కంద పురాణం ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతం కోసం దేవదానవులు పోటీ పడతారు. అసురులకు అమృతం దక్కితే లోకాలకు కీడు జరుగుతుంది. లోక కల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి దేవదానవులను వేరువేరు వరుసల్లో కూర్చోబెట్టి అమృతాన్ని పంచసాగాడు. మోహిని అవతారంలో నారాయణుడు రాక్షసులను సమ్మోహనపరచి మాయోపాయంతో వారికి అమృతం దక్కకుండా చేస్తాడు. అయితే ఇది గ్రహించిన రాక్షస గణాల్లోని రాహుకేతువులు కూడా సూర్య చంద్రుల మధ్య కూర్చుని అమృతాన్ని పొందుతారు. జరిగిన మోసాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు వివరిస్తారు. అయితే అప్పటికే రాహువు, కేతువుల కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది. శ్రీ మహా విష్ణువు ఆగ్రహంతో తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండిస్తాడు. కానీ అప్పటికే వారు అమృతం స్వీకరించి ఉండడం వల్ల వారి తల భాగం అమరత్వంతో ఉండిపోతుంది, శరీరం మాత్రం నశించిపోతుంది.
సూర్య చంద్ర గ్రహణాలు ఇందుకే!
ఈ సంఘటన తర్వాత, రాహువు సూర్యచంద్రులపై పగతో అప్పుడప్పుడు మింగడానికి ప్రయత్నిస్తాడని, అలా సూర్యుడిని రాహువు మింగినప్పుడు సూర్య గ్రహణం, కేతువు చంద్రుడిని మింగినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని పురాణ కథనం ద్వారా తెలుస్తోంది.
అపవిత్ర కాలంగా గ్రహణ సమయం
ఆనాటి నుంచి గ్రహణ సమయాన్ని అపవిత్రంగా భావించి దేవాలయాలు మూసివేసే సంప్రదాయం ఆనవాయితీగా మారింది. ఈ సమయంలో బలంగా ఉండే ప్రతికూల శక్తుల నుంచి దేవుని విగ్రహాలను రక్షించడం కోసమే గ్రహణానికి కొన్ని గంటల ముందు ఆలయాలను మూసివేస్తారు, గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి, విగ్రహాలకు మళ్లీ అభిషేకం చేసిన తరువాత పూజలు తిరిగి ప్రారంభమవుతాయి.
శుద్ధి సంప్రదాయం
గ్రహణం తరువాత ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేయడం ఆచారం. ఈ ప్రక్రియలో విగ్రహాలకు పవిత్ర జలంతో స్నానం చేయించడం, మొత్తం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది.
శాస్త్రీయ కారణాలు
దేవాలయాల్లో అద్భుతమైన కాస్మిక్ శక్తులు అంటే దైవ సంబంధమైన సానుకూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఆలయాలకు వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే గ్రహణాలు సంభవించినప్పుడు విదులయ్యే కొన్ని ప్రతికూల శక్తులతో కూడిన కాంతి పుంజాల కారణంగా ఆలయంలోని దైవిక శక్తులు వాటి ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి గ్రహణాల వేళ ఆలయాలను మూసివేస్తారు.
శాస్త్రీయంగా చూసినా ఈ కిరణాల ప్రభావం కొంత హాని చేస్తుందని తెలుస్తోంది. అందుకే మన పెద్దలు గ్రహణాల వేళ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రానున్న గ్రహణం సమయంలో మనం కూడా మానవాళికి మేలు జరగాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్ధిద్దాం.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

