ETV Bharat / spiritual

శ్రావణ శుక్రవారం ఈ లక్ష్మీ కుబేర ఆలయాన్ని దర్శిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి!

తమిళనాడులోని రత్నమంగళంలో లక్ష్మీదేవి, కుబేరుడు, చిత్రలేఖ సమేతంగా కొలువైన అరుదైన ఆలయం- లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహంతో ఐశ్వర్యం, సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం

Lakshmi Kubera Temple Tamil Nadu
లక్ష్మీ కుబేర (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 3:31 AM IST

4 Min Read
Choose ETV Bharat

Lakshmi Kubera Temple Tamil Nadu : పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలందరూ మంగళ గౌరీ నోములు, వరలక్ష్మి వ్రతాలతో హడావుడిగా ఉంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనదే! శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్యస్వామి ఇలా ఎంతమందిని పూజించినా లక్ష్మీదేవి పూజ మాత్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేస్తుంటారు. సాక్షాత్తు ఆ సిరుల తల్లి మన ఇంట కొలువై వరాలు ఇవ్వాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవితో పాటు సంపదలకు అధిదేవత కుబేరుడు వెలసిన ఓ ప్రాచీన ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లక్ష్మీ కుబేర పూజ విశిష్టత
కుబేరుడు అంటే అందరికీ సుపరిచితమే! ఆయన కరుణ వుంటే సంపదలకు లోటుండదు. అష్టైశ్వర్యాలను ప్రసాదించేది లక్ష్మీదేవి అయితే ఆ సంపదలను మనదాకా అందించేవాడే కుబేరుడు. కుబేరుని పూజిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. ఆ కుబేరుణ్ణి లక్ష్మీదేవితో కలిసి పూజిస్తే, వారిద్దరి కరుణ మనపై వుంటే ఇక ఆ అదృష్టానికి అంతే ఉండదు. వారివురికి చేసే పూజలు వేరు, మంత్రాలు వేరు! అయినప్పటికీ నియమనిష్టలతో, సద్భక్తితో చేసే పూజలు ఎన్నడూ వ్యర్థం కావు.

అరుదుగా కుబేరుని ఆలయాలు
మన దేశంలో ఎన్నో దేవి దేవతలు ఆలయాలున్నాయి. కుబేరునికి ప్రత్యేకంగా ఆలయాలు లేనప్పటికీ బదరీనాథ్​లో కుబేరుని విగ్రహాన్ని చూడవచ్చు. అలాగే మరికొన్ని ఆలయాల్లో కూడా కుబేరుని దర్శించుకోవచ్చు. కానీ తమిళనాడులోని ఓ ఆలయంలో కుబేరుడు తన భార్య చిత్రలేఖ, ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవితో కలిసి దర్శనమిస్తాడు. ఈ ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో తెలుసుకునే ముందు కుబేరుని గురించి కొంత విపులంగా తెలుసుకుందాం.

కుబేరుని వృత్తాంతం
కుబేరుడు విశ్వావసు మహర్షి, భరద్వాజుని కుమార్తె అయిన దేవమినిల సంతానం. ఈయన అసలు పేరు వైశ్రవణుడు. ఈయన కొంత విద్యాభ్యాసం పూర్తయ్యాక తండ్రి సలహా మేరకు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై వైశ్రవణుని ఉత్తరదిక్కుకు అధిపతి చేసి, కుబేరుడని పేరు పెట్టి పుష్పక విమానాన్ని కూడా ఇస్తాడు. శివ భక్తుడైన కుబేరుడు తన సోదరుడైన రావణాసురునికి లంకా రాజ్యాన్ని అప్పజెప్పి తాను పరమ శివుని కోసం తపస్సు ఆచరించసాగాడు.

శివపార్వతుల ప్రత్యక్షం
కుబేరుని తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు. పార్వతీదేవి సౌందర్యానికి, తేజస్సును తట్టుకోలేక కుబేరుని ఒక కన్ను అప్రయత్నంగా కొట్టుకుంటుంది. అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి కుబేరుని కంటిచూపును పోగొడుతుంది.

పరమేశ్వరుని కరుణ
కానీ శివుడు పార్వతి అపోహ తొలగించి కుబేరుని కంటి చూపును తిరిగి ప్రసాదిస్తాడు. అప్పుడు పార్వతి కుబేరునికి ఇంకేమైనా వరం ఇవ్వమని అడిగితే అప్పుడు శివుడు కుబేరునికి నవనిధులు కానుకగా ఇస్తాడు. అవే కల్పవృక్షం, కామధేనువు, శంఖం, చేప, తాబేలు, వజ్రవైడూర్యాలు, పాలు, తామర, ఆవు, దూడ.

లక్ష్మీ కుబేర ఆలయం ఎక్కడుంది?
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా వందలూరుకు సమీపంలో ఉన్న రత్నమంగళం అనే గ్రామంలో ఈ ప్రాచీనమైన లక్ష్మి కుబేర ఆలయం ఉంది.

ఆలయ విశేషాలు
లక్ష్మి కుబేర ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమ వైపు గుండ్రంగా ప్రతిష్టించిన షోడశ అంటే 16 గణపతులను దర్శించవచ్చు. ఈ గణపతులు కింద ఒక మాసంలో శుక్ల పక్షంలో, కృష్ణ పక్షంలో వచ్చే 14 తిథులు, పౌర్ణమి, అమావాస్య తిధులతో కలిపి మొత్తం 16 తిథులలో ఏ తిధిలో జన్మించిన వారు ఏ గణపతిని పూజించాలో వివరంగా రాసి ఉంటుంది. ఈ 16 గణపతులు 16 తిథులకు అధిదేవతలు.

సతీసమేతంగా వెలసిన నవగ్రహ దేవతలు
ఈ షోడశ గణపతుల పక్కనే నవగ్రహాలు తమ భార్యలతో సహా కొలువై ఉండడం విశేషం. అలాగే ఆలయానికి ప్రదక్షిణ మార్గంలో వెళ్తుంటే ఓ వైపు బ్రహ్మ సరస్వతులు దర్శనమిస్తారు. ఆ వెనుకనే స్వర్ణాకర్షణ భైరవుడు దర్శనమిస్తారు. మరో పక్క వేంకటేశ్వరస్వామి కూడా దర్శనమిస్తారు. కలియుగంలో శ్రీ పద్మావతిని వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడు ఒక కోటి నలభై లక్షల బంగారు నాణేలు అప్పుగా తీసుకున్నాడని అంటారు. ఇప్పటికి శ్రీనివాసుడు ఈ అప్పుకు వడ్డీ మాత్రమే కడుతున్నాడు కానీ అసలు ఇంకా తీర్చలేదని వేంకటాచల మహత్యంలో వివరించి ఉంది. వేంకటేశ్వరస్వామికి పక్కనే కుమార స్వామిని కూడా దర్శించుకోవచ్చు.

ధనాకర్షణ కుబేరుడు
గర్భాలయంలో కుబేరుడు, చిత్రలేఖల విగ్రహాలు వాటికీ కొంచెం వెనుకగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. కుబేరుడు వెండితలపాగా ధరించి ఉంటాడు. గర్భాలయంలో విగ్రహాలన్నింటికీ వెండి తొడుగులు, కరెన్సీ నోట్ల హారాలు ఉంటాయి. మరి కుబేరుడంటేనే సంపద కదా!

చిల్లి కాణితో కనక వర్షం
ఆలయ ప్రాంగణంలో పురాతనమైన రాగి చిల్లి కాణీలకు ఎర్ర దారం కట్టి విక్రయిస్తుంటారు. ఈ నాణేన్ని కుబేరుని బొజ్జకు తాకించి, ఎడమ చేతిలో ఉంచి, ఆ నాణేన్ని మన ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుందని అంటారు. కుబేరునికి ఆకుపచ్చ రంగంటే ప్రీతి. అందుకే ఈ ఆలయంలో ఇచ్చే కుంకుమ, రక్షలు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి.

ఎలా చేరుకోవాలి?
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని వందలూరుకు చేరుకోవడానికి చెన్నై, చెంగల్పట్టు నుంచి బస్సు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లక్ష్మి కుబేర ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. శుభకరమైన ఈ శ్రావణ మాసంలో మనం కూడా ఈ లక్ష్మి కుబేర ఆలయాన్ని సందర్శించి అష్టైశ్వర్యాలు పొందుదాం.

ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః! ఓం శ్రీ కుబేర దేవాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.


హయగ్రీవ జయంతి- విద్య, జ్ఞానం ప్రసాదించే ఈ విష్ణు అవతార రహస్యం ఇదే!

శ్రావణ పౌర్ణమి నాడు ఏడుకొండలవాడిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!