ETV Bharat / spiritual

హోలీ రోజే లక్ష్మీ జయంతి- ఇలా పూజిస్తే సిరుల తల్లి అనుగ్రహం పక్కా!

లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధించాలంటే- లక్ష్మి జయంతి రోజున ఎలా పూజించాలి?

Lakshmi Jayanti 2026
Lakshmi Jayanti (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 4:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

Lakshmi Jayanti 2026 : హిందూ సంప్రదాయంలో శ్రీలక్ష్మి జయంతి అత్యంత పవిత్రమైన రోజు. భాగవతం ప్రకారం శ్రీలక్ష్మి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మి జన్మించినట్లుగా తెలుస్తోంది. ఏడాది మొత్తం ఎలా పూజించినా లక్ష్మి జయంతి రోజు మాత్రం శ్రీ మహాలక్ష్మిని కొన్ని ప్రత్యేక విధానాలలో పూజించడం వల్ల ఆ తల్లి సంతోషించి వరాలు కురిపిస్తుందని అంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాది లక్ష్మి జయంతి ఎప్పుడు? ఆ రోజు సిరుల తల్లిని ఎలా పూజించాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

క్షీరాబ్ది కన్య
పురాణాల ప్రకారం దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. ఈ క్రమంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో శ్రీ లక్ష్మి క్షీర సాగరం నుంచి ఉద్భవించి నట్లుగా మహాభాగవతం ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 3, మంగళవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఈ రోజునే లక్ష్మి జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. అయితే ఈసారి ఇదే రోజు చంద్రగ్రహణం ఉన్నందున ఉదయం 9 గంటల లోపు కానీ, రాత్రి 7:30 తరువాత కానీ లక్ష్మి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.

లక్ష్మి కటాక్షం సిద్దించాలంటే?
సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం లేకపోతే ఎన్ని చదువులు చదివినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత గొప్పవాడైనా సరే ఇబ్బందులు పడాల్సిందే! అందుకే లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటాం. కానీ సిరుల తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభించి సకల కోరికలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆ విధి విధానాల గురించి వివరంగా తెలుసుకుందాం.

శ్రీలక్ష్మి పూజ ఎలా చేయాలి?
లక్ష్మి జయంతి రోజే హోలీ పండుగ కావడం విశేషం. లక్ష్మి జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత స్నానమాచరించి పూజామందిరంలో ఏనుగులు అభిషేకిస్తున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నిలుచుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజించరాదు. వరద, అభయ హస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి సమక్షంలో ఆవునేతితో ముంచిన తామర వత్తులతో దీపారాధన చేయాలి. దీపాన్ని కుంకుమ, అక్షింతలతో అలంకరించాలి. అనంతరం కుంకుమ కలిపిన అక్షింతలతో లక్ష్మి అష్టోత్తర శతనామార్చన చేయాలి. కనకధారా స్తోత్రం పఠించాలి. పూజ పూర్తయ్యాక వడపప్పు, పానకం, చలిమిడి, క్షీరాన్నం వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి.

సువాసిని పూజ
శ్రీలక్ష్మి జయంతి రోజు ఒక ముత్తైదువు ఇంటికి పిలిచి పసుపు, పారాణి ఇచ్చి చీర రవికె దక్షిణ తాంబూలం ఇచ్చి, భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది.

సంతృప్తిని మించిన ధనం లేదు
లక్ష్మి జయంతి రోజు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో డబ్బుకు లోటుండదు. వాస్తవానికి సంతృప్తిని మించిన ధనం ఎక్కడా లేదు. సంతృప్తితోనే సంతోషం కలుగుతుంది. సంపదలు చూసుకుని ఏ మాత్రం గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. ధనాన్ని సద్వినియోగం చేయడమే సంపద పరమార్థం. అది విస్మరిస్తే లక్ష్మీదేవి మనల్ని విడిచి వెళ్లిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.

అసలైన లక్ష్మి కటాక్షం ఇదే!
లక్ష్మి కటాక్షం అంటే, ఒక పనిచేసే వారికి చేతినిండా పని దొరకడం, చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం. పండితులకు వారి పాండిత్యానికి, ప్రతిభా సంపత్తులకు తగిన గౌరవం దొరకడం. రోగాలు లేని మంచి ఆరోగ్యం ఉండడం, కుటుంబంలో ఐక్యత ఉండడం. ఇవన్నీ కూడా లక్ష్మి కటాక్షాలే! చూసే దృష్టి ఉండాలి కానీ మన స్వధర్మమే మనల్ని కాపాడే లక్ష్మీ కటాక్షం! అదే నిజమైన ఐశ్వర్యం!

ఈ లక్ష్మి జయంతి రోజు మనం కూడా సిరుల తల్లిని యధాశక్తి పూజిద్దాం. లక్ష్మి కటాక్షాన్ని పొందుదాం.

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం