ETV Bharat / spiritual

కృష్ణాష్టమి ఎప్పుడు? పూజా విధానం, నైవేద్యాలు, ఉట్టి వేడుకలు ఇలా చేస్తే కన్నయ్య అనుగ్రహం!

కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ, బాలకృష్ణుని పూజ, ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ- ద్వారక, మథుర, బృందావనం వంటి కృష్ణ క్షేత్రాల్లో జరిగే వైభవమైన వేడుకలు

Krishna Ashtami 2026
శ్రీకృష్ణాష్టమి (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : September 3, 2026 at 3:32 AM IST

3 Min Read
Choose ETV Bharat

Krishna Ashtami 2026 : శ్రీకృష్ణుడు జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీకృష్ణుడు స్వయంగా నడయాడిన ద్వారక, మథుర, బృందావనం, ఉడిపి, గురువాయూర్​తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఇద్దరు తల్లుల ముద్దుల కృష్ణుడు
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణవతారం. దేవకీదేవి అష్టమ గర్భాన శ్రావణ బహుళ అష్టమి రోజు జన్మించిన శ్రీకృష్ణుడు గోకులంలో యశోద ముద్దు బిడ్డగా పెరిగి పెద్దయ్యాడు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమిగా, గోకులాష్టమిగా, శ్రీ కృష్ణాష్టమి జరుపుకోవడం మన సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కృష్ణాష్టమి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ శుద్ధ షష్టి రోజు, రోహిణి నక్షత్ర శుభ ముహూర్తంలో కారాగారంలో శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భాన జన్మించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు శ్రావణ శుద్ధ అష్టమి, రోహిణి నక్షత్రం కలిసి వచ్చినందున ఈ రోజునే శ్రీకృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. కృష్ణాష్టమి పండుగ ఎలా జరుపుకోవాలో చూద్దాం.

ఉపవాసం జాగరణ
కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. అయితే ఇది తప్పనిసరి కాదు ఎవరి ఆచారాలను వారు పాటించవచ్చు.

శ్రీకృష్ణాష్టమి పూజా విధానం
కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో, పూల మాలలతో అలంకరించాలి. చిన్ని కృష్ణుని సర్వాంగ సుందరంగా అలంకరించాలి. చిన్ని కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరి పిండిలో నీళ్లు కలిపి కృష్ణుని పాదాలను చక్కగా వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. బాల కృష్ణుడి విగ్రహం ముందు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీకృష్ణునికి ప్రీతికరమైన వెన్న, చలిమిడి, అటుకులు, సున్ని ఉండలు, వెన్న ఉండలు, కమ్మని ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు విశేషించి ఎండుకొబ్బరి, పచ్చ కర్పూరం, ఏలకులు, పంచదార వంటి ఐదు మధుర పదార్ధాలతో తయారు చేసే పంచ ఖజ్జాయాన్ని శ్రీకృష్ణునికి నివేదించడం సంప్రదాయం.

ఉత్తరాదిన వేడుకగా
ఉత్తరభారతంలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కన్నయ్యకు ప్రేమతో 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే కన్నయ్యకు ఏ నైవేద్యం సమర్పించినా దానిమీద తులసి దళాలు మాత్రం తప్పకుండా వేయాలి. అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది.

ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలు
శ్రీకృష్ణుడు స్వయంగా నడయాడిన ద్వారక, మథుర బృందావనంలో పాటు ఇతర ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. విద్యుద్దీప కాంతులతో ఆలయాలు శోభాయమానంగా దర్శనమిస్తాయి. ఈ రోజంతా ఆలయాల్లో శ్రీ కృష్ణుని బాల్యక్రీడలు నృత్యరూపకాలుగా ప్రదర్శిస్తారు. శ్రీకృష్ణుని లీలలు వర్ణించే భాగవత గాథలను ఈ రోజు స్మరించుకుంటారు.

ఉట్టి వేడుకలు
కృష్ణాష్టమి సాయంత్రం వీధుల్లో ఉట్టి కొట్టే ఉత్సవం కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రతి ఊరిలో, వాడవాడలా ఈ వేడుక ఉత్సాహంగా జరుగుతుంది. చిన్న పిల్లలను కృష్ణుడిలా, గోపికల్లా అలంకరించి సందడిగా సాగే ఈ ఉట్టి ఉత్సవంలో భక్తులు కోలాహలంగా పాల్గొంటారు.

ఈ పారాయణలతో మోక్షం
ఈ రోజు భాగవతంలోని దశమ స్కంధము పారాయణ చేయడం శుభప్రదం. ఈ పర్వదినం రోజు శ్రీకృష్ణుని ఆలయంలో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేసిన వారికి వంశాభివృద్ధి, ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. స్కంద పురాణం ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలిగి మోక్షం లభిస్తుందని విశ్వాసం. మనం కూడా ఈ కృష్ణష్టామిని ఆనందంగా జరుపుకుందాం! శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుదాం.

జైశ్రీకృష్ణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

కృష్ణాష్టమి స్పెషల్​ "ఛప్పన్​ భోగ్​ మహా నైవేద్యం" - ఈ ప్రసాదం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ!

ఆదిశేషుడి అవతారం బలరాముడు- బుధవారం నాడు ఇలా పూజిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు!