కామాక్షి వ్రతం- 16 శుక్రవారాల పాటు ఈ విధంగా చేస్తే వివాహ, సంతాన ప్రాప్తి!
కామాక్షి వ్రత విశిష్టత- ఇలా చేస్తే మనసుకి నచ్చిన వారు భర్తగా రావడం- భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని విశ్వాసం!

Published : January 9, 2026 at 5:01 AM IST
Kamakshi Vratham Significance : హిందూ సనాతన ధర్మంలో పూజలు వ్రతాలు ఒక భాగం. సాధారణంగా ఈ పూజలు, వ్రతాలు మహిళల కోసం ఉద్దేశించినవే! కొన్ని రకాల గ్రహ దోషాల కారణంగా వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగక పోవడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం వంటి ఇబ్బందులు తొలగడానికి శాస్త్రం కొన్ని వ్రతాలు, నోములు సూచించింది. అందులో ముఖ్యమైనది కామాక్షి వ్రతం. ఈ కామాక్షి వ్రతాన్ని ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఫలితాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
16 శుక్రవారాల కామాక్షివ్రతం
స్వయంగా హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించారని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉంది. శ్రీ కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల దీపపు పూజ అత్యంత శక్తివంతమైనది. వివాహం కానివారు, సంతానం కోరుకునే వారు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి దేవి 16 శుక్రవారాల వ్రతం గురించి విపులంగా తెలుసుకుందాం.
కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల పూజ విధివిధానాలు!
ఈ పూజలో ఒక ప్రత్యేక నియమం ఉంది. అదేమిటంటే మొదటి శుక్రవారం 1 దీపంతో మొదలుపెట్టి, ప్రతి వారం ఒక దీపం పెంచుకుంటూ, 16వ శుక్రవారం నాటికి 16 దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించడానికి బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పిండి దీపాలు వాడటం అత్యంత శ్రేష్ఠం. వీలుకానివారు మట్టి ప్రమిదలు కూడా వాడవచ్చు. మొదటి వారం పూజ మొదలుపెట్టేటప్పుడు మీ కోరికను మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి. పూజ పూర్తయ్యాక అమ్మవారికి ఇష్టమైన పులిహోర, పాయసం లేదా చక్కర పొంగలి నివేదించాలి.
కామాక్షి వ్రతం మొదట ఎవరు చేశారు?
బ్రహ్మాండ పురాణంలో శ్రీ కామాక్షి దేవి 16 శుక్రవారాల పూజ గురించిన ప్రస్తావన ఉంది. సాక్షాత్తు అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు ఈ వ్రత మహిమను వివరించారు. పూర్వం పరమశివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీ దేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిని ప్రతిష్ఠించి, 16 వారాల పాటు కఠినమైన దీక్షతో అమ్మవారి రూపంలోనే పూజ చేసిందని చెబుతారు. అందుకే దీనిని 'కామాక్షి వ్రతం' అంటారు.
శుభ ముహూర్తం
ఈ వ్రతం ప్రారంభించడానికి ఒక శుభ ముహుర్తాన్ని నిర్ణయించుకోవాలి. ఈ వ్రతం ప్రారంభించడానికి శ్రావణ, మాఘ, కార్తీక మాసాలు ఉత్తమం. ఈ మాసాల్లో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించడం శ్రేష్ఠం. అలా కుదరని పక్షంలో వేరే మాసాల్లో శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మొదలు పెట్టవచ్చు. తిథి, నక్షత్రంతో సంబంధం లేదు.
పూజ విధానం విపులంగా
కామాక్షి వ్రతంలో దీపాల కోసం బియ్యం పిండి, బెల్లం కలిపి చేసిన పిండి ప్రమిదలు వాడటం కీలకం. మొదటి వారం 1 దీపంతో మొదలు పెట్టి దీపాల సంఖ్యను పెంచుకుంటూ 16 వ వారానికి వచ్చేసరికి 16 దీపాలు వెలిగించాలి. ఒక్కొక్క దీపంలో రెండేసి వత్తులు వేసి వెలిగించాలి.
పూజ ఎలా చేయాలి?
శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కామాక్షిదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. తరువాత మల్లెలు, చేమంతులు, సంపెంగ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న పిండి దీపంలో రెండు ఒత్తులు వేసి, ఆవునెయ్యి పోసి దీపారాధన చేయాలి. దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. తరువాత అక్షింతలు వేస్తూ అష్టోత్తరశతనామాలతో అమ్మవారిని అర్చించాలి. పూజ ముగించే ముందు కనకధారా స్తోత్రం పఠించి, కామాక్షి వ్రతకథను చదువుకోవడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. పూజ పూర్తయ్యాక అమ్మవారికి ప్రీతికరమైన పాయసం, చలిమిడి, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలు నివేదించాలి. ఇలా 16 వారాలు వ్రతం ఆచరించక చివరి వారం ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన ఇలా!
ఉద్యాపన రోజు పూజ పూర్తయ్యాక కనీసం 5 లేదా 9 కుదిరితే 16 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు, పారాణి రాసి, భోజనం పెట్టాలి. తరువాత బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో చీర, జాకెట్ ముక్క, తమలపాకులు, రెండు పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, దక్షిణలతో పాటు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని వాయనంగా ఇవ్వాలి.
పూజ ఎప్పుడు చేస్తే మంచిది!
సాధారణంగా పూజ అనగానే సూర్యోదయంతో కానీ బ్రాహ్మీ ముహూర్తంలో కానీ చేయాలని అంటారు. కానీ కామాక్షిదేవి 16 వారాల వ్రతం మాత్రం సూర్యాస్తమయం సమయంలో, ప్రదోషం వేళ చేయడం అత్యంత శ్రేష్ఠమని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి, కామాక్షి దేవి సంధ్యా సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారని నమ్మకం. ఈ సమయంలో పిండి దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని విశ్వాసం. అయితే మొదటి రోజు ఉదయం చేసి, మిగిలిన రోజులు సాయంత్రం చేస్తే కుదరదు. 16 వారాలు ఒకే సమయంలో పూజ చేయడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు దక్కుతాయి.
ఈ నియమాలు తప్పనిసరి!
కామాక్షిదేవి వ్రతం ఆచరించే వారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. పూజ చేసే శుక్రవారాల్లో ఉదయం నుంచి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. పూజ పూర్తయ్యాక ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. పూజ చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే ఆ వారాన్ని విడిచి పెట్టి మరో వారం పూజ చేసుకోవాలి. వీలైనంత వరకు 16 వారాల పాటు ఒకే ప్రదేశంలోనే ఉండి పూజ చేయడం ఉత్తమం.
కామాక్షి అమ్మవారి 16 వారాల వ్రత కథ
పూర్వం అగస్త్య మహాముని లోక కళ్యాణం కోసం శ్రీ విద్యా రహస్యాలను తెలుసుకోవాలని హయగ్రీవ స్వామిని ప్రార్థించారు. అప్పుడు హయగ్రీవ స్వామి అగస్త్యుడికి ఈ 'కామాక్షి వ్రతం' గురించి వివరించారు.
పార్వతీ దేవి ఆచరించిన వ్రతం
ఒకప్పుడు పార్వతీ దేవి పరమశివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. అప్పుడు ఆమె కాంచీపురంలోని నది తీరానికి చేరుకుని, ఇసుకతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించడానికి తన శిరస్సున ఉన్న గంగను ఆ సైకత లింగంపైకి ప్రవహింపజేశాడు. ఆ వరదలో లింగం కొట్టుకుపోతుందేమోనని భయపడి, పార్వతీ దేవి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. అందుకే ఈ లింగాన్ని ఆలింగనమూర్తి అంటారు.
పరమశివుడు ప్రత్యక్షం
పార్వతీ దేవి కఠినమైన దీక్షను, 16 వారాల పాటు ఆమె చేసిన దీపారాధనను చూసి పరమశివుడు ప్రసన్నమయ్యాడు. ఆమె కళ్లలో తనపై ఉన్న ప్రేమను చూసి ఆమెకు 'కామాక్షి' అని నామకరణం చేసి, ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ 16 వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారికి మనసుకి నచ్చిన వారు భర్తగా వస్తారని, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
వ్రతఫలం
మహిమాన్వితమైన ఈ కామాక్షి వ్రతం చెయ్యడం వల్ల అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతాన భాగ్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారని శాస్త్రవచనం. ముఖ్యంగా పెళ్లి ఆలస్యమవుతున్న వారు, సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
ఓం శ్రీ మాత్రే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

