భక్తుడి పేరుతో వెలసిన నారాపుర వెంకన్న- రథోత్సవం మతసామరస్యానికి ప్రతీక!
కడప జిల్లా నారాపురలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయం- భక్తుని పేరుతో ప్రసిద్ధి- బ్రహ్మోత్సవాల్లో విశేషాలివే

Published : May 7, 2026 at 3:52 AM IST
Narapur Venkateswara Swamy Temple : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా పేరొందింది. ఒక్క తిరుమలలోనే కాకుండా వేంకటేశ్వర స్వామికి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆలయాలున్నాయి. ఈ ఆలయాలు ఎక్కువ భాగం టీటీడీ ఆధ్వర్యంలోనే నడుస్తుండడం విశేషం. సాధారణంగా ప్రతి ఆలయానికి ఒక స్థల పురాణం ఉంటుంది. భక్తుని పేరుతోనే వెలసిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఒక మహిమాన్వితమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నారాపుర వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడుంది?
కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర వేంకటేశ్వర స్వామి దేవాలయం వెలసి ఉంది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున, జమ్మలమడుగు పట్టణం నదికి అవతలి వైపున ఉంది.
ఆలయ స్థల పురాణం
విజయనగర రాజు విజయ దేవరాజు జమ్మలమడుగులో విష్ణు దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించి తన భార్య నారాయణమ్మతో కలిసి ఆ ప్రదేశాన్ని సందర్శించాడు. కోవెల నిర్మించాలని సంకల్పించిన ప్రదేశం రాణి నారాయణమ్మ పేరు కలిసి వచ్చేలా ఆ అగ్రహారానికి నారాయణపురమని పేరు పెట్టాడు. అదే కాలక్రమేణా నారాపురంగా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
భక్తుని పేరుతో వెలసిన వెంకన్న
ఒకసారి వేంకటేశ్వర స్వామి తన భక్తుడైన నారాపురయ్యకు కలలో కనిపించి తన విగ్రహాన్ని ప్రతిష్టించమని ఆదేశించాడంట! తన విగ్రహం ఎక్కడ దొరుకుతుందో కూడా స్వామినే సూచించాడంట! శ్రీనివాసుని ఆదేశం మేరకు నారాపురయ్య ఒక మడుగులో వెతకగా అక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహం లభించింది. అనంతరం ఆ విగ్రహాన్ని అక్కడికి ఉత్తరదిశలో ఇసుక తిన్నెల్లో ప్రతిష్టించారు. నారాపురయ్య ప్రతిష్ఠించిన స్వామి కాబట్టి ఆనాటి నుంచి అక్కడ వెలసిన స్వామి నారాపుర వేంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
బ్రహ్మోత్సవ శోభ
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి వైశాఖ బహుళ అష్టమి వరకు నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30 అంకురార్పణ, మే 1, ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 9 వ తేదీ జరిగే చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. మే 10 స్వామివారికి పుష్పయాగం జరుగనుంది. ఈ బ్రహ్మోత్సవాలలో ఒక్కోరోజు ఒక్కో వాహన సేవ జరుగుతుంది. అన్నింటికంటే విశేషమైనది స్వామివారి రథోత్సవం. మే 7, గురువారం రోజు జరగునన్న ఈ రథోత్సవం విశిష్టత తెలుసుకుందాం.
రథోత్సవం మొదలైంది ఇలా
దాదాపు 70 ఏళ్లకు పైగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని 2008లో టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండను తానీషా ప్రభువు పరిపాలిస్తున్న సమయంలో జమ్మలమడుగు పరగణాను పాలిస్తున్న కంచనపల్లె రఘునాథ పంతులు అనే భక్తుడు స్వామి ఆలయాన్ని పునరుద్ధరించి, రథం నిర్మించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.
కులమతాలకు అతీతంగా సామాజిక ఐక్యత చాటుతూ
శ్రీ నారాపురం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు జరిగే రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు స్వామి వారి రథాన్ని లాగడం మతసామరస్యానికి, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. వేలాదిమంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారిపై తమకున్న భక్తిప్రపత్తులు చాటుతారు.
ఈ రథోత్సవంలో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. భక్తుని పేరుతోనే వెలసిన నారాపురం వేంకటేశ్వరస్వామిని బ్రహ్మోత్సవాలలో దర్శిస్తే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. మనం కూడా నారాపురం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్దాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

