ETV Bharat / spiritual

విశిష్టం జ్యేష్ఠం- బ్రహ్మదేవునికి ప్రీతికరమైన జ్యేష్ఠ మాసం ఎందుకు అంత పవిత్రం?

తెలుగు మాసాల్లో మూడోదైన జ్యేష్ఠ మాసం దైవారాధన, దానధర్మాలు, పుణ్య కార్యాలకు అత్యంత శ్రేష్ఠమైనది- నిర్జల ఏకాదశి, దశపాపహర దశమి, ఏరువాక పౌర్ణమి వంటి విశిష్ట పర్వ దినాలతో కూడిన మాసం

Jyeshta Masam Importance
Jyeshta Masam Importance (GETTY IMAGES)
author img

By ETV Bharat Telugu Team

Published : June 16, 2026 at 5:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

Jyeshta Masam Significance : తెలుగు మాసాల్లో మూడవ మాసమైన జ్యేష్ఠ మాసం అత్యంత శక్తివంతమైన మాసం. గ్రీష్మ తాపం అధికంగా ఉండే ఈ మాసంలో దైవారాధనతో తరించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. జ్యేష్ఠ మాసం దైవారాధనకు, దానధర్మాలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో దాహార్తిని తీర్చే జలదానానికి శాస్త్రాలలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో లక్ష్మీనారాయణుల పూజ, విష్ణు సహస్రనామ పఠనం ఎంతో శ్రేయస్కరం. జ్యేష్ఠ మాసం విశిష్టతకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రహ్మదేవునికి ప్రీతికరం
బ్రహ్మదేవుని ఆరాధనకు, విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాదశి పూజలకు అనుకూలమైన మాసం జ్యేష్ఠ మాసం. పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ఎంతో ప్రీతికరమని తెలుస్తోంది. జ్యేష్ఠ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని, ఐశ్వర్యంతో పాటు ఆనందాన్ని ప్రసాదిస్తాడని అంటారు. ఈ మాసంలో పౌర్ణమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి జ్యేష్ఠ మాసమని పేరు వచ్చింది.

ఎన్నో విశేషాలు
జ్యేష్ఠ మాసం ఎన్నో విశేషాల సమాహారం. అందుకే ఈ మాసానికి అంతటి ప్రత్యేకత. రామాయణం ప్రకారం ఈ మాసంలోనే శ్రీరాముడు హనుమంతుని తొలిసారిగా కలిసాడంట!
రంభా తృతీయ వ్రతం
జ్యేష్ఠ శుద్ధ తదియ రోజు మహిళలు సౌందర్యం, సౌభాగ్యాల కోసం రంభ తృతీయ వ్రతాన్ని ఆచరిస్తారు.

శ్రుత పంచమి
జ్యేష్ఠ శుద్ధ పంచమిని శ్రుత పంచమి అంటారు. జైన మతస్థులు ఈ పంచమిని జ్ఞాన సముపార్జనకు ముఖ్యమైన రోజుగా భావిస్తారు.
దశపాపహర దశమి
జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. ఈ పవిత్రమైన రోజునే భగీరథుని ప్రయత్నంతో గంగానది భూమిపైకి అవతరించిందని అంటారు. అందుకే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఉన్న పది రోజుల కాలంలో గంగా స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. దశపాపహర దశమి రోజు ఉత్తరాదిన 'దశహర గంగోత్సవం' పేరిట గంగమ్మను ఆరాధిస్తారు. దశపాపహర దశమి రోజు గంగా స్నానం చేయడం వలన పది రకాల పాపాలు తొలగుతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే ఈ రోజు నల్ల నువ్వులు, బెల్లం గంగమ్మకు సమర్పించడం మంచిదని శాస్త్రం చెబుతోంది.

నిర్జల ఏకాదశి
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పుత్ర ఏకాదశి అని అంటారు. ఈ రోజు జలం కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. ఈ ఒక్క ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువును పూజించి నీరు, అన్నం, పండ్లు వంటివి దానం చేస్తే 12 ఏకాదశులు నారాయణుని పూజించిన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. నిర్జల ఏకాదశి రోజు పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

ఏరువాక పౌర్ణమి
జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని మహా జ్యేష్ఠ అని, ఏరువాక పౌర్ణమి అని అంటారు. ఇది ప్రధానంగా రైతుల పండుగ. తొలకరి పులకరింతలను మోసుకొచ్చే జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి రైతులు ఎద్దులను శుభ్రం చేసి, అలంకరించి, నైవేద్యం నివేదించి పొలాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి దుక్కి దున్నడం మొదలు పెడతారు. ఈ రోజు నుంచి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఇదే రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం ఘనంగా జరుగుతుంది.

వట సావిత్రి వ్రతం:
జ్యేష్ఠ పౌర్ణమి రోజు సుమంగళి స్త్రీలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి రావి చెట్టుకు పూజలు చేసి, ప్రదక్షిణలు చేస్తారు.
రామలక్ష్మణ ద్వాదశి
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశిగా జరుపుకుంటాం.
యోగినీ ఏకాదశి
జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ ఏకాదశి అని, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యు హరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. ఇదే మాసంలో సూర్యుని ఆరాధించే 'మిథున సంక్రమణం' కూడా వస్తుంది.

జ్యేష్టమాసం ఫలములు
పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహరించుకోవడానికి దైవసేవలో తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు కలిగిన జ్యేష్ఠ మాసం ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలను సంతరించుకుని ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాల సమాహారంగా రాబోతున్న జ్యేష్ఠ మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పండుగలు జరుపుకుందాం. బ్రహ్మ దేవుని పూజించి సుఖభోగాలు పొందుదాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

జ్వరం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే 'జ్వరహరేశ్వరుడు'- విచిత్ర శివ స్వరూపం గురించి తెలుసా?

సోమవతి అమావాస్య రోజు శివారాధన చేస్తే చాలు- ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ సొంతం!