మొండి రోగాలు నయం చేసే వేంకటేశ్వర స్వామి ఆలయం- తెలంగాణలో ఎక్కడ ఉందో తెలుసా?
తెలంగాణ తిరుపతి 'జమలాపురం'- మొండి రోగాలను నయం చేసే వేంకటేశ్వరుడు- సాధువుకు కుష్టు వ్యాధిని పోగొట్టిన స్వామివారి అద్భుత లీల

Published : January 10, 2026 at 4:01 AM IST
Jamalapuram Venkateswara Temple history : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందింది. శ్రీనివాసుడు తిరుమల గిరుల్లో అర్చావతార మూర్తిగా స్వయంభువుగా వెలిశాడు. అయితే వేంకటేశ్వరస్వామి కలియుగంలో తన భక్తుల కోరిక మేరకు అనేక ఇతర ప్రాంతాల్లో కూడా వెలిసాడు. అలాంటి పుణ్య క్షేత్రాలలో ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మొండి రోగాలు కూడా నయమవుతాయని విశ్వాసం. ఇంతకూ ఆ పుణ్య క్షేత్రం ఎక్కడుంది? క్షేత్ర విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
యుగధర్మం
కృతయుగే నారసింహాయ, త్రేతా యుగే రామచంద్రాయ, ద్వాపరే శ్రీకృష్ణాయ, కలియుగే వెంకటనాథాయ! అని పురాణాలు వివరిస్తున్నాయి. కలియుగంలో శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వర స్వామిగా అవతరించాడని పురాణం వచనం. ఒక్క తిరుమలలోనే కాదు వేంకటేశ్వర స్వామి ఎన్నో ప్రాంతాలలో తన భక్తుల కోరిక మేరకు అవతరించి వారి అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. అలాంటి ప్రసిద్ధి చెందిన క్షేత్రమే నేలకొండపల్లి. ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
నేలకొండపల్లి ఎక్కడ ఉంది?
ఖమ్మం జిల్లాలో వెలసిన అతి ప్రాచీన వేంకటేశ్వర స్వామి క్షేత్రం నేలకొండపల్లి. నేలకొండపల్లి ప్రధాన సెంటర్ నుంచి బౌద్ధ స్థూపానికి వెళ్లే మార్గంలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. స్వామి వారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించడం వెనుక ఒక ఆసక్తికరమైన గాథ వినిపిస్తూ ఉంటుంది. అదేమిటో చూద్దాం.
సాధువుకు కుష్టు వ్యాధి
పూర్వం నేలకొండపల్లి ప్రాంతంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. పూర్వజన్మ కర్మవశాత్తు ఆయనకు కుష్టు వ్యాధి సోకింది. కుష్ఠు వ్యాధితో తాను పడుతున్న బాధల నుంచి విముక్తుడిని చేయమని వేంకటేశ్వరస్వామిని కోరుతూనే ఆయన తన తపస్సు కొనసాగించాడు. ఇలా చాలా కాలం కొనసాగింది.
సాధువుకు వేంకటేశ్వరుడు స్వప్న సాక్షాత్కారం
ఇదిలా ఉండగా ఒకసారి వేంకటేశ్వరుడు సాధువుకు స్వప్నంలో దర్శనమిచ్చి అతనికి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడిని చేస్తున్నట్లుగా చెప్పడమే కాకుండా, సమీపంలో ఉన్న గుహలో 'తిరునామం' రూపంలో తను వెలుస్తున్నట్టుగా సెలవిచ్చాడట.
కుష్టు వ్యాధి నుంచి ఉపశమనం
మరుసటి రోజు ఉదయాన్నే సాధువు నిద్రలేచి తనను పరిశీలించి చూసుకోగానే తన శరీరం మీద కుష్టు వ్యాధి ఆనవాళ్లు లేకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. ఇదంతా వేంకటేశ్వర స్వామి మహత్యంగా భావించి స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం అన్వేషణ సాగించాడు.
కొండ గుహలో వెలసిన వేంకటనాథుడు
సాధువు అన్వేషణ ఫలించి ఒక కొండ గుహలో స్వామివారు తిరునామం రూపంలో వెలసి ఉండడాన్ని గమనించాడు. వెంటనే సాధువు అక్కడే వెంకటనాథునికి ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు చేయడం ప్రారంభించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రంగా నేలకొండపల్లి
సాధువు కుష్టు వ్యాధి పోయిన సంగతి తెలుసుకున్న స్థానికులు ఆనాటి నుంచి ఇక్కడ కొండ గుహలో వెలసిన వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి తరలి రావడం మొదలు పెట్టారు. అంతేకాదు ఈ వేంకటనాథుని దర్శిస్తే ఎంతటి మొండి రోగాలైనా తొలగిపోతాయని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇలా వేంకటనాథుని మహత్యం గురించి తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు విశేషంగా తరలి రావడంతో నేలకొండపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
తెలంగాణ తిరుపతి
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఖమ్మం నుంచి దాదాపు 79 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమలాపురంలో ఉంది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ చారిత్రాత్మక ఆలయాన్ని విజయనగర పాలకులు కృష్ణ దేవరాయలు పునర్నిర్మించారని ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని కొండల మధ్య వెలసి ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
మహాభారతం ఆనవాళ్లు
పురావస్తు శాఖ వారు నేలకొండపల్లిలో జరిపిన తవ్వకాల్లో మహాభారతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పరిశోధనలో నాలుగో శతాబ్దానికి చెందిన అనేక బౌద్ధ స్థూపాలు కూడా లభ్యం కావడం ఈ ప్రాంతం విశిష్టతను చాటుతోంది. తెలంగాణ తిరుపతి ప్రసిద్ధి చెందిన నేలకొండపల్లి వేంకటేశ్వర స్వామిని మనం కూడా దర్శిద్దాం. ఆయురారోగ్యాలను పొందుదాం. ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

