పూజ గదిలో "ఈ వస్తువులు" ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట!
- పూజ గదిలో దేవుడి విగ్రహాలతోపాటు ఈ వస్తువులు కూడా ఉండాలట!

Published : May 28, 2026 at 10:20 AM IST
Items to Keep in Pooja Room: భగవంతుడిని ఆరాధించడానికి ప్రతీ ఒక్కరి ఇంట్లో చిన్నదో పెద్దదో ఒక పూజగది ఉంటుంది. ఇక ఆ గదిలో దేవుడి పటాలతోపాటు పూజించడానికి అవసరమైన నూనె, ప్రమిదలు, వత్తులు, కర్పూరం వంటి వస్తువులు తప్పనిసరిగా ఉంటాయి. అయితే, ఇవి మాత్రమే కాకుండా పూజగదిలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాలని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్కుమార్ వివరిస్తున్నారు. పరిహార శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఉండటం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వివరిస్తున్నారు. మరి, ఆ మేరకు పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నెమలి ఈకలు: ఏ ఇంట్లోని పూజగదిలో నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంటికి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుందని సూచిస్తున్నారు. అదే విధంగా నవగ్రహ దోషాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
ఆవు - దూడ బొమ్మ: చాలా మంది తమ పూజ గదిలో ఆవు బొమ్మ లేదా చిత్రపటం ఉంచుతుంటారు. కేవలం ఆవును మాత్రమే కాకుండా ఆవు దూడ బొమ్మ కలిగిన విగ్రహం లేదా ఫొటో ఉంచితే ఐశ్వర్యం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
చిన్న ఛత్రం: పూజ రూమ్లో చిన్న ఛత్రం ఉంటే మంచిదని మాచిరాజు చెబుతున్నారు. వెండి లేదా రాగి లేదా పంచ లోహాలతో తయారు చేసిన చిన్న గొడుగును పూజ గదిలో ఓ మూలన ఉంచితే మంచిదంటున్నారు. అలాగే గొడుగుతో పాటు చామరం లేదా వింజామ ఉంచినా మంచి ఫలితం లభిస్తుందని వివరిస్తున్నారు. వింజామర అంటే పూజా సమయాలలో ఉపయోగించే ఒక ప్రత్యేకమైన విసనకర్ర.

పసుపు గవ్వలు: చాలా మంది పూజ గదిలో తెల్లటి గవ్వలు ఉంచుతుంటారు. అయితే తెలుపు వాటి బదులు పసుపు గవ్వలు ఉంచితే అద్భుత ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. పసుపు గవ్వలు అంటే గవ్వలను వెనక్కి తిప్పినప్పుడు అవి కాస్త పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ గవ్వలు లక్ష్మీ దేవికి చాలా ఇష్టమని.. పూజగదిలో ఆరు లేదా తొమ్మిది గవ్వలు ఉంచితే ధనలాభం కలుగుతుందంటున్నారు.
పాదరసం, గంధపు చెక్క: తప్పనిసరిగా పూజ గదిలో ఉండాల్సిన వస్తువుల్లో ఇవి ముఖ్యమంటున్నారు మాచిరాజు. పాదరసం సాక్షాత్తూ పరమేశ్వరుడి తేజస్సుకు సంకేతమని అంటున్నారు. అయితే పాదరసాన్ని ఎప్పుడూ విడిగా ఉంచకూడదని, గంధపు చెక్కతో కలిపి ఉంచాలని సూచిస్తున్నారు. ఈ రెండూ కలిపి ఉండటం వల్ల పరమేశ్వరుడు, లక్ష్మీ దేవి అనుగ్రహంతో మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.
అక్షింతలు: పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు. ఇవి లక్ష్మీ దేవికి చాలా ఇష్టమని.. ఇవి ఉన్న ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉంటుందని సూచిస్తున్నారు.
పచ్చకర్పూరం: పూజ అనంతరం హారతి ఇవ్వడానికి కర్పూరం ఉపయోగిస్తాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి మందిరంలో ఉంటుంది. మామూలు కర్పూరంతో పాటు పూజ గదిలో పచ్చ కర్పూరం కూడా ఉండాలని చెబుతున్నారు. పచ్చ కర్పూరంతో విష్ణువుకు హారతి ఇచ్చినా, పచ్చ కర్పూరం వేసి చేసిన నైవేద్యాలు పెట్టినా విశేషమైన ఫలితాలు లభిస్తాయంటున్నారు. ఈ క్రమంలోనే ఓ డబ్బాలో పచ్చ కర్పూరంతో పాటు తొమ్మిది యాలకులు, 9 లవంగాలు ఉంచాలని చెబుతున్నారు.
తామర గింజలు, ముత్యాల మాల: పూజగదిలో తామర గింజలు, ముత్యాల మాల ఉండటం మంచిదని మాచిరాజు చెబుతున్నారు. అదే విధంగా వెండి పూలు కూడా దేవుడి మందిరంలో ఉంటే ఐశ్వర్యానికి లోటు ఉండదంటున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మంగళవారం నాడు హనుమాన్ చాలీసా 7 సార్లు పఠిస్తే జరిగే అద్భుతం ఇదే!

