తిరుమల శ్రీవారి కొప్పెర అంటే ఏంటి? తిరుమల హుండీగా ఉపయోగించే కొప్పెర చరిత్ర విశిష్టత
తిరుమల తిరుపరి దేవస్థానం- స్వామివారి హుండీ చరిత్ర- ఖజానాను లెక్కించే ఉద్యోగుల గురించి తెలుసా?

Published : February 28, 2026 at 4:32 AM IST
Tirumala Hundi Koppera History : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందింది. నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల ఆనంద నిలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. ప్రతిరోజు స్వామి వారిని వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు హుండీలో సమకూరుతాయి. ఆనందనిలయంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు గర్భాలయం నుంచి వెలుపలకు వచ్చి ప్రదక్షిణ వలయంలో వచ్చే మార్గంలో శ్రీవారి హుండీ ఉంటుంది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు వేసే హుండీ పాత్రను కొప్పెర అంటారు. ఈ కథనంలో కొప్పెర అంటే ఏమిటి? కొప్పెర విశిష్టత ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
కొప్పెర అంటే?
కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే ఒక లోహపు పాత్ర అని అర్థం. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ అసంఖ్యాక భక్తులు సమర్పించే కానుకలతో గబగబా నిండి పోతూ ఉంటుంది. కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లని వస్త్రం అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలనే హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు.
వంశపారంపర్యంగా సేవలు
ఈ కొప్పెర దగ్గర ఉండే ఉద్యోగుల్లో కొంతమంది వంశపారంపర్యంగా హుండీల దగ్గరే పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది.
కొప్పెర వాండ్ల పల్లి
పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలో డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెర వాళ్లని, వాళ్లు నివశించే పల్లెకు "కొప్పెర వాండ్ల పల్లి'' అనే పేరు వచ్చిందంటారు. శ్రీనివాసా మంగాపురం వెళ్లే దారిలో కొప్పెర వాండ్ల పల్లి ఉంది. అయితే ఇదంతా గతం. ప్రసుతం శ్రీవారి కానుకలన్నీ పరకామణిలో లెక్కిస్తున్నారు.
పరకామణి అంటే?
హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును "పరకామణి'' అంటారు. ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని "తోకముల్లె'' అని అంటారు.
దేవదేవునికి విలువైన కానుకలు
కొప్పెరలో మన రూపాయలు కాకుండా విదేశీ కరెన్సీ, నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరిధిలోని ఆలయాలలో కావాల్సిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. వీటిలో విలువైన, నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు.
అత్యంత పవిత్రం
తిరుమల శ్రీవారి కొప్పెర అత్యంత పవిత్రమైనది. ఇందులో కోటీశ్వరులు వేసే కోట్ల రూపాయల కన్నా పేదవాడు వేసే రూపాయంటే శ్రీవారికి ప్రీతికరమని అంటారు. రోజూ శ్రీవారికి కొత్త కొప్పెర అమర్చడం దగ్గర నుంచి తిరిగి ఆ కొప్పెరను దేవస్థానం ఖజానాకు తరలించే వరకు ప్రతి క్షణం దేవస్థానం ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటారు. భక్తులు శ్రీవారికి సమర్పించే ప్రతి రూపాయికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు జవాబుదారిగా ఉంటారు. ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఒక్క తిరుమలలోనే జరుగుతుంది అంటే అది అతిశయోక్తి కాదు.
పరకామణి సేవలు
శ్రీవారి కానుకలు లెక్కించు అధికారం దేవస్థానం ఉద్యోగులతో పాటు మరికొంతమంది స్వచ్ఛంద సేవకులకు కూడా ఉంటుంది. పదవీ విరమణ పొందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బ్యాంకు ఉద్యోగులు కూడా శ్రీవారి పరకామణి సేవలో పాల్గొనడానికి అర్హులు. అయితే ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. శ్రీవారి కానుకలు లెక్కించు భాగ్యం దొరకడం పూర్వజన్మ సుకృతం. ఆ భాగ్యం అందిన వారి జన్మ ధన్యం.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

