ETV Bharat / spiritual

ఎలాంటి మంచు లేదు- తుపాన్లు లేవు- అయినా ఈ అమ్మవారి దర్శనం ఏడాదికి 15 రోజులు మాత్రమే ఎందుకు?

చల్లని తల్లి హాసనాంబ- ఈ ఆలయాన్ని దర్శిస్తే సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం!

Hasanamba Temple
Hasanamba Temple (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 5:01 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hasanamba Temple Significance : భారతదేశంలో ఉత్తరాదిన హిమాలయాల్లో ఉన్న కొన్ని ఆలయాలు భారీ హిమపాతం కారణంగా ఆరు నెలలపాటు మూసివేస్తారు. వాటిల్లో గంగోత్రి, యమునోత్రి, కేదార్​నాథ్, బద్రీనాథ్ ముఖ్యమైనవి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ క్షేత్రాల్లో ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేకపోయినా, ఉష్ణ ప్రాంతాలైన దక్షిణాదిలోని కర్ణాటకలో ఓ అమ్మవారి ఆలయంలో ఏడాదికి 15 రోజులు మాత్రమే దర్శనం ఉంటుంది. ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

హాసనాంబ దేవాలయం- కర్ణాటక
సాధారణంగా దక్షిణ భారతంలో దేవాలయాలన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచే ఉంటాయి. కొన్ని ఆలయాలు మధ్యాహ్నం సమయంలో మూసినప్పటికీ తిరిగి సాయంత్రం తెరుస్తారు. కానీ విచిత్రంగా కర్ణాటకలోని హాసనాంబ ఆలయం మాత్రం అలా కాదు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో 15 రోజులు మాత్రమే అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఈ ఆలయ విశేషాలు చూద్దాం.

హాసనాంబ ఆలయం ఎక్కడుంది?
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి సుమారు 172 కి.మీల దూరంలో ఉన్న హాసన్ అనే పట్టణంలో హాసనాంబ ఆలయం వెలసి ఉంది. ప్రతి ఆశ్వయుజ మాసంలో 15 రోజుల పాటు ఆలయాన్ని తెరుస్తారు. ఆ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు.

ఇదే మహత్యం
12 వ శతాబ్దంలో నిర్మించిన హాసనాంబ ఆలయంలో వెలసిన హాసనాంబ భక్తులను ఆపదల నుంచి గట్టెక్కిస్తుందని విశ్వాసం. ప్రతి ఏడాది 15 రోజుల దర్శనం తర్వాత ఆలయాన్ని మూసేటప్పుడు గర్భాలయంలో అమ్మవారి సమక్షంలో దీపాన్ని వెలిగించి ద్వారాలు మూసేస్తారు. తిరిగి ఏడాది తర్వాత ఆలయం తెరిచినప్పుడు అమ్మవారి సమక్షంలో వెలిగించిన దీపం అలాగే వెలుగుతూ ఉండటం విశేషం. అలాగే అమ్మవారి పాదాల వద్ద ఉన్న పువ్వులు కూడా వాడిపోకుండా తాజాగా ఉండడం అమ్మవారి మహిమకు తార్కాణమని భక్తులు విశ్వసిస్తారు. ఇంతటి మహిమాన్వితమైన ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

స్థల పురాణం
పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలుపెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. ఆ శక్తి బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని నాశనం చేస్తుంది. సప్తమాతృకలుగా పేరొందిన బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలు వనవిహారానికి బయల్దేరారు. అలా భూలోకంలో విహరిస్తున్న సప్తమాతృకలకు హాసన్ ప్రాంతంలోని సౌందర్యానికి ముగ్ధులై అక్కడే ఉండిపోవాలని అనుకున్నారు.

ఇలా ఆశ్రయం పొందారు!
మహేశ్వరీ, కౌమారి, వైష్ణవిలు హాసనాంబ ఆలయంలోని చీమల పుట్టలను ఆశ్రయించగా, బ్రాహ్మీ హొస్కెట్​ను, ఇంద్రాణి, వారాహి, చాముండి దేవతలు దేవిగేరే హొండాలోని మూడు బావుల్లో నివాసం ఏర్పరచుకున్నారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అలా అప్పటి నుంచీ ఈ గుడిలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోందని చెబుతుంటారు.

చిరునవ్వుతో
గర్భాలయంలో అమ్మవారు చిరునవ్వుతో భక్తులకు దర్శనమిస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని హాసనాంబ అని పిలుస్తారు.

ఏడాదిలో 15 రోజులే దర్శనం ఎందుకు?
హాసనాంబ అమ్మవారు ఇక్కడ వెలసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పిందట. అందుకే అప్పటి నుంచి అదే ఓ ఆచారంలా కొనసాగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

ఎప్పుడు తెరుస్తారు?
ఈ ఆలయాన్ని ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు తెరచి, బలిపాడ్యమి మర్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించి మూసేస్తారు. ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్యపూజల్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవంటారు భక్తులు. ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ 101 శివలింగాలను కూడా దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి?
కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కర్ణాటకలోని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సదుపాయాలున్నాయి. చల్లని తల్లి హాసనాంబ ఆలయాన్ని దర్శిస్తే సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం. మనం కూడా హాసనంబ ఆలయాన్ని దర్శిద్దాం. తరిద్దాం.
ఓం శ్రీ మాత్రే నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.