కృష్ణాష్టమి స్పెషల్ - ఈ పూలతో కన్నయ్యను పూజిస్తే శుభఫలితాలు! - అవేంటో తెలుసా?
- కృష్ణుడిని ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సొంతం చేసుకోవచ్చంటున్న జ్యోతిష్యులు!

Published : September 3, 2026 at 1:50 PM IST
Flowers for Krishna Janmashtami 2026: "అచ్యుతం.. కేశవం.. కృష్ణ దామోదరం" అంటూ చిన్ని కన్నయ్యను పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. మరికొన్ని గంటల్లో కృష్ణాష్టమి గడియలు సమీపిస్తుండటంతో వెన్నదొంగను మనసారా కొలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక జన్మాష్టమి అనగానే ఇంటిని అందంగా అలకరించి కృష్ణుడి పాదాలను వేసి దేవకీసుతుడిని పూజిస్తారు. అలాగే నల్లనయ్యకు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక కృష్ణాష్టమి సాయంత్రం ఉట్టి కొట్టే ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. అయితే, కృష్ణ జన్మాష్టమి రోజు ఆ మాధువుడిని పలు రకాల పూలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేంటి? వాటితో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
కృష్ణాష్టమి ఎప్పుడు?: శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి కృష్ణుడు దేవకీగర్భాన చెరసాలలో జన్మించాడు. ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో శ్రావణ బహుళ అష్టమి తిథి ఉంటుందో ఆ మరుసటి రోజు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవడం ఆనవాయితీ. ఆ ప్రకారంగా చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 4 శుక్రవారం కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవాలని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. ఇక కృష్ణాష్టమినే "జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి" అని రకరకాలుగా పిలుస్తుంటారు.
ఏ పూలతో పూజిస్తే ఎలాంటి లాభాలు: కృష్ణ జన్మాష్టమి రోజు చేసే పూజలో గోపాలుడిని ప్రత్యేక పూలతో పూజిస్తే పలు ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు మాచిరాజు కిరణ్కుమార్. అవేంటంటే..
- జన్మాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని నీలం రంగు పువ్వులతో పూజిస్తే కృష్ణ భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.
- తులసి ఆకులు అంటే కన్నయ్యకు ప్రీతికరం కాబట్టి గోకులాష్టమి రోజు స్వామి వారిని తులసి దళాలతో ఆరాధిస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు.
- గోకులాష్టమి రోజు చిన్ని కృష్ణుడిని సంపంగి పూలతో పూజిస్తే శత్రు సమస్యలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
- జాజిపూలతో కన్నయ్యను పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, మంచి పురోగతి లభిస్తుందని చెబుతున్నారు.
- కాలసర్ప దోషాలతో బాధపడేవారు అష్టమి రోజు కిట్టయ్యను పారిజాత పూలతో ఆరాధించాలని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న 12 రకాల కాల సర్ప దోషాలను తొలగించుకోవచ్చని వివరిస్తున్నారు.
- సువాసన భరితమైన మల్లెపూలు లేదా తెల్ల జిల్లేడుతో చిన్ని కన్నయ్యను పూజిస్తే శారీరక, మానసిక సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు.
- పద్మ పుష్పాలు లేదా పొద్దు తిరుగుడు పువ్వులతో కన్నయ్యను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి ధనవంతులవుతారని వివరిస్తున్నారు.
- నందివర్ధనం పుష్పాలతో పూజ చేస్తే జీవితంలో శాంతి, ప్రశాంతత లభిస్తాయని పేర్కొంటున్నారు.
- ఇలా గోకులాష్టమి రోజు శ్రీ కృష్ణుడిని ఒక్కొక్క పూలతో పూజిస్తే ఒక్కొక రకమైన విశేషమైన ప్రయోజనం లభిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
ఈ నైవేద్యాలు: కృష్ణాష్టమి రోజు కన్నయ్యను మనసారా పూజించడంతో పాటు పలు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఎక్కువ మొత్తంలో ప్రసాదాలు చేయలేని వారు కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, వెన్న, మినప సున్నుండలు, బెల్లం కలిపిన పెరుగు, జున్ను, మీగడ వంటివి సమర్పిస్తే ఆయన అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయంటున్నారు. అయితే ఏ నైవేద్యం సమర్పించినా దానిమీద తులసి దళాలు వేయడం మాత్రం మరిచిపోవద్దని చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శ్రీకృష్ణుడిని 'జగద్గురువు' అని ఎందుకు అంటారు? గీతాబోధలో దాగిన జీవన సత్యాలివే
కృష్ణాష్టమి స్పెషల్ "ఛప్పన్ భోగ్ మహా నైవేద్యం" - ఈ ప్రసాదం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ!

