ఏరువాక పున్నమి: ఈ రోజు రైతులు నాగలికి ఎందుకు పూజ చేస్తారో తెలుసా?
రైతులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ- ఏరువాక పున్నమి విశిష్టత, వేద- పురాణ ప్రస్తావనలు, రైతులు ఆచరించే సంప్రదాయాలు- ఏమిటో మీకు తెలుసా?

Published : June 28, 2026 at 3:30 AM IST
Eruvaka Pournami 2026 Significance : హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ ప్రకృతి ఆధారంగానే ఏర్పడుతాయి. ప్రకృతిని పూజించమని సందేశాన్ని అందిస్తాయి. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అందుకే మన సనాతన ధర్మం ప్రకృతిని పూజించమని, ప్రకృతిని రక్షించమని బోధిస్తుంది. మండే ఎండల వేసవితో గ్రీష్మతాపం పెంచే రోహిణి కార్తె పూర్తికాగానే వచ్చే మృగశిర కార్తెలో కురిసే వర్షాలపైనే రైతులు ఆధారపడతారు. ఈ క్రమంలో మృగశిర కార్తెలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా రైతులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏరువాక పున్నమి అంటే ఏంటి, ఈ రోజు రైతులు ఎలా జరుపుకుంటారు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏరువాక పున్నమి అంటే?
ఏరువాక పౌర్ణమి అనేది తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వైభవంగా జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ. వర్ష రుతువు ప్రారంభాన్ని, తొలకరి జల్లులను ఆహ్వానిస్తూ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు దీన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 29, సోమవారం జ్యేష్ట శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 'ఏరు' అంటే నాగలి, 'ఏరువాక' అంటే దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఏరువాక పున్నమి రోజున రైతులు తొలకరి జల్లులు పడగానే భూమిని పూజించి, ఆ సంవత్సరం వ్యవసాయ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఓషధి తత్వం
ఓషధులకు, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమతో శుభ ఫలితాలను అందిస్తాడని విశ్వాసం. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు.
వేదం వర్ణించిన ఏరువాక
వేద కాలంలో అందరూ ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు.
పురాణాలలో ఏరువాక ప్రస్తావన
విష్ణు పురాణంలో ఏరువాకను సీతా యజ్ఞంగా ప్రస్తావించడం జరిగింది. ఇందులో సీత అంటే నాగలి అని అర్థం. 'వప్ప మంగళ దివసం', 'బీజవాపన మంగళ దివసం', 'వాహణ పుణ్ణాహ మంగళమ్', 'కర్షణ పుణ్యాహ మంగళమ్,' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారని విష్ణు పురాణం వివరిస్తోంది. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాలలో వివరించబడింది. హాలుడు రాసిన గాథాసప్తశతిలో కూడా ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏరువాక పండుగ తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ.
ఏరువాక సాగారో
'ఏరువాక సాగారో!' అంటూ మన తెలుగు కవులు కూడా ఏరువాక గొప్పతనం గురించి తమ పాటలలో వర్ణించారు. ఏరువాక అంటే వ్యవసాయం మొదలు పెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి హారతులు ఇచ్చి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు.
పుట్టిల్లు చేరే ఆడపడుచులు
ఏరువాక పున్నమి రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బరువైన బండ రాళ్లు కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు.
పాలెగాళ్లకు కొత్త సంవత్సరం
ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్లలో పనిచేసే జీతగాళ్లకు పాత సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది.
ఏరువాక పండుగ ఎందుకు చేస్తారు?
కొత్త వ్యవసాయ సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, భూమి సస్యశ్యామలంగా ఉండాలని రైతులు వర్షాధిపతి అయిన ఇంద్రుని, భూమాతను ప్రార్ధిస్తూ జరుపుకునే పండుగే ఏరువాక పున్నమి. ఈ ఏరువాక పున్నమి రోజు రైతుల తరఫున మనం కూడా వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం. మన రైతుల భక్తిబలంతో, ఆత్మవిశ్వాసంతో, శ్రమశక్తితో దేశంలో ఎల్ నినో ప్రభావం తొలగి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్ధిద్దాం.
శుభం భూయాత్! జై కిసాన్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
తిరుమలలో ఏడాదికి ఒక్కసారే జరిగే అరుదైన జ్యేష్ఠాభిషేకం- మూడు కవచాల్లో శ్రీవారి దివ్య దర్శనం!
ఈ ఒక్కరోజు ఉపవాసంతో 24 ఏకాదశుల పుణ్యం!- భీముడు ఆచరించిన మహా వ్రత విశిష్టత ఇదే!

