కోదండరామస్వామి ఆలయం- ఏడు పడగల ఆదిశేషుని నీడలో 108 అడుగుల శ్రీమన్నారాయణుని విశ్వరూపం!
బెంగళూరు నడిబొడ్డున ఆకాశాన్ని తాకుతున్న 108 అడుగుల నారాయణుడి విశ్వరూపం- కోదండరామస్వామి ఆలయ విశేషాలివే!

Published : January 7, 2026 at 4:01 AM IST
Ejipura Kodanda Ramaswamy Temple : శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవ అవతారంగా భూమిపై వెలసి రాక్షస సంహారం గావించిన అవతారం శ్రీరామావతారం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మసంస్థాపన గావించిన తర్వాత సరయు నదిలో అవతార పరిసమాప్తి గావించాడు. ఆనాటి నుంచి రామభక్తులు ఎన్నో రామాలయాలు నిర్మించారు. నిజానికి రామాలయం లేని ఉరంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఈ కోవలోకి చెందిన ఓ అద్భుతమైన రామాలయం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కోదండరామస్వామి ఆలయం
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం ఈజీపురలో వెలసి ఉన్న కోదండరామస్వామి ఆలయం అనేక విశేషాలకు నెలవైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీరాముడు ఇక్కడ శ్రీసీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
ఆలయ నిర్మాణానికి శ్రీకారం ఇలా
బెంగుళూరుకు 10 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. దాదాపు 7 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బుచ్చప్ప అనే రామ భక్తునికి శ్రీరామునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాలన్న తలంపు కలిగింది. అనుకున్నదే తడవుగా కొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి బుచ్చప్ప కుమారుడు సదానంద ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయదలచాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇతర ఆలయాలకు భిన్నంగా, వినూత్నంగా ఏదైనా చేయాలని సంకల్పించాడు. అయితే ఏమి చేయాలో పాలుపోలేదు. ఎంతో అంతర్మథనం తర్వాత భారీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి నిశ్చయించుకుని అందుకు ఏర్పాట్లు మొదలు పెట్టాడు.
ఆటంకాలను అధిగమించి
ఆరంభంలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తయారు చేయడానికి అవసరమైన శిల కోసం చాలా అన్వేషణ జరిగింది. ఎన్నో ప్రాంతాలు తిరిగిన తర్వాత చివరకు తిరువణ్ణామలై శివారులో లభ్యమైన కృష్ణశిల శ్రీమహావిష్ణువు విగ్రహానికి సరిగ్గా సరిపోతుందని భావించి దానిని ప్రభుత్వ అనుమతితో గమ్యానికి తరలించారు.
సుదీర్ఘకాలం
విగ్రహం తయారీకి అవసరమైన శిల లభ్యం కావడంతో పని పూర్తి కాలేదు. వేదోక్తంగా విగ్రహ ఆవిష్కరణకు చాలా సమయం పట్టింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దాదాపు ఆరేళ్లపాటు 120 మంది కళాకారుల శ్రమకు ఫలితంగా అద్భుతమైన 108 అడుగుల శ్రీమహావిష్ణువు విగ్రహం దైవకళ ఉట్టిపడేలా రూపుదిద్దుకుంది. వేదఘోషల నడుమ శ్రీమహావిష్ణువు విశ్వరూపాన్ని ఆవిష్కరించే విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది.
ఆకట్టుకునే విగ్రహం
ఈజీపుర కోదండరామ స్వామి ఆలయంపైన ప్రతిష్టించిన శ్రీమన్నారాయణుడి విశ్వరూప విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంబరాన్ని తాకుతున్నట్లుగా అనిపించే ఈ భారీ విగ్రహం దేశంలోనే ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
శివకేశవుల అభేదం
శ్రీమన్నారాయణుడి విశ్వరూప విగ్రహం అనేక విశేషాల సమాహారం. శివకేశవుల అభేదాన్ని చాటే విధంగా దర్శనమిచ్చే ఈ విగ్రహంలో ఏడు పడగల ఆదిశేషుని నీడలో ఉన్న శ్రీమన్నారాయణుని విశ్వరూపం, విగ్రహంలో దర్శనమిచ్చే పసిడి కాంతులు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.
సమస్త గణాల సమేతంగా
శ్రీమన్నారాయణుని విశ్వరూప విగ్రహంలో కూర్మ పీఠంతో పాటు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దశావతారాలు, త్రిమూర్తులు, అమ్మవార్లు, ఆయుధాలు, ఊర్ధ్వలోకాలు, సముద్రాలు, మహావృక్షాలు గోచరిస్తాయి. అంతేకాదు ఇలా అనంత ప్రకృతితో పాటు సమస్త దేవతా గణాలు కూడా ఈ విగ్రహంలోనే దర్శనమిస్తాయి. ఇలా సమస్త గణాలు, ప్రకృతి, అనంత లోకాలతో దర్శనమిచ్చే నారాయణుని విశ్వరూప తేజోమయ విగ్రహం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అందుకే ఈ విగ్రహం దేశంలో ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
ఆలయ విశేషాలు
కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా గర్భాలయంలో కొలువైన సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత కోదండరామస్వామిని ముందుగా దర్శించుకుంటారు. ఆ తరువాత పై అంతస్థులో ఉన్న నారాయణుని విశ్వరూప విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తున్న ఈ ఆలయంలో ఇంకా వినాయకుడు, స్ఫటిక శివలింగం, వరాహస్వామి వంటి ఇతర దేవతల విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు.
పూజోత్సవాలు
కోదండరామస్వామి ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. చైత్ర మాసంలో వచ్చే శ్రీరామనవమికి ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రావణ, ఆశ్వయుజ, కార్తిక ధనుర్మాసాల్లో వచ్చే ప్రత్యేక తిథులు, విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
ఎలా చేరుకోవాలి?
బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 10 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సులు, ఆటోలు, మెట్రో రైలు సౌకర్యాలున్నాయి. మనం కూడా బెంగుళూరుకు వెళ్లినప్పుడు శ్రీమన్నారాయణుని విశ్వరూప విగ్రహాన్ని దర్శిద్దాం. అనంత పుణ్యాన్ని పొందుదాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

