మహాశివరాత్రి రోజు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా?
మహాశివరాత్రి రోజు పూజించాల్సిన వివిధ శివలింగాలు

Published : February 14, 2026 at 2:43 PM IST
Shivling Puja in Telugu : హిందువులకు అతి పెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ రోజు శివాలయాలన్నీ శివ నామంతో మారుమ్రోగుతుంటాయి. ఏడాది మొత్తం ఎలా పూజించినా, మహాశివరాత్రి రోజు మాత్రం మహాదేవుని విశేష అభిషేకాలతో అర్చనలతో భక్తులు ఆరాధిస్తుంటారు. పరమేశ్వరుడు సాధారణంగా లింగరూపంలో పూజలందుకుంటూ ఉంటాడు. అయితే ఈ లింగాలలో అనేక రకాలు ఉంటాయి. ఈ కథనంలో ఏ రకమైన శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.
మోక్షసాధనకు మార్గం మహాశివరాత్రి
పరమేశ్వరుడు తన భక్తులను ముక్తి మార్గంలో నడిపించడానికి, మోక్షాన్ని ప్రసాదించడానికి అనుగ్రహించిన అవకాశమే మహాశివరాత్రి. ఈ రోజు కనీసం ఒక చెంబుడు నీళ్లు శివయ్యపై పోసి ఒక మారేడు దళం పెట్టి చిన్న కలకండ పెట్టినా చాలు శివుడు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. అయితే ఈ రోజున వివిధ రకాల శివలింగాలకు పూజాభిషేకాలు నిర్వహించడం వల్ల, వివిధ రకాల ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అవేమిటో చూద్దాం.
సాధారణంగా శివలింగాన్ని అనేక రకాల లోహాలతో, దారువులతో, విలువైన శిలలతో తయారు చేస్తారు. ఏ లింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.
హిరణ్య లింగం
మహాశివరాత్రి రోజు హిరణ్యం అంటే బంగారంతో తయారు చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల సిరి సంపదలు చేకూరుతాయి.
రజత లింగం
మహాశివరాత్రి రోజు రజతం అంటే వెండితో తయారు చేసిన శివలింగాన్ని పూజించడం వలన ధనధాన్యాలు లభిస్తాయి.
ఇత్తడి లింగం
మహాశివరాత్రి రోజు ఇత్తడితో చేసిన శివలింగాన్ని ఆరాధించడం వలన దారిద్య్ర దుఃఖం దూరమవుతుంది.
సైకత లింగం
శివలింగాలలో ఉత్కృష్టమైనది సైకత లింగం. సాక్షాత్తు పార్వతి దేవి సైకతం అంటే ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించి శివునిలో అర్థభాగాన్ని పొందింది. అదే పృథ్వీ లింగంగా కంచిలో పూజలందుకుంటోంది. మహా శివరాత్రి రోజు సైకత లింగాన్ని పూజిస్తే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి.
పాదరస లింగం
పాదరసం అంటే ద్రవ రూపంలో ఉన్న లోహం. పాదరసంతో తయారు చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల, ముల్లోకాల్లోని శివలింగాలన్నింటికీ పూజాభిషేకాలు చేసిన ఫలితం లభిస్తుందట. అంతేకాదు పాదరస శివలింగ ఆరాధన వలన సమస్త పాపాలు నశించి, సంపూర్ణ సుఖాలు చేకూరుతాయని మహర్షుల వాక్కు.
స్ఫటిక లింగము
శివరాత్రి రోజున స్పటిక శివలింగానికి పూజ చేయడం వల్ల, విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలనుకునేవారు, స్పటిక శివలింగాన్ని పూజించాలి. మహా శివరాత్రి రోజున స్పటిక శివలింగానికి పూజాభిషేకాలు జరపడం వలన, ధన ధాన్య వృద్ధి కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని శివ పురాణంలో వివరించి ఉంది.
నిత్య పూజలో స్పటిక లింగ విశిష్టత
స్పటిక శివలింగం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజించడం వలన, అనారోగ్య బాధలు, ఆర్థిక సమస్యలు ఆ ఇంటి దరిదాపులకు కూడా రావట. స్పటిక శివలింగం ఏ ఇంట్లో ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది. స్పటిక లింగ ఆరాధన జరిగే ఇంట కొన్ని తరాల వరకు దారిద్ర బాధలు ఉండవు. స్పటిక శివ లింగాన్ని అనునిత్యం ఆరాధించడం వల్ల జీవుడు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతారనీ, అంత్యమున శివ సాయుజ్యం పొందుతారని పురాణాలలో వివరించి ఉంది.
ఈ శివరాత్రి రోజు మనం కూడా మన శక్తి కొద్దీ శివలింగాన్ని అభిషేక అర్చనలతో పూజిద్దాం. సకల శుభాలు పొందుదాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

