ETV Bharat / spiritual

పూజలో ఈ ఆసనం వాడితే గ్రహ దోషాలు దూరం! దర్భాసనం మహిమ వెనుక శాస్త్ర రహస్యాలు!!

పూజలు, వ్రతాలు చేసే సమయంలో దర్భాసనం- హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత- దర్భ గడ్డి పవిత్రత, గ్రహదోష నివారణ శక్తి గురించి పురాణాలు చెబుతున్న విశేషాలు మీకోసం

Darbhasana Significance in Puja
Darbhasana Significance in Puja (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2026 at 3:01 AM IST

3 Min Read
Choose ETV Bharat

Darbhasana Significance in Puja : సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు, శుభకార్యాల్లో, ఆలయాల్లో వ్రతాలు, హోమాలు చేసేటప్పుడు కానీ ఆసనం మీద కూర్చోవడం సంప్రదాయం. ఆసనం అంటే కూర్చోడానికి వాడే పీట, చాప లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నేల మీద పరచుకునే వస్త్రాలు వంటివి. హిందూ సంప్రదాయం ప్రకారం దేవుని పూజ కూర్చుని మాత్రమే చేయాలి. నిలుచుని పూజ చేయడం వలన ఆ పూజ ఫలించదు. అందుకే మన సంప్రదాయాల్లో పూజలో ఆసనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పురాణాలలో వివరించిన ప్రకారం పూజలో వాడే ఒక ప్రత్యేకమైన ఆసనం వలన సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయంట! మరి ఆ ఆసనం ఏమిటో, ఆ ఆసనానికి అంతటి విశిష్టత ఎలా వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

పూజా కార్యక్రమాల్లో నేలపై ఎందుకు కూర్చోకూడదు?
పూజ చేసే సాధకుడి శక్తిని భూమ్యాకర్షణ శక్తి కిందకు గుంజుతుందని, అందువల్ల వైదిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నేలపై కూర్చోరాదని శాస్త్రం చెబుతోంది. పూజ చేసేటప్పుడు ఆసనం మీద కూర్చుని మాత్రమే పూజ చేయాలని ధర్మ గ్రంథాల్లో వివరించి ఉంది. మరి ఆ ఆసనం గ్రహ దోషాలు కూడా తొలగించేదైతే మరింత శ్రేష్టం కదా! అలాంటి ఆసనం ఏదైనా ఉందా! అంటే తప్పకుండా ఉంది. ఎన్నో యుగాల క్రితమే మన మహర్షులు తపస్సు చేయడానికి ఉపయోగించిన ఆసనం అన్ని రకాల పూజలకు ఉపయోగించవచ్చు. అదేమిటో చూద్దాం.

దర్భాసనం
దర్భ, లేదా కుశ గడ్డి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన గడ్డి జాతి. యజ్ఞయాగాదులు, పూజలు, పితృకర్మలు, గ్రహణ సమయంలో శుద్ధి కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది శ్రీమహావిష్ణువు శరీర కేశాల నుండి ఉద్భవించిందని పురాణాల నమ్మకం. దర్భలకు అధిక ఉష్ణశక్తిని నిరోధించే సామర్థ్యం, క్రిమిసంహారక శక్తి కూడా ఉంది. పూజా సమయంలో దర్భలతో చేసిన ఆసనం మీద కూర్చుని పూజ చేయడం వలన గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయంట! అదెలాగో చూద్దాం.

దర్భల విశిష్టత
వరాహ పురాణం ప్రకారం, శ్రీ మహా విష్ణువు వరాహ అవతారంలో ఉన్నప్పుడు ఆయన శరీరంలోని కేశాలు రాలి దర్భలుగా మారాయని, అందువల్ల దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తారు.

గ్రహణ దోషాలు పోగొట్టే దర్భ
గ్రహణ సమయంలో వెలువడే హానికరమైన రేడియేషన్, క్రిములను నశింపజేయడానికి ఆహార పదార్థాలు, నిల్వ ఉంచే పచ్చళ్లపై, త్రాగే నీటిలో దర్భలను ఉంచడం మనకు తెలిసిందే!

దర్భలో ఔషధ గుణాలు
దర్భ గడ్డికి విషాన్ని విరుగుడు చేసే శక్తి ఉందని, ఇది జలాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు.

కేతువు అనుగ్రహం ప్రసాదించే దర్భ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో కేతువు మోక్షకారకుడు. దానికి కారణం కేతు గ్రహానికి అధిదేవత బ్రహ్మదేవుడు కావడమే! కేతువు అనుగ్రహం పొందడం కోసమే శాస్త్రం సూచించిన సమిధ దర్భ. ప్రత్యేకించి పూజ కార్యక్రమాల కోసం శ్రేష్టమైన దర్భలతో ఆసనాన్ని తయారు చేస్తారు. ఈ దర్భాసనంపై కూర్చుని పూజలు, జపతపాలు, ధ్యానం చేసుకోవడం వలన గ్రహ దోషాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

బ్రహ్మ జ్ఞానం సిద్ధింపజేసే కేతువు
కేతువు అనుగ్రహంతో తపస్సు, మంత్ర కుశలత, బ్రహ్మ జ్ఞానం, బుద్ధి కుశలత సిద్ధిస్తాయి. అందుకే పూజలు, వ్రతాలు, హోమాలు చేసేటప్పుడు దర్భాసనంపై కూర్చుని చేయడం వలన ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి.

దర్భాసనం సిద్ధంగా లేకపోతే
ఒక్కోసారి అవసరానికి దర్భలతో అల్లిన ఆసనం సిద్ధంగా ఉండదు. అలాంటప్పుడు కనీసం ఒక్క దర్భ అయినా నేల మీద ఉంచి దానిపై పరిశుభ్రమైన వస్త్రాన్ని పరచుకుని వైదిక కార్యక్రమాలు నిర్వహించడం వలన దర్భాసనంపై కూర్చుని కార్యక్రమాలు జరిపిన ఫలితం సిద్ధిస్తుంది.

వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, విశ్వామిత్రునితో కలిసి యాగ రక్షణ కోసం వెళ్లినప్పుడు దర్భాసనం పైనే శయనించాడని తెలుస్తోంది.

ఇంతటి పవిత్రమైన దర్భాసనం మనం నిత్యం వాడే పూజలో ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఈ దర్భాసనం మనకు పూజ ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వడమే కాకుండా సమస్త గ్రహ దోషాలు సైతం తొలగిస్తుంది. కాబట్టి ఇకపై పూజలో దర్భాసనంకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

శ్రీరాముడు నడయాడిన పుణ్యక్షేత్రాలు- అయోధ్య నుంచి భద్రాచలం వరకు రామాయణానికి సాక్ష్యాలైన పవిత్ర స్థలాలు!

తెలంగాణలో స్వయంభువు గణపతి ఆలయాలు- కోరికలు తీర్చే మహిమాన్విత క్షేత్రాల విశేషాలివే!