తెలంగాణలోని మరకత శివలింగం- ఒక్కసారి దర్శిస్తే వ్యాధులు మటుమాయం!
వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని తలపించేలా తెలంగాణలోని చందిప్ప గ్రామంలో వెలసిన మరకత సోమేశ్వర స్వామి లింగం- ఈ లింగాన్ని దర్శిస్తే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని భక్తుల విశ్వాసం

Published : May 4, 2026 at 4:01 AM IST
Chandippa Someshwara Temple : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే వ్యాధులు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పోలిన శివలింగం తెలంగాణలోని చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుంది. పూర్తిగా మరకతంతో తయారైన ఈ సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇంతకూ ఈ పవిత్ర క్షేత్రం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం.
మరకత సోమేశ్వర స్వామి ఆలయం ఎక్కడుంది?
పరమేశ్వరుడు తన భక్తులను అనుగ్రహించేందుకు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిసినట్లుగా పురాణాలు చెబుతాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లిలో వైద్య నాథేశ్వరుడిగా కొలువుదీరిన శివుడు భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడనే విశ్వాసం ఉంది. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రంతో మెరిసే మరకత శివలింగం తెలంగాణలో చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. మహిమాన్వితమైన ఈ ఆలయం విశిష్టత, స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
చందిప్ప క్షేత్రం చరిత్ర
సాధారణంగా శివలింగం పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం వంటి అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వాటిలో మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలంలో క్రీ.శ. 1076–1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. క్రీ.శ. 1101 కార్తిక శుద్ధ పంచమి గురువారం ఈ క్షేత్రంలో మరకత శివలింగ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించినట్లు ఆలయంలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఆలయ జీర్ణోద్ధరణ
11వ శతాబ్దం నాటి ఈ ప్రాచీన ఆలయం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆ పరిస్థితుల్లో సుమారు పదిహేను సంవత్సరాల క్రితం కొందరు భక్తులు పూనుకుని మరకత సోమలింగేశ్వర స్వామికి నూతన గర్భగుడిని నిర్మించి ఆలయాన్ని పునరుద్ధరించారు.
ఆలయ విశేషాలు
చందిప్ప సోమలింగేశ్వర స్వామి క్షేత్రంలో గర్భాలయంలో శివుని మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
ఆరోగ్యాన్ని అందించే మరకత సోమేశ్వరుడు
పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగానికి, చందిప్ప మరకత లింగానికి దగ్గర పోలికలు ఉన్నాయని ఆలయ పండితులు చెబుతారు. చందిప్ప శివయ్యను దర్శించి భక్తితో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
అభిషేక ప్రియుడు
శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక నియమానుసారం ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ సోమేశ్వర మరకత లింగాన్ని అభిషేకించి, అర్చిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున లింగాభిషేక జలాలతో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో మరకత సోమేశ్వర స్వామికి అభిషేకం చేస్తే పరమశివుని కటాక్షం త్వరగా సిద్ధిస్తుందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు
చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న కాలభైరవుడు ఆలయాన్ని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని నమ్మకం. ఆదివారం కాలభైరవ స్వామిని పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి సర్ప రూపంలో ఆలయ ప్రాంగణంలో సంచరిస్తాడని ప్రతీతి.
సోమేశ్వర స్వామికి సూర్యాభిషేకం
2007లో శివరాత్రి సందర్భంగా సోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న సమయంలో తొలిసారిగా శివలింగంపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం కావడంతో స్వామి లింగం మరకత లింగమని గుర్తించారు. ఆనాటి నుంచి ఈ ఆలయానికి బహుళ ప్రాచుర్యం లభించింది. అప్పటి నుంచి భక్తుల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందసాగింది.
పూజోత్సవాలు
చందిప్ప మరకత సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ త్రికాల పూజలు, అభిషేకాలు, త్రిసంధ్య హారతులు విశేషంగా జరుగుతాయి. ప్రతి సోమవారం విశేష పూజలు జరుగుతాయి. శ్రావణం, కార్తిక మాసాల్లో ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి వేడుకలు కూడా ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు.
దర్శన ఫలం
చందిప్ప మరకత సోమేశ్వర స్వామి క్షేత్రంలో వెలసిన శివయ్యను దర్శిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్‌కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చందిప్ప మరకత సోమేశ్వర స్వామి క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. మనం కూడా చందిప్ప మరకత సోమేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శిద్దాం. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
"హారతి" మధ్యలో ఆరిపోతే అపశకునమా? - హారతి ఎన్నిసార్లు, ఎలా ఇవ్వాలో తెలుసా?
వైశాఖ మాసంలో అక్షయ పుణ్యం అందించే 'ఉదక కుంభ దానం'- ఎప్పుడు? ఎలా చేయాలి?

