ETV Bharat / spiritual

మహా బలశాలి భీముడు- మహాభారతంలో పాత్ర- ఆయన జీవితంలో దాగి ఉన్న నీతి!

వాయుదేవుని అంశతో జన్మించిన భీమసేనుడు శత్రువులకు భయంకరుడు ఎలా అయ్యాడు?

Bheema Story In Mahabharata
Bheema Story In Mahabharata (Source : Eenadu (Art))
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 3:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Bheema Story In Mahabharata : పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతం పేరు వినగానే ముందుగా పంచ పాండవులు గుర్తుకొస్తారు. పంచ పాండవుల్లో భీముడు మహాబలశాలి. ధర్మరాజు ధర్మాన్ని ఆచరించడం ద్వారా, అర్జునుడు ధనుర్ధారిగా గుర్తింపు తెచ్చుకుంటే, భీముడు తన బలంతోనే గుర్తింపు పొందాడు. మహా బలశాలి భీముడు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజు జన్మించినట్లు వ్యాసభారతం ద్వారా తెలుస్తోంది. మార్చి 1, ఆదివారం భీమసేనుని జన్మదినం సందర్భంగా మహాభారతంలో భీముని పాత్ర గురించి, భీముని పాత్ర మనకు అందించే సందేశం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

పుట్టగానే బలప్రదర్శన
భీముడు పదిరోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తల్లి కుంతీదేవి ఒళ్లో నుంచి జారి కింద పడ్డాడు. భీముని ధాటికి ఆ రాయి చూర్ణం అయిందంట! ఆ విధంగా బాల్యంలోనే భీముని బాల పరాక్రమాలు ప్రకటితం అయ్యాయి.

మహాబలశాలి
పంచపాండవుల్లో రెండవవాడు భీముడు. ఇతను కుంతీదేవికి వాయుదేవుడి అంశతో జన్మించిన వాడు. భీముడు వాయుదేవుని అంశతో జన్మించిన కారణంగా పుట్టుకతోనే అమిత బలశాలి. ఒకసారి దుర్యోధనుడు అసూయతో భీముని నీటిలో పడవేసి చంపడానికి ప్రయత్నిస్తే నాగలోకానికి చేరి వెయ్యి ఏనుగుల బలాన్ని ఆశీర్వాదంగా పొంది అజేయుడై తిరిగి వచ్చాడు.

యుద్ధ ప్రావీణ్యం
భీముడు భుజ బలంలో, గదా యుద్ధంలో కౌరవ పాండవులలో సాటిలేని వీరునిగా పేరొందిన వీరుడు. ఏకచక్ర పురాన్ని పట్టి పీడిస్తున్న బకాసురుని, అతని సోదరుని ఒక్క వేటుతో వధించిన మేటి బలశాలి.

శత్రు భయంకరుడు
అపారమైన బలం కలిగిన భీముడు శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడు. సత్యానికి, ధర్మానికి ప్రతీకగా ఉండేవాడు. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. గదాయుద్ధ నిపుణుడు. శత్రువులను నాశనం చేయడంలో ఉత్సాహం చూపేవాడు.

భోజన ప్రియుడు
భీమసేనుడు సహజంగా భోజనప్రియుడు. ఇతనికి ఆకలి ఎక్కువ. చాలా ఎక్కువగా తినేవాడు. ఈ అలవాటు వల్ల ఒకోసారి ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

భక్తి భావం
భీమునికి శ్రీకృష్ణుడు అన్నా, తన సోదరుడు ధర్మరాజు అన్నా భక్తివిశ్వాసాలు ఎక్కువ.

దుర్యోధనునితో పోటీ
తనకంటే బలశాలి అయిన భీముడు అంటే దుర్యోధనునికి చిన్నప్పటి నుంచి అసూయ ద్వేషాలుండేవి. భీముడు తన తమ్ముళ్లను రక్షించేందుకు ఎప్పుడూ ముందుండేవాడు. మల్ల యుద్ధంలో భీముడు దుర్యోధనుని తరచుగా ఓడించేవాడు. ఇదిచూసి దుర్యోధనుడు భీమునిపై అసూయ పెంచుకున్నాడు.

లక్క గృహం నుంచి తప్పించుకోవడం
దుర్యోధనుడు పాండవులను చంపేందుకు శకునితో కలిసి కుట్ర పన్ని వారందరినీ లక్క గృహంలో ఉంచి నిప్పు పెట్టాడు. ఆ సమయంలో భీముడు తన తల్లి, అన్నదమ్ములను భుజాల మీద వేసుకుని బయటకు తీసుకు వచ్చి వారందరిని ఆపద నుంచి రక్షించాడు.

వివాహం
పాండవుల తల్లి కుంతీ దేవి ఆజ్ఞ ప్రకారం భీముడు ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. తరువాత హిడింబాసురుడు అనే రాక్షసుని సంహరించి అతని చెల్లెలు హిడింబను కూడా పెళ్లాడుతాడు. వీరిద్దరి సంతానమే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కాశీరాజు కుమార్తె జలంధరను కూడా భీముడు వివాహం చేసుకున్నాడు.

కౌరవ సభలో ద్రౌపది అవమానం - భీముని ప్రతిజ్ఞ
శకుని ఆడిన మాయాజూదంలో ధర్మరాజు ద్రౌపదిని, రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు భీముడు తన కోపాన్ని అణచుకోలేకపోయాడు. "దుర్యోధనుని తొడలు పగులగొడతానని, దుశ్శాసనుని రక్తాన్ని త్రాగుతానన" ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో అన్న మాట ప్రకారం తన శపథం నెరవేర్చుకున్న ఘనుడు భీముడు.

అజ్ఞాతవాసంలో వంటవాడుగా
అజ్ఞాతవాసం సమయంలో భీముడు 'వలలుడు' అనే పేరుతో విరాట రాజు కొలువులో వంటవానిగా చేరాడు. తన అద్భుతమైన పాకశాస్త్ర నైపుణ్యంతో విరాటరాజు మనసు గెలుచుకున్నాడు. వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించే వాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయంతుడు.

కురుక్షేత్ర యుద్ధంలో భీముని శౌర్యం
కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు కొన్ని కోట్లమంది శత్రుసైన్యాన్ని మట్టుబెట్టాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూరు మందిని భీమసేనుడు ఒక్కడే వధించాడు. దుశ్శాసనుని చంపి, అతని రక్తాన్ని త్రాగి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. దుర్యోధనుని గదాయుద్ధంలో ఓడించి, అతని తొడలు విరగ్గొడతాడు.

భీముని సుగుణాలు
భీముడు అపారమైన శక్తి, ధైర్యం, అసాధారణమైన బలం కలిగిన యోధుడు. తన అన్న ధర్మరాజును అనుసరిస్తూ ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. తన కుటుంబంపై ప్రేమాభిమానాలు, శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు కలవాడు.

భీముని తప్పిదాలు
భీమునికి కోపం, ఆకలి ఎక్కువ. ఈ రెండు గుణాల వలన భీముడు ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

అంతిమ సమయం
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత భీముడు తన అన్నలతో కలిసి స్వర్గారోహణ కోసం హిమాలయాలకు వెళ్లాడు. ఆ మహాప్రస్థానంలో హిమాలయాల్లో ప్రయాణించే సమయంలో, భీముని బలం అతనిని కాపాడలేకపోయింది. చివరికి ఆ మంచు కొండల్లోనే తనువు చాలించాడు. ఎంత బలమున్నా కాలానికి ఎవరైనా లొంగక తప్పదనే పాఠాన్ని భీముడు జీవితం మనకు నేర్పిస్తుంది. ఎంతటి బలశాలికి అయినా కాలం కలిసి రాకపోతే కష్టాలు తప్పవని, దైవం ముందు, విధి ముందు ఎవరైనా తలవంచక తప్పదన్న నీతిని మహాభారతంలో భీముని పాత్ర ద్వారా మనం గ్రహించవచ్చు. వ్యాస భారతంలో భీముని పాత్ర మనకు ఎంతో గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.