ETV Bharat / spiritual

భక్తులను ఆకర్షిస్తున్న హయగ్రీవ మాధవ స్వామి- గుడి కోనేరులో తాబేళ్లను వదిలితే కోరికలు తీరుతాయట!

హయగ్రీవ మాధవ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు మీకోసం!

Hayagriva Madhava Temple
Hayagriva Madhava Temple (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 4:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hayagriva Madhava Temple : ఈ సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మం ఒక్కటే! అలాంటి పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి భక్తి మార్గాన్ని అవలంబించాలని శాస్త్రం చెబుతోంది. తీర్థయాత్రలు చేయడం, క్షేత్ర దర్శనాలు చేయడం, ఆలయాలను సందర్శించడం ఇందులో భాగంగానే భావిస్తారు. ఉన్న పరబ్రహ్మం ఒక్కటే అయినా ఆలయాలు మాత్రం అనేకం ఉంటాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో విశిష్టత ఉంటుంది. అంతేకాదు కొన్ని ఆలయాల్లో విచిత్రమైన సంప్రదాయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఓ విశిష్టమైన ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హయగ్రీవ మాధవ ఆలయం
విష్ణువు యొక్క జ్ఞాన అవతారమే హయగ్రీవ స్వామి. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో ఈ హయగ్రీవ స్వామిని దర్శించుకోవచ్చు. అయితే హయగ్రీవ స్వామికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండడం అరుదు. కానీ తిరుమలలో హయగ్రీవ స్వామికి ప్రత్యేక ఆలయం ఉంది. అలాగే అసోంలో కూడా హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. కామరూప్ జిల్లాలోని హజోలో ఉన్న ఈ ఆలయం ఎన్నో వింతలు, విశేషాలకు ప్రసిద్ధి చెందింది. అవేమిటో చూద్దాం.

పౌరాణిక ప్రాశస్త్యం
హయగ్రీవ మాధవ ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. శ్రీ మహావిష్ణువు తన జ్ఞాన అవతారమైన హయగ్రీవుని స్వరూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నాడు. శ్రీ మహా విష్ణువు మధుకైటభులనే రాక్షసులను ఇక్కడే సంహరించాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. మధు కైటభుల సంహారం తర్వాత బ్రహ్మదేవునికి నారాయణుడు హయగ్రీవుని రూపంలో దర్శనమిచ్చాడని అంటారు. అనంతరం చతుర్ముఖ బ్రహ్మ కోరిక మేరకు నారాయణుడు ఇక్కడే హయగ్రీవుని స్వరూపంలో వెలసి ఉన్నాడు.

ఆలయ చరిత్ర
మణి కూట పర్వతంపై వెలసి ఉన్న హయగ్రీవ మాధవ ఆలయం కొన్ని శతాబ్దాలుగా ఇటు హిందువులకు, అటు బౌద్దులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. 16 వ శతాబ్దంలో రాజా రఘు దేవ్ నారాయణ్ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడిన ఈ ఆలయం ఆనాటి శిల్పుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. రాతితో చెక్కిన ఆలయ కుడ్యములపై చెక్కబడిన ఏనుగులు, గుర్రాలు, వివిధ దేవతామూర్తుల శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

మహాముని ఆలయం
హయగ్రీవ మాధవ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయాన్ని హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు కూడా విశేషంగా సందర్శిస్తారు. టిబెట్ కు చెందిన బౌద్ధులు వారి దైవం బుద్ధుడు మోక్షం పొందిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు. అందుకే వారు ఈ ఆలయాన్ని మహాముని ఆలయమని వ్యవహరిస్తారు. బౌద్ధ మతాన్ని అనుసరించే వారికి ఈ మహాముని ఆలయం ఎంతో పవిత్రమైన ప్రదేశం.

తాబేళ్ల సమర్పణ
హయగ్రీవ మాధవ ఆలయంలో ఒక అద్భుతమైన సంప్రదాయం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన సంప్రదాయం తాబేళ్ల సమర్పణ. ఆలయానికి అనుబంధంగా ఉన్న కోనేరును 'మాధవ పుఖురి' అంటారు. ఈ కోనేరులో వందలాది అరుదైన జాతులకు చెందిన తాబేళ్లు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత కోనేరులో తాబేలును వదిలి పెడతామని మొక్కుకుంటారు. తమ కోరిక తీరిన తర్వాత తిరిగి ఆలయాన్ని దర్శించి ఆలయ కోనేరులో తాబేలును విడిచి పెడతారు. ఇలా భక్తులు సమర్పించిన వివిధ రకాల తాబేళ్లు ఈ కోనేరులో దర్శనమిస్తాయి. భక్తులు ఈ తాబేళ్లను శ్రీ మహా విష్ణువు అవతారమైన కూర్మావతార స్వరూపంగా భావిస్తారు. అందుకే వాటికీ ఎవరు హాని తలపెట్టకుండా జాగ్రత్తగా సంరక్షిస్తారు. ఈ విధంగా తాబేలును సమర్పించడం వలన శ్రీ మహా విష్ణువు ప్రసన్నుడవుతాడని విశ్వాసం. అంతేకాదు ఐశ్వర్యానికి చిహ్నమైన తాబేలును ఆలయ కోనేరుకు సమర్పిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, లక్ష్మి కటాక్షం కలుగుతుందని విశ్వాసం.

మనం కూడా హయగ్రీవ మాధవ ఆలయాన్ని సందర్శించి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుదాం.

ఓం నమో నారాయణాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.