ETV Bharat / spiritual

ఆషాఢంలో "కొత్తగా పెళ్లైనోళ్లు" ఎందుకు దూరంగా ఉండాలి? - గోరింటాకు పెట్టుకోవడం వెనుక కారణమేంటి?

"ఆషాఢ మాసం" ఎప్పుడు ప్రారంభం? - ఈ నెలలో శుభ కార్యాలు ఎందుకు చేయకూడదో వివరిస్తున్న జ్యోతిష్యులు!

Ashada Masam 2026 Date
Ashada Masam 2026 Date (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 9, 2026 at 3:02 PM IST

4 Min Read
Choose ETV Bharat

Ashada Masam 2026 Date and Significance : హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. సనాతన ధర్మంలో 'చాంద్రమాసాల పేర్లు' నార్మల్​గా ఆ మాసంలోని పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉంటాడో దాని పేరునే ఏర్పడతాయి. అలా ఆషాఢ నక్షత్రంతో(పూర్వాషాడ/ఉత్తరాషాడ) కూడిన పౌర్ణమి వచ్చే మాసాన్ని 'ఆషాఢం'గా చెబుతారు. "ఆషాఢ" అనే పదానికి సంస్కృతంలో "అజేయమైనది", "అపరాజితమైనది" అని అర్థం ఉంది. అందుకే, ఈ మాసం పేరును ఆధ్యాత్మిక స్థైర్యానికి, దృఢత్వానికి, విజయానికి ప్రతీకగా భావిస్తారు. అయితే, ఆషాఢం వేళ చాలా మందికి రకరకాల సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో కొత్త జంట దూరంగా ఉండాలంటారు ఎందుకు? గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? మాంసాహారం తినకూడదా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీటన్నింటికి ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగ కర్త శంకరమంచి శివ సిద్ధాంతి ఇలా సమాధానమిస్తున్నారు.

"ఆషాఢ మాసం" ఎప్పుడు ప్రారంభం?

ఆషాఢం అంటే చాలా మందికి 'చెడ్డ మాసం' అనే అభిప్రాయం ఉంటుంది. కానీ, అది సరైంది కాదు అంటున్నారు జ్యోతిష్యులు శంకరమంచి శివ సిద్ధాంతి. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం తర్వాత వచ్చే నాలుగో మాసమే ఆషాఢం. ఈ సంవత్సరం(2026లో) ఆషాఢ మాసం జులై 15వ తేదీన ప్రారంభమై ఆగస్టు 12న చుక్కల అమావాస్యతో కంప్లీట్ అవుతుంది. పూరీ జగన్నాథ రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం, గురుపౌర్ణిమ, తెలంగాణలో మహంకాళి జాతర వంటి ఎన్నో పుణ్య పర్వాలు ఈ నెలలో వస్తాయి. అందుకే, దీనిని అశుభమాసం అనడం సరి కాదని చెబుతున్నారు.

ఏ ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు మిథునరాశిలో ఉన్నప్పుడు వచ్చే ఆషాఢంను శూన్యమాసంగా చెప్పారు. అయితే, ఇక్కడ శూన్యం అంటే 'అశుభం' అని కాదు. ఈ కాలంలో పెళ్లి, గృహప్రవేశం, ఉపనయనం వంటి శుభకార్యాలు చేయరాదని శాస్త్రం చెబుతోంది. కానీ, దైవారాధన, తపస్సు, జపం, వ్రతాలు, గురుపూజలకు మాత్రం ఈ నెల అత్యంత శ్రేష్ఠమైనదిగా చెప్పుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు శంకరమంచి శివ సిద్ధాంతి. అంతేకాదు, పూర్వకాలంలో ఆషాఢమే వర్షాకాల ఆరంభం. రైతులు అందరూ వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉండేవారు. వర్షాల వల్ల ప్రయాణాలు, పెద్ద ఏర్పాట్లు కూడా ఇబ్బందికరంగా ఉండేవి. అందుకే శుభకార్యాలకు విరామం ఇచ్చారట. అంతే తప్ప ఆషాఢం చెడ్డ మాసం అని కాదు అంటున్నారు.

కొత్తగా పెళ్లైన వారు ఎందుకు దూరంగా ఉండాలి?

ఆషాఢంలో కొత్త జంట దూరంగా ఉండడం వెనుక సామాజిక, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు జ్యోతిష్యులు శంకరమంచి శివ సిద్ధాంతి. మన దేశం వ్యవసాయాధారితం. పూర్వపు రోజుల్లో వ్యవసాయానికి ఆషాఢం, శ్రావణ మాసాలు అత్యంత కీలకమైన రోజులు. తొలి వర్షాలు పడగానే రైతులు వెంటనే పొలాల్లో పనులు మొదలుపెట్టాల్సి వచ్చేది. అయితే, కొత్తగా పెళ్లైన వారు కుటుంబ పనుల కంటే భాగస్వామికే ఎక్కువ టైమ్​ కేటాయించే వారట. దానివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా, కుటుంబంలో చిన్నచిన్న మనస్పర్ధలు రాకుండా ఆషాఢంలో కొత్త వధువును కొంతకాలం పుట్టింటికి పంపే ఆచారం ఏర్పడిందంటున్నారు.

అదేవిధంగా, ఆషాఢ మాసంలో గర్భధారణ జరిగితే, ప్రసవం తీవ్రమైన వేసవికాలంలో జరిగే ఛాన్స్ ఉండేది. అప్పట్లో వైద్య సౌకర్యాలూ అంతగా లేకపోవడంతో తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సంప్రదాయాన్ని పాటించేవారని చెబుతున్నారు. అందువల్ల ఈ ఆచారం మూఢనమ్మకం కాదు. వ్యవసాయం, కుటుంబ సామరస్యం, తల్లీబిడ్డల ఆరోగ్యం ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఒక సామాజిక సంప్రదాయంగా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

కలలో ఈ "దృశ్యాలు" కనిపిస్తే చాలా మంచిదట! - పాములు వస్తే దేనికి సంకేతమో తెలుసా?

గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?

ఆషాఢంలో చాలా మంది మహిళలు 'గోరింటాకు' పెట్టుకోవడం చూస్తుంటాం. అయితే, ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్య నియమం కూడా అంటున్నారు. గోరింటాకును ఆయుర్వేదంలో మదయంతిక అని అంటారు. దీనికి శరీరంలోని అధిక వేడిని తగ్గించి చల్లదనాన్నిచ్చే, పిత్తదోషాన్ని శాంతింపజేసే గుణం ఉంటుందట. అలాగే, గాయాలు, పుండ్లు త్వరగా మానడానికి గోరింటాకు తోడ్పడుతుందని చెబుతున్నాయి ఆయుర్వేద గ్రంథాలు.

ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. తరచూ చేతులు, కాళ్లు తడవడం, బురదలో పనిచేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. వీటి నుంచి గోరింటాకు కొంతవరకూ రక్షణనిస్తుందంటున్నారు. అందుకే, ఈ మాసంలో చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి ప్రతీకగా భావించడం మన వద్ద ఓ ఆచారంగా కొనసాగుతోందని చెబుతున్నారు పంచాంగ కర్త శంకరమంచి శివ సిద్ధాంతి.

నాన్​వెజ్ తినకూడదా!

ఈ నెలలో మాంసాహారం తినకూడదని చెప్పడానికి కారణం ఆరోగ్యమేనట. ఎందుకంటే, ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. ఈ సమయంలో మాంసాహారం తింటే తొందరగా జీర్ణం కాదు. ఆషాఢంలో చాలా మంది చాతుర్మాస్య వ్రతం స్వీకరిస్తుంటారు. ఈ టైమ్​లో సాత్వికాహారం తీసుకోవాలని, అవసరమైతే ఉపవాసాలు చేయాలని సూచించారు పెద్దలు.

కొత్త వ్యాపారాలు ప్రారంభించొచ్చా?

ధర్మశాస్త్రాల్లో కొత్త వ్యాపారం మొదలుపెట్టకూడదని నిషేధం లేదు. అయితే శూన్యమాసంలో తొలిసారి వాడే విలువైన వస్తువులు కొనడం, ముఖ్యమైన కొత్త పనుల్ని ప్రారంభించడాన్ని కొందరు వాయిదా వేస్తుంటారు. పూర్వం రైతులు వ్యవసాయానికే తమ వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేశేవారు. విలాస వస్తువులను కొనుగోలు చేసేవారు కాదు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. అందుకని అవసరమైన కొనుగోళ్లు, సాధారణ పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. అయితే, జులై 15వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు గురు మౌఢ్యమి ఉన్నందున పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు వంటి ముఖ్య కార్యక్రమాలను మౌఢ్యమి ముగిసిన తర్వాత శుభముహూర్తంలో నిర్వహించడం మంచిదని సూచిస్తున్నారు జ్యోతిష్యులు శంకరమంచి శివ సిద్ధాంతి.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తిరుమల, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలా? - నియమం ఏమైనా ఉందా?

పూజగదిలో 'వీటిని' ఉంచకండి! - మనసంతా కేంద్రీకరించాలంటే ఏం చేయాలో తెలుసా?