ETV Bharat / spiritual

కాశీ అరుణాదిత్యుని మహిమ- దారిద్య్రం, అనారోగ్య బాధలు తొలగించే సూర్య క్షేత్రం- రథసారథిగా మారిన అనూర్వుడి అద్భుత గాథ!

అసంపూర్ణ శరీరంతో జన్మించినవాడు సూర్య రథసారథిగా ఎలా మారాడు?- సూర్యుడి ప్రత్యక్ష అనుగ్రహం పొందాలంటే ఈ ఆదిత్యుడిని దర్శించాల్సిందేనా?

Arunaditya Surya Temple in Kashi
Arunaditya Surya Temple in Kashi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 4:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

Arunaditya Surya Temple in Kashi: భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన వారణాసి పట్టణంలో ఎన్ని మహిమలు, మరెన్నో మహత్యాలు. కాశీ పట్టణంలో వెలసిన ద్వాదశ ఆదిత్యులను దర్శించడం సంప్రదాయం. అందులో ముఖ్యంగా అరుణాదిత్యుని దర్శిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యల ఉంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. కాశీలో వెలసిన ఈ అరుణాదిత్యుని మహత్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

కాశీలో ద్వాదశ ఆదిత్యులు
ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. కాశీ క్షేత్రం ఎన్నో ప్రాచీన దేవాలయాలకు నిలయం. కాశీ క్షేత్రంలో సూర్యభగవానునికి ద్వాదశ ఆలయాలు కలవు. ఈ ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలలో సూర్యభగవానుడి దివ్య శక్తి నిక్షిప్తమై ఉంది. కాశీ యాత్రకు వెళ్లిన వారు ఈ ఆలయాల సందర్శన వల్ల శారీరక అనారోగ్యాలతో పాటు భవ రోగాల నుంచి కూడా విముక్తులు కావచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశ ఆదిత్యులలో ఒకటైన అరుణాదిత్యుని స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

స్థల పురాణం
శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండంలో కాశీ పట్టణంలో ద్వాదశ ఆదిత్యుల గురించిన ప్రస్తావన ఉంది. ఆ ప్రకారంగా త్రిలోచన ఘాట్ వద్ద ఉన్న త్రిలోచన మహాదేవ ఆలయంలో వెలసిన అరుణాదిత్యుని స్థల పురాణం తెలుసుకుందాం. కాశీఖండంలో వివరించిన ప్రకారం పూర్వం కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వారిద్దరూ ఒకేసారి గర్భం ధరించారు.

అనూర్వుడి జననం
కద్రువకు చాలా మంది నాగ సర్పాలు సంతానంగా కలుగగా వినతకు మాత్రం ఎంతకాలమైనా తన గర్భం నుంచి శిశువు జన్మించలేదు. అసూయతో, ఆగ్రహంతో వినత తన కడుపులో ఉన్న అండాన్ని పగలగొట్టింది. ఆ అండం నుంచి ఒక శిశువు జన్మించాడు. కానీ అతని రూపం అసంపూర్ణంగా ఉంది. నడుము కింద నుంచి అతని శరీరం అసంపూర్ణంగా ఉండడం చూసి వినత ఎంతో దుఃఖించింది. ఊరువులు అంటే తొడలు లేకుండా జన్మించాడు కాబట్టి ఆ శిశువు అనూర్వుడిగా పేరుగాంచాడు.

వినత దాస్యం
అప్పుడు అనూర్వుడు తన తల్లి తొందరపాటుతో తనకు ఈ దుస్థితి కలిగిందన్న కోపంతో తన తల్లి అయిన వినతని ఆమె సవతి అయిన కద్రువకు దాస్యం చేయమని శపిస్తాడు. అప్పుడు వినత అనూర్వుడిని శాపవిమోచనం కోసం ప్రార్థించగా అందుకు అనూర్వుడు వినతకు గరుత్మంతుడు అనే శిశువు జన్మించి ఆమెకు శాపవిమోచనం కలిగిస్తాడని శాపోపశమనం చెబుతాడు.

కాశీలో సూర్యుని కోసం అనూర్యుడి తపస్సు
తన దుస్థితికి దిగులు చెందిన అనూర్వుడు వైరాగ్యంతో కాశీకి వచ్చి ఒక సూర్య భగవానుడిని ప్రతిష్ఠించి తపస్సు చేయసాగాడు. ఇలా కొన్నేళ్లు తపస్సు చేసిన తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అనూర్యుడు సూర్యుని అనేక విధాలుగా స్తుతించగా, సూర్యుడు ప్రసన్నుడై అనూర్వుడికి అరుణుడిగా నామకరణం చేసి తన రథసారథిగా నియమించుకుంటారు.

అరుణాదిత్యుడనే పేరు ఇలా వచ్చింది
అరుణుడు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కనుక ఈ ఆదిత్యుని అరుణాదిత్యుడని అంటారు. ఈ అరుణాదిత్యుడిని దర్శించడం వలన భయము, దుఃఖము, దారిద్య్రం, జన్మాంతర పాపములు, వ్యాధుల బాధలు తొలగుతాయని సూర్యుడు వరం ఇస్తాడు. కాశీ యాత్రకు వెళ్లినప్పుడు భక్తులు ద్వాదశ ఆదిత్యుల దర్శనంలో భాగంగా అరుణాదిత్యుని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. ఈ స్వామి దర్శనంతో వ్యాధుల బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఓం సూర్య దేవాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.