అమలైక్య ఏకాదశి విశిష్టత- బ్రాహ్మణులకు ఉసిరికాయ దానం చేస్తే అఖండ ఐశ్వర్యం!
అమలైక్య ఏకాదశి రోజు పితృదేవతల ప్రీత్యర్థం నువ్వులు దానం చేస్తే వంశాభివృద్ధి

Published : February 26, 2026 at 5:58 PM IST
Amalaki Ekadashi 2026 Significance : అమృత ఏకాదశి ఫాల్గుణ మాసం శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని చాలా విశిష్టమైనవి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఉసిరి చెట్టును పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ రోజు చేసే ఉసిరి చెట్టు పూజ వల్ల అపారమైన సంపద సిద్ధిస్తాయని విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యపరంగా అమృతత్వాన్ని సిద్ధింపజేసే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి అమృత ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథనంలో అమృత ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఈ రోజు విష్ణువు ఆరాధన ఎలా చేయాలి? వ్రతవిధానం ఏమిటి? అనే వివరాలు తెలుసుకుందాం.
అమలైక్య ఏకాదశి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 26, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:33 నిమిషాలకు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. తిరిగి ఫిబ్రవరి 27, శుక్రవారం రాత్రి 10:22 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యోదయంతో తిథి సంప్రదాయాన్ని అనుసరించి ఫిబ్రవరి 27, శుక్రవారం రోజునే అమలైక్య ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
అమలైక్య ఏకాదశి విశిష్టత
ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. అమలైక్య ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇలా ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం. ప్రతీ ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమృత ఏకాదశి అని, అమలైక్య ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి అని కూడా అంటారు. అమలైక్యం అంటే సంస్కృతంలో ఉసిరిక చెట్టు అని అర్ధం. ఉసిరిక చెట్టు లక్ష్మి స్వరూపం, ఐశ్వర్యకారకం. అందుకే అమలైక్య ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం ద్వారా భక్తులు ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారని, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అమలైక్య ఏకాదశి రోజున నియమనిష్టలు పాటించి ఉపవాసాలు చేసే భక్తులకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
అమలైక్య ఏకాదశి వ్రత విధానం
అమలైక్య ఏకాదశి రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నిత్యకర్మలు ముగించుకుని తలారా స్నానం చేయాలి. ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా అగరు ధూపం వేయాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని దీక్ష వహించాలి. పూజామందిరంలో శ్రీలక్ష్మీనారాయణుల చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. తులసి దళాలు, చామంతులు, గులాబీలు, కలువ పూలతో లక్ష్మినారాయణులను అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. అనంతరం లక్ష్మి అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు, పులిహోర, చక్రపొంగలి వంటి ప్రసాదాలు నివేదించాలి. చివరగా అమలైక్య ఏకాదశి వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. కర్పూర నీరాజనం సమర్పించాలి.
ఉసిరి చెట్టు పూజ
ఈ రోజు ఉసిరి చెట్టును పసుపు కుంకుమలతో పూజించి చెట్టు మొదట్లో దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. ఉసిరి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయాలి. ఈ రోజు బ్రాహ్మణులకు ఉసిరికాయ దానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అలాగే గోదానం, అన్నదానం చేయడం వల్ల కూడా విశేష ఫలం కలుగుతుంది. ఈ రోజు పితృదేవతల ప్రీత్యర్థం నువ్వులు దానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.
దేవాలయంలో ఇలా
ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది. రాత్రి చంద్ర దర్శనం అయ్యాక పాలు, పళ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఈ రోజు రాత్రంతా భజనలు, కీర్తనలతో జాగరణ చేయడం వలన మోక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది.
ద్వాదశి పారణ
మరుసటి రోజు ద్వాదశి రోజు ఉదయం తిరిగి తలారా స్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించుకోవాలి. తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో అమలైక్య ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మోక్షం లభిస్తుంది. రానున్న అమలైక్య ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. మోక్షాన్ని పొందుదాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

