అలంగుడి ఆపత్సహాయేశ్వరర్ ఆలయ మహిమ- 24 దీపాలు వెలిగిస్తే గురు దోషాలు తొలగుతాయా?
కుంభకోణం నవగ్రహ క్షేత్రాల్లో గురు గ్రహానికి అంకితమైన అలంగుడి ఆపత్సహాయేశ్వరర్ ఆలయం- అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి- హాలాహల విషాన్ని సేవించిన శివుడు గురు దక్షిణామూర్తిగా వెలసిన దేవాలయం

Published : July 9, 2026 at 2:58 AM IST
Alangudi Apatsahayesvarar Temple : ఆలయాల రాష్ట్రంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో పురాతన చరిత్ర దాగిఉంది. విశేషించి ఒక్క కుంభకోణం జిల్లాలోనే 2000కు పైగా ఆలయాలు వెలసి ఉన్నాయి. ప్రతి ఆలయం ప్రత్యేకమైనదే! కుంభకోణం పరిక్రమ మార్గంలో నవగ్రహాలకు చెందిన ఆలయాలు దర్శనమిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో నవగ్రహానికి ఒక్కో ప్రత్యేక ఆలయం ఉండడం విశేషం. ఈ క్రమంలో అలంగుడిగా ప్రసిద్ధి చెందిన దేవ గురువు బృహస్పతికి చెందిన ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అలంగుడి - కుంభకోణం
కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ దేవ గురు బృహస్పతి దేవాలయాన్ని గురుస్థానం అని పిలుస్తారు. ఇది తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఆలంగుడి అనే గ్రామంలో ఉంది. ఈ క్షేత్రం కుంభకోణంలో ఉన్న మొత్తం 9 నవగ్రహ క్షేత్రాలలో గురుస్థానంగా భాసిల్లుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గరుదక్షిణామూర్తిగా పూజలందుకుంటున్నాడు. ఈ స్వామికి 'ఆపత్సహాయేశ్వరర్' అనే మరో పేరు కూడా ఉందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
స్థల పురాణం
దేవ దానవులు అమృతం కోసం చేసిన క్షీరసాగర మథనంలో ముల్లోకాలనూ దహించి వేసేంత వేడితో హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి తట్టుకోలేక దేవతలంతా హాహాకారాలు చేస్తుంటే భోళాశంకరుడు ఆ గరళాన్ని సేవించి గొంతులో నిలుపుకొన్న చోటు ఇదేనని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా తన భక్తులను ఆపద నుంచి గట్టెక్కించిన శివుణ్ని 'ఆపత్సహాయేశ్వరర్' అంటే ఆపద్బాంధవుడుగా దేవతలు కొలిచిన ప్రదేశం అయినందున ఇక్కడ శివునికి ఆపత్సహాయేశ్వరర్ అనే పేరు స్థిరపడింది. అంతేకాదు విషాన్ని మింగి గరళకంఠుడైన సదాశివుడు అక్కడే దేవదానవులకు జ్ఞానబోధ చేసి గురుదక్షిణామూర్తిగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
అలంగుడి అపత్సయేశ్వర శివాలయం
అలంగుడి అనే పేరు 'ఆలం' నుంచి ఉద్భవించింది. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు సేవించిన గరళానికి ప్రతీక! కుటుంబపరంగా, వృత్తి పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనేక విపత్తులను ఎదుర్కొంటున్న వారికి ఆశ్రయం కల్పించే ప్రదేశంగా ఈ ఆలయాన్ని పేర్కొంటారు. అంతేకాదు తనను ఆశ్రయించిన భక్తులను ఆపత్సహాయేశ్వరర్ సదా రక్షిస్తాడని పూనిక.
ఆలయ చరిత్ర
ఒకసారి తిరువారూర్‌ను పాలించిన చోళరాజు అలంగుడిలోని సుందరమూర్తి విగ్రహాన్ని చూసి ఆకర్షితుడై దానిని తిరువారూర్‌లో పూజ కోసం ప్రతిష్టించాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అలంగుడి ఆలయ పూజారి భయాందోళనకు గురయ్యాడు. అతను ఆ విగ్రహాన్ని మశూచి సోకిన పిల్లవాడిలా మారువేషం వేసి, ఒక ఊయల లోపల దాచి, సురక్షితంగా అలంగుడికి తీసుకువచ్చాడు. అందుకే ఇక్కడ స్వామి విగ్రహంపై మశూచి జాడలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి.
నవగ్రహ క్షేత్రాల విశిష్టత
హిందూ సంప్రదాయం ప్రకారం, నవగ్రహాలు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి సుఖదుఃఖాలు ప్రసాదిస్తాయి. నవగ్రహాలకు ప్రత్యేకించిన ఇలాంటి పుణ్య క్షేత్రాలను సందర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయని విశ్వాసం.
అలంగుడి ఆలయ విశేషాలు
అలంగుడి గర్భాలయంలో ఆపత్సహాయేశ్వరర్ బృహస్పతిగా వెలసి ఉన్నాడు. అలంగుడి శివాలయం యొక్క మూలాలు చోళ రాజవంశం నాటివి. తరువాత 16వ శతాబ్దంలో నాయకులు ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయం ద్రావిడ వాస్తు శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది. ఐదు అంచెల రాజగోపురంతో అలరారే ఈ ఆలయంలో సుఖ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, ఆదిశంకరాచార్యుల వారితో పాటు అనేక మంది మహర్షులు, పురాణ పురుషులు పూజలు చేసారని తెలుస్తోంది.
అబ్బురపరిచే ఆలయ నిర్మాణ శైలి
ఆలయ సముదాయంలోని ప్రతి మందిరం అలనాటి కళాకారుల భక్తిభావాన్ని, శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అలంగుడికి మూడు వైపులా కావేరి, కోలిడం, వెన్నారు అనే మూడు పవిత్ర నదులు ఉన్నాయి.
పవిత్ర తీర్థాలు
అలంగుడి ఆలయం చుట్టూ 15 తీర్థాలు ఉన్నాయి. వాటిలో ఆలయాన్ని చుట్టుముట్టిన అమృత పుష్కరణి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆలయం ముందు భాగంలో ఉన్న చక్ర తీర్థం శ్రీ మహా విష్ణువు చక్రం ద్వారా సృష్టించబడిందని చెబుతారు.
పూజోత్సవాలు
గురు గ్రహానికి సంబంధించిన దోషాలున్నవారు అలంగుడి దక్షణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు వెలిగిస్తే సకల దోషాలు తొలగుతాయని విశ్వాసం. ప్రతిరోజూ ఇక్కడ నిత్యపూజలు శైవ సంప్రదాయంలో జరుగుతాయి. గురువారం నాడు, గురువు సంక్రమణం రోజుల్లోనూ ఇక్కడ ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఆలయాన్ని దర్శించిన భక్తులు పసుపు పచ్చ వస్త్రాలు, శనగలు, కందులు, వంటి ధాన్యాలు, పువ్వులు, ఆభరణాలు స్వామికి సమర్పిస్తారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుని నానబెట్టిన శనగలతో కట్టిన మాల వేసి పూజిస్తే తప్పక ఉత్తీర్ణులవుతారని విశ్వాసం.
బ్రహ్మోత్సవం ఎంతో ప్రత్యేకం!
అలంగుడి శివాలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కార్యక్రమాలలో బ్రహ్మోత్సవం ఒకటి. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం తమిళ నెల చితిరై అంటే మన ఏప్రిల్-మే నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్రహ్మోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి.
రథోత్సవం
అలంగుడిలో జరిగే మరో ప్రత్యేక ఉత్సవం దక్షిణామూర్తి రథోత్సవం. తమిళనాడులో దక్షిణామూర్తిని రథంలో బయటకు తీసుకువెళ్లే ఏకైక ఆలయంగా అలంగుడి ప్రసిద్ధి చెందింది.
దర్శన ఫలం
అలంగుడి దక్షిణామూర్తి ఆలయాన్ని సందర్శించి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన, ఆలయంలో 24 దీపాలు వెలిగించడం వలన గురుగ్రహ దోషాలు తొలగి శాంతి, విజయం, ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న వారికి ఈ ఆలయం ఉపశమనం కలిగించే ప్రదేశంగా పురాణాలు పేర్కొంటున్నాయి.
ఎలా చేరుకోవాలి?
తమిళనాడులోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి కుంభకోణానికి చేరుకోవడానికి మెరుగైన రవాణా సదుపాయాలున్నాయి. కుంభకోణం నుంచి దక్షిణంగా 17 కి.మీ దూరంలో వెలసి ఉన్న అలంగుడి ఆపత్సహాయేశ్వరర్ ఆలయానికి ప్రైవేటు వాహనాల్లో, బస్సుల్లో సులభంగా చేరుకోవచ్చు.
మనం కూడా ఆపత్సహాయేశ్వరర్ ఆలయాన్ని సందర్శించి గురుగ్రహ అనుకూలతతో సకల శుభాలు పొందుదాం.
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
గురు దోషాలను పోగొట్టే 'దక్షిణామూర్తి స్తోత్రం'- ఇలా చదివితే కోరికలన్నీ నెరవేరుతాయ్!
హరిద్రా గణపతి అంటే ఎవరు?- 41 రోజుల పూజతో గురుగ్రహ అనుగ్రహం- సకల విఘ్నాలు తొలగుతాయా?

