మన్మథుని భస్మం నుంచి పుట్టిన రాక్షసుడు! అతడిని అంతం చేసిన ఆ శక్తి ఎవరో తెలుసా?
వ్యాస మహర్షి రచించిన దేవీభాగవతంలో భండాసురుని సంహారం గురించిన ప్రస్తావన!

Published : November 14, 2025 at 12:02 AM IST
Adi Parashakti Killed Bhandasura: మన పురాణాల్లో రాక్షస సంహారం కోసం శివకేశవులు ఎన్నో అవతారాలు ధరించడం తెలిసిందే! అయితే శివకేశవుల నుంచి కూడా మరణం లేకుండా వరం పొందిన భండాసురుణ్ణి ఆదిపరాశక్తి యోగాగ్ని నుంచి ఉద్భవించి సంహరిస్తుంది. ఎవరీ భండాసురుడు? ఆది పరాశక్తి భండాసుర సంహారం ఎలా చేసింది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ భండాసురుడు?
వ్యాస మహర్షి రచించిన దేవీభాగవతంలో భండాసురుని సంహారం గురించిన ప్రస్తావన ఉంది. భండాసురుడు మన్మథుని భస్మం నుంచి పుట్టిన రాక్షసుడు. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివునిపై మన్మథ బాణం
సతీదేవి దేహత్యాగం తరువాత పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో పర్వత రాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని శివుని సేవకై నియమించాడు. పార్వతి పరమేశ్వరులకు వివాహం జరిగితే వారికి పుట్టే కుమారుని వల్ల తారకాసుర సంహారం జరగాల్సి ఉంది. ఇది గొప్ప దైవకార్యం. పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మథుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుంచి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు.
మన్మథ దహనం
తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటునకు చింతించి, అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. చెట్టు చాటున ఉన్న మన్మథుడు కన్పించాడు. కోపంతో శివుడు తన మూడవకన్ను తెరచి మన్మథుణ్ణి భస్మం చేశాడు.
భస్మం నుంచి పుట్టిన భండాసురుడు
కొంతకాలం తర్వాత గణపతి ఆ భస్మాన్ని తన రెండు చేతులతో పోగుచేస్తూ ఉండగా, ఆ భస్మం నుంచి భయంకర ఆకారంతో భండాసురుడనే రాక్షసుడు ఉద్భవించాడు. ఇతడు పెరిగి పెద్దవాడై, ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. ఈ రాక్షసుడికి స్త్రీలంటే చులకన, వారు తనను ఏమి చేయలేరని ధైర్యం! ఇదే వీడి పాలిట శాపమైంది.
ముక్కోటి దేవతలను పీడించిన భండాసురుడు
తపస్సుతో సంపాదించుకున్న వరగర్వంతో భండాసురుడు స్వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు. దేవతలు భండాసురుని దురాగతాలకు తట్టకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా, ఒక మహాశక్తి వల్ల మాత్రమే భండాసురుడు మరణిస్తాడని విష్ణువు వారికి వివరిస్తాడు.
దేవతల యాగం
విష్ణువు సూచన మేరకు దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు.
పరాశక్తి ఆవిర్భావం
బ్రహ్మ , విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగానికి జగన్మాత సంతృప్తి చెందుతుంది. ఆ యజ్ఞవేదిక నుంచి జగన్మాత పరాశక్తిగా ఆవిర్భవించిది.
పరాశక్తి తేజోమయ స్వరూపం
పరాశక్తి తన శిరస్సుపై రత్నకచితమైన స్వర్ణ కిరీటం, కిరీటం మీద అర్థచంద్రునితో ప్రకాశించసాగింది. పరాశక్తి తన నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, చెరుకు విల్లు, ఐదు పుష్పబాణాలు ధరించి ఉంది. ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. దేవతల భక్తి భావానికి ముగ్ధురాలైన జగన్మాత భండాసురుని సంహరించి దేవతలను కాపాడుతానని అభయమిచ్చింది.
పరిచారికలతో బయలుదేరిన పరాశక్తి
కొంతకాలం తరువాత పరాశక్తి చతురంగ బలాలతో భండాసుర సంహారార్థమై బయలుదేరింది. పరాశక్తి ఇరువైపులా వారాహీదేవి, శ్యామలాదేవి పరిచారికల్లా అనుసరించారు.
ప్రారంభమైన యుద్ధం
ససైన్యంగా తన పైకి యుద్దానికి వస్తున్న పరాశక్తిని చూచి, భండాసురుడు భయంకరమైన తన సేనావాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు భండుని సేనలను సర్వనాశనం చేశాయి. అపుడు భండాసురుడు తన ముప్ఫై మంది పుత్రులను దేవీ సైన్యం పైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగం నుంచి బాలాదేవతను సృష్టించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలా దేవత భండాసురుని పుత్రులందరినీ సంహరించిది.
రాక్షస సంహారం
తన పుత్రులందరూ మరణించడం చూచి, భండాసురుడు తన రెండు భుజాల నుంచి విశుక్రుడు, విషంగుడను ఇద్దరు రాక్షసులను సృష్టించాడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురికొల్పాడు. పరాశక్తి తన పరిచారికలైన వారాహీ శ్యామలా దేవతలను ఆజ్ఞాపించగా, వారాహీ దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా, శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది.
దిక్కు తోచని స్థాయిలో భండాసురుడు
తన సైన్యం, పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా, భండాసురుడు దిక్కుతోచనివాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్రాస్త్రాల బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు.
విఘ్న యంత్రాన్ని నాశనం చేసిన గణపతి
జగన్మాత మహాకామేశ్వరుని వంక చూడగానే ఆ చూపుల్లో నుంచి గణపతి ఆవిర్భవించి తల్లి ఆజ్ఞమేరకు భండాసురుని విఘ్నయంత్రాన్ని తునాతునకలు చేశాడు.
భండాసుర సంహారం
చివరకు పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్రప్రయోగంతో భండాసురుణ్ణి నేలకూల్చింది.
దేవతల ఆనందం
భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా పరాశక్తిగా జగన్మాతను ప్రస్తుతించారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి దేవతలకు అనేక వరాలు ఇచ్చి అంతర్థానమైంది. దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు.
రాక్షస ప్రవృత్తిని సంహరించి దైవత్వం వైపు అడుగులు వేసేలా!
ఇది భండాసుర సంహార వృత్తాంతం. ఈ కథ మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది. మందబుద్ధి, కామం, క్రోధం, మితిమీరిన అహంకారం ఇవన్నీ రాక్షస ప్రవృత్తికి సంబంధించినవి. కలియుగంలో మానవునిలో అంతర్లీనంగా దాగివుండే ఈ గుణాలన్ని రాక్షస గణాలే! దుర్గుణాలనే ఈ రాక్షసులను దైవారాధనతో, ఆధ్యాత్మిక సాధనతో జయించడమే భండాసుర సంహారంలో ఇమిడి ఉన్న రహస్యం. ఇదే జగన్మాత మానవాళికి అందించే సందేశం!
ఓం శ్రీ మాత్రే నమః!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

