WhatsApp Transcription Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే, మీ వాయిస్ మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా టెక్ట్స్ రూపంలోకి మారిపోతాయి. అంటే మీరు వాయిస్ మెసేజ్‌ను వినాల్సిన అవసరం ఉండదు. నేరుగా చదివేయవచ్చు. దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే?
ఉదాహరణకు మనం బస్సులో వెళుతూ ఉంటాం. వాట్సప్ గ్రూప్‌లో వరుసగా వాయిస్ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. వినడానికేమో సమయానికి ఇయర్ ఫోన్సు అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాయిస్ సందేశాల్లో ఏముందో ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో మాత్రమే కనిపిస్తోంది. అయితే ఇది ట్రాన్స్‌లేటర్ కాదు. కేవలం ఏ భాషలో మెసేజ్ ఉంటుందో, ఆ భాషకు మాత్రమే అక్షర రూపాన్ని ఇస్తుంది. ఇది ఇంగ్లీష్, హిందీ సహా పలు భాషలకు సపోర్ట్ చేస్తుంది.