Cognizant New Campus in Hyderabad : ఐటీకార్యకలాపాల విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ మరో కొత్త క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా కొత్త ప్రాంగణానికి బుధవారం శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించి నూతన క్యాంపస్‌ను నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్న కాగ్నిజెంట్ సంస్థ, హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది. గడిచిన రెండేళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల నుంచి 7వేల 500 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు అదనంగా ఉద్యోగులను తీసుకుంటామని కాగ్నిజెంట్ ప్రకటించింది.