CM Revanth will Meeting with the Collectors : ఈనెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సచివాలయంలో 16వ తేదీన ఉదయం 9.30 గంటలకు సీఎం సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
ఇటీవలే అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సీఎం సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని క్షేత్రస్థాయిలో పాలన వ్యవస్థ మరింత పటిష్ఠం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ త్వరలో కరీంనగర్ జిల్లాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.