Olympic Medal Colour Shade: పారిస్ ఒలింపిక్ పతకంపై ఓ అథ్లెట్ షేర్ చేసిన పోస్ట్ వివాదానికి తెర లేపింది. ఈ ఒలింపిక్స్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్, వారానికే మెడల్ రంగు పోయిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈమేరకు పతకం తాజా ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దాని నాణ్యతను ప్రశ్నించాడు.
'ఈ ఒలింపిక్ పతకాలు కొత్తగా ఉన్నప్పుడు అద్భుతంగా కన్పించాయి. కానీ దాన్ని వేసుకున్నాక చెమట తగిలి రంగు మారిపోయింది. అనుకున్నంత నాణ్యతగా లేవు. కాస్త గరుకుగా మారిపోయింది. ముందువైపు రూపు మారింది. ఈ పతకాల నాణ్యతను మరింత పెంచితే బాగుంటుంది. ఈ పతకాన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తోంది' అని హ్యూస్టన్ పేర్కొన్నాడు.
కాగా, దీనిపై స్పందించిన ఒలింపిక్స్ అధికార ప్రతినిధి దీనిపై చర్యలు చేపట్టామని అన్నారు. డ్యామేజ్ అయిన మెడల్స్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.