Indian Dancer Yamini Krishnamurthy Died : ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (Yamini Krishnamurthy)(84) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్నారామె. ఈ క్రమంలోనే దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో 7 నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నారు. ఈ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే శనివారం కన్నుమూశారు.
కాగా, 1940లో మదనపల్లెలో జన్మించారు యామినీ కృష్ణమూర్తి. యామినీ తన కెరీర్లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగానూ యామినీ సేవలు అందించారు. దిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను స్థాపించి డ్యాన్స్‌లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం కూడా రచించారు.