Jammu and Kashmir Encounter : జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుప్వారా జిల్లాలో మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్ మొదలైనట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు ఉన్నారనే సమాచారం మేరకు జమ్ముకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కుప్వారాలోని కోవుట్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ముష్కరులు భద్రతా దళాలను సవాల్ చేస్తూ కాల్పులకు దిగటం వల్ల ఎన్‌కౌంటర్ మొదలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం కాగా మరో సైనికుడు గాయపడినట్లు ప్రకటించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు.
మరోవైపు, సోమవారం బట్టల్ సెక్టార్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. చికిత్స పొందుతూ ఆ సైనికుడు మంగళవారం మరణించినట్లు ఎక్స్ వేదికగా పేర్కొంది.