ప్రియాంక మృతి కేసులో ముమ్మర దర్యాప్తు - నిందితులతో సీన్ రీ-క్రియేషన్
రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద సీన్ రీ-క్రియేషన్ - నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఘటన జరిగిన తీరును మరోసారి పరిశీలించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 19, 2026 at 7:42 PM IST
Medico Priyanka Death Case : మెడికో ప్రియాంక మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు నిందితులు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ ఎడ్వర్డ్లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. దర్యాప్తులో భాగంగా రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద బుధవారం సీన్ రీ-క్రియేషన్ నిర్వహించారు.
సీన్ రీ-క్రియేషన్ : నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఘటన జరిగిన తీరును పోలీసులు మరోసారి పరిశీలించారు. ప్రియాంక స్కూటీపై వెళ్తున్న సమయంలో కారు ఎలా వచ్చింది? ఢీకొన్న తర్వాత ఏం జరిగింది. నిందితుల కదలికలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను సీన్ రీ-క్రియేషన్ ద్వారా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ అధికారి పాటిల్ సైతం సీన్ రీ-క్రియేషన్‌లో పాల్గొని ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
పక్కాగా ఆధారాల సేకరణ : నిందితుల వాంగ్మూలం, సీసీ కెమెరా దృశ్యాలు, ఇప్పటికే సేకరించిన ఆధారాలతో సీన్ రీ-క్రియేషన్ వివరాలను సరిపోల్చి చూస్తున్నట్లు సమాచారం. నిందితుల నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసులో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన ఆధారాలను పక్కాగా సేకరిస్తున్నారు. దీంతో పోలీసుల దర్యాప్తులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
కేసు నేపథ్యం : ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థితో కలిసి ఆమె ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వాహనాలు థియేటర్ గేటు వద్ద ఆగగా, అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దశ్వంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టారు. తర్వాత మరోసారి ఢీకొట్టి పైనుంచి కారు వెళ్లడంతో కింద పడిపోయిన ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 6న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రియాంక స్వస్థలం తెలంగాణ : చనిపోయిన మెడికో ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పూర్. తండ్రి వెంకటేశ్, చంద్రకళ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వెంకటేశ్ మొదట్లో స్వగ్రామంలో ఉంటూ హార్డ్‌వేర్ దుకాణం నడిపారు. తర్వాత పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేశారు. రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు మకాం మార్చారు. పెద్దమ్మాయి ప్రియాంక వైద్య విద్య చదువుతుండగా, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.
'ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత హైదరాబాద్‌కు రా' - శశిభవ్యతకు హీరో రామ్ వీడియో కాల్

