పురపాలక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథాతథం - స్పష్టం చేసిన ప్రభుత్వం
పురపాలక ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు యథాతథం - రాష్ట్రంలోని మొత్తం 123 పురపాలక సంఘాలకు గానూ 100 చోట్ల త్వరలో ఎన్నికలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 19, 2026 at 7:56 PM IST
AP Municipal Elections : రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణలో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేస్తూ ముందుకెళ్లాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.
100 చోట్ల త్వరలో ఎన్నికలు : పురపాలక శాఖ కమిషనర్, సంచాలకులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 123 పురపాలక సంఘాలకు గానూ 100 చోట్ల త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి పదవీకాలం పూర్తి చేసుకోనున్న మరో 13 స్థానిక సంస్థలకు కూడా ఇప్పుడే ఎన్నికలు జరపనున్నారు.
బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు : న్యాయపరమైన వివాదాలు, ఇతర సమస్యల కారణంగా మిగిలిన 23 పురపాలక సంఘాల్లో ప్రస్తుతానికి ఎన్నికలు సాధ్యపడవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, వెనుకబడిన తరగతులకు మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం - 1994 (సెక్షన్ 6, 14A), ఏపీ మున్సిపాలిటీల చట్టం -1965 (సెక్షన్ 8, 24)లో ఉన్న నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది.
నిధులు మంజూరు కావాలంటే : కేంద్ర ప్రభుత్వ 16వ ఆర్థిక సంఘం తాజా మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు మంజూరు కావాలంటే, ప్రజలచే ఎన్నికైన పాలకవర్గం తప్పనిసరిగా ఉండాలి. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగబద్ధమైన పాలనతో పాటు, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది.
పురపాలక శాఖ కమిషనర్‌కు ఆదేశాలు : రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆగస్టు 12న జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అన్ని చట్టపరమైన ప్రక్రియలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘంతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని పురపాలక శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
'ప్రోటోకాల్ ప్రకారం ఒక్కో ప్రక్రియ పూర్తి' - స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు

