లడ్డూ కల్తీ వ్యవహారంపై అట్టుడికిన మండలి - ఇరువురి వాదోపవాదాలతో గందరగోళం
తిరుమల లడ్డూ వ్యవహారంపై మండలిలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు - హెరిటేజ్‌ను కావాలనే కల్తీ వ్యవహారంలోకి లాగుతున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు - కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కుట్ర అంటూ ధ్వజం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 5:17 PM IST
YSRCP MLCs Protest in Council Over Heritage Issue: కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్సార్సీపీ దాన్నుంచి తప్పించుకునే ఎత్తుగడలు వేస్తోంది. హెరిటేజ్‌కు ముడిపెడుతూ శాసన మండలిలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేయడంతో శాసన మండలిలో కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. వారి ఆందోళనలపై దీటుగా సమాధానం ఇచ్చిన కూటమి మంత్రులు వైఎస్సార్సీపీ చేస్తున్న జిమ్మిక్కులు సహా వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు.
వైఎస్సార్సీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ నివేదిక తేల్చడంతో పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయిన వైఎస్సార్సీపీ దానినుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ ప్రారంభించింది. ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలను తెరపైకి తీసుకువచ్చి వాటిపై రాద్దాంతం చేసే ప్రయత్నం ప్రారంభించింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోందని, ఈ అంశంపై చర్చించాలని శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలి ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చారు.
ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు: ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్యల కారణంతో గంట ఆలస్యంగా సభ ప్రారంభం కాగా సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు తిరస్కరించారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోందని దీనిపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. మండలిలో ఆందోళనకు దిగారు. పోడియం ముందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్‌లు సమాధానం చెప్పారు.
పోడియం వద్ద నిరంతరంగా వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు విషయంలో వైఎస్సార్సీపీ వారు చేసిన పాపాల నుంచి ప్రజలను మళ్లించేందుకు సభలో డ్రామాలాడుతున్నారని ఆక్షేపించారు. హెరిటేజ్‌కు ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి, హెరిటేజ్ వల్ల ప్రభుత్వానికి కానీ, ప్రజలకు ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదన్నారు. టీటీడీలో కల్తీ లడ్డూ విషయంలో చేసిన పాపాల నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొససాగించడంతో సమావేశాన్ని శాసన మండలి ఛైర్మన్ కాసేపు వాయిదా వేశారు.
నినాదాల మధ్యే ప్రత్యేక అంశాల ప్రస్తావన: తొలిసారి విరామం అనంతరం తిరిగి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రత్యేక అంశాల ప్రస్తావనకు సభ్యులకు అవకాశం ఇచ్చారు. హెరిటేజ్ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొసాగించారు. వారి నినాదాల మధ్యే సభ్యులు ప్రత్యేక అంశాలను ప్రస్తావించారు. ఆందోళన విరమించాలని పలుమార్లు వైఎస్సార్సీపీ సభ్యులను మండలి ఛైర్మన్‌ను కోరినా ప్రయోజనం లేకపోయింది. ఆందోళన విరమిస్తే బడ్జెట్‌పై చర్చ చేపడతానని సభ్యులకు మండలి ఛైర్మన్ తెలిపినా వినలేదు. పోడియంను చుట్టు ముట్టి ఆందోళన కొనసాగించడంతో శాసన మండలిని రెండో సారి 15 నిముషాల పాటు వాయిదా వేశారు.
వాయిదా అనంతరం తిరిగి మండలి ప్రారంభమైనా వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. సభా కార్యకలాపాలు అడ్డుకునే ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలు తెచ్చి సభలోపెద్ద డ్రామా సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేవుళ్లు, హిందూ దేవుళ్లుపై పగబట్టినట్టుగా వైఎస్సార్సీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. హెరిటేజ్‌కు తిరుపతి లడ్డూకు ఎలాంటి సంబంధం లేదని అలాంటి సంస్థను తీసుకువచ్చి రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.
బుధవారానికి వాయిదా: తిరుమల పవిత్రతను దారుణంగా దెబ్బతీసింది ఎవరని చిన్న పిల్లలను అడిగినా జగన్ కుటుంబమే అని చెబుతారని అన్నారు. జగన్ బాబాయే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఒప్పుకుంటే చేసిన తప్పిదానికి లెంపలేసుకోవాల్సింది పోయి ఇంకా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసి కూరుకుపోయారని యావత్ హిందూ సమాజం ఛీ కొడుతుంటే సభను పక్కదారి పట్టించాలని ఉద్దేశంతో వచ్చి డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం ఆ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత బొత్సకు ఛైర్మన్ అవకాశం ఇచ్చారు. వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తూ అడ్డుపడటం, గందరగోళం నెలకొనడంతో సభ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు.
సవాళ్లు-ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన మండలి - గవర్నర్ ప్రసంగంపై వాడీవేడి చర్చ
సూపర్-6 హామీలపై మండలిలో ఘర్షణ - సీఎంను ‘కుప్పం ఎమ్మెల్యే’గా సంబోధించిన వైఎస్సార్సీపీ

