'స్థానిక పోరుకు సిద్ధం కండి' - పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ పిలుపు - గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం - తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో జగన్ సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 19, 2026 at 9:33 PM IST
YS Jagan on Local Body Polls : త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారని, వాటన్నింటినీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని జగన్ ఆరోపించారు.
ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడడం చూస్తుంటే ఆ స్థాయికి వ్యవస్థలు దిగజారాయని జగన్ పేర్కొన్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారని కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారని అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారన్నారు. మరో సంవత్సరంలో తన పాదయాత్ర మొదలవుతుందని ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయం అనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
"కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయి. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడడం చూస్తుంటే ఆ స్థాయికి వ్యవస్థలు దిగజారాయి. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారని కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారని అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. మరో సంవత్సరంలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే విజయం." - వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి
సభకు రాని వారు ఎమ్మెల్యేగా ఎందుకు?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
జగన్ కర్నూలు జిల్లా పర్యటన - వైఎస్సార్సీపీ శ్రేణుల అత్యుత్సాహంతో ప్రజలకు తిప్పలు

